దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమునఁ దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్
క్రమమున నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
టీకా:
యమ = యమము {అష్టాంగయోగము - 1యమము 2నియమము 3ప్రాణాయామము 4ప్రత్యాహారము 5ధ్యానము 6ధారణ 7మననము 8సమాధి}; నియమ = నియమము; ఆది = మున్నగు; యోగ = యోగాభ్యాసములచేత; మహిత = శుద్ధములైన; ఆత్మకులు = మనసులు కలవారు; ఐన = అయిన; ముని = ముని; ఇంద్రులున్ = ఉత్తములూ; విరోధమునన్ = శత్రుత్వముచేత; తలంచు = తలచుకొనెడి; చైద్యవసుధావర = శిశుపాలుడు {చైద్యవసుధావరుడు - చేదిదేశపు రాజు, శశిపాలుడు}; ముఖ్య = మున్నగు; నృపుల్ = రాజులూ; ఫణీ = పాములలో; ఇంద్ర = శ్రేష్ఠుల; భోగములనన్ = దేహములు; అనన్ = అనగా; ఒప్పు = సరిపోలి ఉండు; బాహువులున్ = చేతులు; కల్గిన = కలిగినట్టి; నిన్నున్ = నిన్ను; భజించు = సేవించెడి; గోపికల్ = గొల్ల యువతులూ; క్రమమునన్ = అదే వరుసలో; నేమునున్ = మేము; సరియ = సమానులమే; కామె = కదా; భవత్ = నీ యొక్క; కృప = దయ; కున్ = కు; అంబుజోదర = కృష్ణా.
భావము:
జితేంద్రియులూ పరమశాంతమూర్తులూ అయిన యోగులూ; శత్రుభావంతో నిన్ను తలపోసే శిశుపాలాది రాజన్యులూ; ఆదిశేష నాగుని పోలిన బాహువులతో నిండైన నిన్ను భక్తితో ఆరాధించే గోపికలూ; తరువాత మేమూ; నీ దివ్యమైన కృపకు సమానంగా పాత్రులం కావటంలో సందేహం లేదు.