దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
వనజాతాక్ష! భవత్పదాబ్జయుగ సేవాసక్తు లైనట్టి య
జ్జనముల్ మృత్యుశిరంబుఁదన్ని ఘనసంసారాంబుధిన్ దాఁటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తిఁ బొందుదురు శుంభద్వైభవోపేతులై.
టీకా:
వనజాతాక్ష = పద్మాక్ష, కృష్ణా; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అను; అబ్జ = పద్మముల; యుగ = జంట యందు; సేవా = కొలచుట యందు; ఆసక్తులు = ఆసక్తికలవారు; ఐనట్టి = అయినట్టి; ఆ = అట్టి; జనముల్ = వారు; మృత్యు = చావును; శిరంబుదన్ని = జయించి; ఘన = మిక్కుటమైన; సంసార = సంసారము అను; అంబుధిన్ = సముద్రమును; దాటి = తరించి; పావనులు = పవిత్రులు; ఐ = అయ్యి; లోకములున్ = లోకులు అందరిని; పవిత్రములు = పరిశుద్ధులు; కాన్ = అగునట్లు; వర్తించుచున్ = మెలగుచు; నిత్య = శాశ్వతములైన; శోభనము = శుభములతో; ఒప్పడి = చక్కటి; ముక్తిన్ = మోక్షమును; పొందుదురు = పొందుతారు; శుంభత్ = మేలైన; వైభవ = వైభవములతో; ఉపేతులు = కూడుకొన్నవారు; ఐ = అయ్యి.
భావము:
ఓ దేవా! పరమ భాగవతులు సదా నీ పాదసేవలో నిమగ్నులు అయి ఉంటారు. వారు మృత్యువును జయించి; భవసాగారాన్ని తరించి; జననమరణ పరంపరలకు గురికాక; పవిత్రులై లోకాలను పవిత్రం చేస్తూ; మహద్వైభవములతో ముక్తిని అందుకుంటారు.