దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
"జయజయ హరి! దేవ! సకలజంతువులకు-
జ్ఞానప్రదుండవుగాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సం-
తానంబుగాఁ గొని జ్ఞానశక్తి
ముఖ్యషడ్గుణ పరిపూర్ణతఁ జేసి మా-
యాత్మవిశిష్టుండ వగుచుఁ గార్య
కారణాత్మకుఁడవై కడఁగి చరించుచు-
నున్న నీయందుఁ బయోరుహాక్ష!
- ఉపకరణాలు:
తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన
ప్రకట త్రిగుణాత్మకం బైన ప్రకృతితోడి
యోగ మింతయు మాన్పవే! యోగిమాన
సాంబుజాత మధువ్రత!" యని నుతించి.
టీకా:
జయజయ = జయము జయము; హరి = కృష్ణా {హరి - ప్రళయకాలమున సకల లోకములను లయింపజేసికొనువాడు, విష్ణువు}; దేవా = కృష్ణా {దేవుడు - దీవ్యత ఇతి ద్వః, ధాతువు, దివ్ విజిగీషా స్వప్న కాంతి గతిషు.}; సకల = సమస్తమైన; జంతువుల్ = ప్రాణుల; కున్ = కు; ఙ్ఞాన = ఙ్ఞానమును; ప్రదుండవు = ఇచ్చువాడవు; కాన = కాబట్టి; వారి = వారల; వలన = వలన; దోషంబులు = తప్పులు, పొరపాట్లు; కలిగినన్ = కలిగినను; సుగుణ = మంచిగుణముల; సంతానంబు = సమూహము; కాన్ = ఐనట్లు; కొని = తీసుకొని; ఙ్ఞాన = ఙ్ఞానమునందు; శక్తి = సమర్థతలు; ముఖ్య = మొదలగు; షడ్గుణ = షడ్గుణములచేత {షడ్గుణములు - 1ఙ్ఞానము 2ఐశ్వర్యము 3వీర్యము 4యశము 5శ్రీ 6వైరాగ్యము ఇవి భగవంతుని షడ్గుణములు.}; పరిపూర్ణతన = పరిపూర్ణత్వము; చేసి = వలన; మా = మా యొక్క; ఆత్మ = ఆతమలలో; అవశిష్టుండవు = శేషించినవాడవు; అగుచున్ = ఔతు; కార్య = కార్యము {కార్యము - ప్రపంచము}; కారణ = కారణములు(రెండు) {కారణము - ప్రపంచసృష్టికి కారణములు ఐన అవ్యక్తము మహత్తు అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు}; ఆత్మకుండవు = తానేఐనవాడవు {ఆత్మకుండవు - స్వరూపుడవు}; ఐ = అయ్యి; కడగి = పూని; చరించుచున్ = వర్తించుచు; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ; అందున్ = అందు; పయోరుహాక్ష = పద్మాక్ష, కృష్ణా.
తివిరి = యత్నించి; ఆమ్నాయములు = వేదములు; ప్రవర్తించున్ = ఉండును, పుట్టును; కానన్ = కనుక; ప్రకట = ప్రసిద్ధములైన; త్రిగుణా = త్రిగుణముల {త్రిగుణములు - సత్వరజస్తమో గుణములు}; ఆత్మకంబు = కలది; ఐన = అయినట్టి; ప్రకృతి = మాయ; తోడి = తోటి; యోగమున్ = కూడికను; ఇంతయున్ = ఇది అంతటిని; మాన్పవే = తొలగిచుము; యోగి = ఋషుల యొక్క; మానస = మనస్సులు అను; అంబుజాత = పద్మముల యందు; మధువ్రత = తుమ్మెదవంటివాడా; అని = అని; నుతించి = స్తుతించి.
భావము:
“ఓ దేవ! శ్రీహరి! పద్మాక్షా! మహర్షి మానస విహారా! నీకు జయమగు గాక, నీవు సకల ప్రాణులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. కనుక, ఆ జీవుల వలన దోషాలు ఏమి కలిగిన మంచి తనయులనుగానే స్వీకరిస్తావు. భాగవత సద్గుణైశ్వర్య సంపన్నుండవు కావున, మా అందరిలోను ఆత్మరూపంతో ఉంటావు. కార్యకారణాత్మకుడవై ప్రవర్తిస్తుంటావు. నీ లోనే సకలవేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలు అనే త్రిగుణాత్మక ప్రకృతితో మా కున్న బంధాన్ని ఛేదించు.” అని భగవంతుని కీర్తించి