దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
అనయంబు దేహి నిత్యానిత్య సద్విల-
క్షణమునఁ బంచకోశవ్యవస్థ
నభివృద్ధిఁ బొరయుచు నందులోపల నున్న-
ప్రాణాన్నబుద్ధి విజ్ఞానమయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుఁగొందు-
నానందమయుఁ డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరి-
గ్రహము గల్గుటఁ జేసి కాదె ప్రకృతి
- ఉపకరణాలు:
మహ దహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూతపంచకాది
కలిత తత్త్వముల్ బ్రహ్మాండకార్య కరణ
మందు నెపుడు సమర్థంబు లగుటఁ జూడ.
టీకా:
అనయంబున్ = ఎల్లప్పుడు; దేహి = జీవుడు; నిత్యా = శాశ్వతము; అనిత్య = అశాశ్వతము అను; సత్ = శ్రేష్ఠమైన; విలక్షణమునన్ = విశిష్టలక్షణములు కల; పంచకోశ = అన్నకోశాదుల {పంచకోశములు - 1అన్నమయము 2ప్రాణమయము 3మనోమయము 4విఙ్ఞానమయము 5ఆనందమయము}; వ్యవస్థన్ = వ్యవస్థలచేత; అభివృద్ధిన్ = పెరుగుటను; పొరయుచున్ = పొందుతు; అందు = దాని; లోపలన్ = లోన; ఉన్న = ఉన్నట్టి; ప్రాణ = ప్రాణమయము; అన్న = అన్నమయము; బుద్ధి = బుద్ధిమయము; విఙ్ఞాన = విఙ్ఞాన; మయములు = మయములు; అను = అనెడి; చతుష్ = నాలుగు (4); కోశంబుల = కోశములకు; అవ్వల = పైన; వెలుగొందు = ప్రకాశించెడి; ఆనందమయుడవు = ఆనందమయకోశ రూపుడవు; కాన = కాబట్టి; దేవ = భగవంతుడా; సు = మిక్కలి; రుచిర = కాంతివంతమైన; స్వ = స్వయముగా; ప్రకాశుండవు = ప్రకాశించువాడవు; నీ = నీ యొక్క; పరిగ్రహమున్ = అనుగ్రము; కల్గుటన్ = లభించుట; చేసి = చేతనే; కాదె = కదా; ప్రకృతి = అవ్యక్తము.
మహత్ = మహత్తు; అహంకార = అహంకారము; పంచతన్మాత్ర = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధములు}; గగన = ఆకాశము; పవన = వాయువు; తేజంబు = అగ్ని; అంబు = జలము; భూ = భూమి అను; భూతపంచక = పంచభూతములు; ఆది = మున్నగువానిచేత; కలిత = కూడిన; తత్వముల్ = తత్వములు {తత్వములు - 1ప్రకృతి 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు (5) భూతపంచకము (5)మున్నగునవి}; బ్రహ్మాండ = సృష్టిస్థితిలయములను, సమస్తజగత్తులలోని; కార్య = కార్యములను; కరణ = కావించుట; అందున్ = లో; ఎపుడున్ = ఎల్లప్పుడు; సమర్థంబులు = సామర్థ్యముకలవి; అగుటన్ = ఐఉంటుట; చూడన్ = తరచిచూసినచో.
భావము:
ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల యొక్క శాశ్వతమూ అశాశ్వతమూ అనే లక్షణాల వలన జీవులు అభివృద్ధి పొందుతూంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయకోశానికి చెంది ప్రాణమయ, అన్నమయ, బుద్ధిమయ, విజ్ఞానమయ నాలుగు కోశాలకు పరమై నీవు స్వయంప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అనుగ్రహం ఉన్నందు వలనే కదా ఈ ప్రకృతీ, మహత్తూ, అహంకారమూ; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలూ; పంచభూతాలైన భూమీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మున్నగునవి అన్నీ ఈ సమస్త సృష్టి, స్థితి, లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నాయి.