దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబులఁ బెం
పారఁగ నందుచు నుందురు
ధీరజనోత్తము లనంగ దివిజారిహరా!
టీకా:
కోరి = ఆపేక్షించి; శరీరులు = జీవులు; భవత్ = నిన్ను; అనుసారంబునన్ = అనుసరించుటచేత; ఇహ = ఈ లోకములో; పర = పరలోకములో; ఏక = ముఖ్యమైన; సౌఖ్యంబులన్ = సుఖానుభవములను; పెంపారగన్ = అధికముగ; అందుచుందురు = పొందుతుంటారు; ధీరజన = ఙ్ఞానసంపన్ను లైన వారిలో; ఉత్తములు = ఉత్తములు; అనంగన్ = అనగా; దివిజారిహరా = కృష్ణా {దివిజారి హరుడు - దేవతశత్రువు (రాక్షసు)లను సంహరించువాడు, విష్ణువు}.
భావము:
ఓ అసుర సంహారా! నామ రూప ధారులు నిన్ను భజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది గొప్పవారని ప్రసిద్ధులు అవుతారు.