దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
మఱియు వివిధకాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుఁడై తరతమభావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులయిన విచిత్రశరీరంబులయందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై బ్రహ్మంబయిన నిన్ను నైహికాముష్మిక ఫలసంగమంబు లేక విగతరజోగుణంబులందగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక, దేవా! భవదీయ సంకల్పాధీనంబులయిన శరీరంబులం బ్రవేశించియున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకం బయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థులగుదురు మఱియును.
టీకా:
మఱియున్ = ఇంకను; వివిధ = నానా విధములైన; కాష్ఠ = కఱ్ఱల; అతర్గతుండు = లోపల నుండువాడు; ఐన = అయిన; వాయుసఖుండు = అగ్నిహోత్రుడు; తత్ = వాటి; గత = అందలి; దోషంబునన్ = దోషములను, వంకరలను; పొరయక = పొందకుండ; నిత్య = ఎల్లప్పుడును; శుద్ధుడు = శుద్ధముగా నుండువాడు; ఐ = అయ్యి; తర = అధిక్యము; తమ = సర్వాధిక్య; భావంబునన్ = లక్షణములతో; వర్తించున్ = మెలగెడి; చందంబునన్ = విధముగ; స్వ = తన యొక్క; సంకల్ప = సంకల్పముచేత; కృతంబులు = చేయబడినవి; అయిన = ఐన; విచిత్ర = ఆశ్చర్యకరములైన; శరీరంబులన్ = దేహముల; అందున్ = అందును; అంతర్యామివి = లోపల నుండువాడవు {అంతర్యామి - జీవత్మలో నుండెడి పరమాత్మ}; ఐ = అయ్యి; ప్రవేశించి = చేరి; తత్తత్ = ఆయా; విచిత్ర = విచిత్రములైన; యోని = గర్భము నందు; గతంబు = ఉండునవి; ఐన = అయిన; హేయంబులన్ = దోషములను; పొరయక = పొందకుండ; సకల = సర్వమును; ఆత్మన్ = తనకు; సమంబు = సమానముగా; ఐ = ఉండి; బ్రహ్మంబు = పరబ్రహ్మతత్వము; అయిన = ఐన; నిన్నున్ = నిన్ను; ఐహిక = ఇహలోకపు; ఆముష్మిక = పరలోకపు; ఫల = ప్రయోజనముల; సంగమంబు = సంబంధము; లేక = లేకుండా; విగత = తొలగిన; రజోగుణంబులన్ = రజోగుణము లందు; తగిలి = ఆసక్తులై; కొందఱు = కొంతమంది; భజియించుచున్ = సేవించుచు; ఉండుదురు = ఉంటారు; అదియున్ = అంతే; కాక = కాకుండ; దేవా = భగవంతుడా; భవదీయ = నీ యొక్క; సంకల్ప = సంకల్పమునకు; ఆధీనంబులు = లోబడినవి; అయిన = ఐన; శరీరంబులన్ = దేహము లందు; ప్రవేశించి = దూరి; ఉన్న = ఉన్నట్టి; జీవ = ప్రాణుల; సమూహంబున్ = సమూహములు; నీ = నీ; కున్ = కు; శేషభూతంబు = మిగిలి ఉండునవి; అని = అని; తెలిసి = తెలిసి; కొందఱు = కొంతమంది; భవ = పునర్జన్మల, సంసార; నివారకంబు = తొలగించునది; అయిన = ఐన; శ్రీమత్త్వత్ = మోక్షసంపద కలిగించెడి; చరణ = పాదములు అను; అరవిందంబులున్ = పద్మములు; సేవించి = కొలిచి; కృతార్థులు = ధన్యులు; అగుదురు = ఔతారు; మఱియును = ఇంకను.
భావము:
దేవా! కఱ్ఱకు ఎన్ని వంకరలు ఉన్నా, కఱ్ఱలో అంతర్గతంగా ఉండే అగ్నిహోత్రునికి ఆ వంకరలు అంటవు కదా అలాగే. నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విశిష్ఠంగా చిత్రించి ఆ శరీరాలలో అంతర్యామిగా ఉన్నప్పటికీ, ఆయా శరీరుల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములై ఫలాపేక్షలేక రజోగుణాన్ని వదలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసినవారు భగవంతుడవైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరులౌతారు.