పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు

  •  
  •  
  •  

10.2-1203-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పిన బాదరాయణికి నభిమన్యునందనుం డిట్లనియె “మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యం బైన బ్రహ్మంబునందు సత్త్వాది గుణగోచరంబులైన వేదంబులే క్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నాకెఱిఁగింపు” మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; “సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియమనః ప్రాణశరీరంబు లను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకల నిగమసమూహంబులును దత్స్వరూప గుణవైభవప్రతిపాదకంబులు గావున, ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేక పూర్వఋషి పరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగునొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుం డైన నారాయణఋషిం గనుంగొని నీవు నన్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు మున్నీయర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీ కెఱింగించెద” నని చెప్పందొడంగె; “శయానుం డైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమ దక్షతాది చిహ్నంబు లను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున ననేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబుసేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱుంగు విను"మని యిట్లనియె.

టీకా:

అని = అని; చెప్పినన్ = చెప్పగా; బాదరాయణి = శుకమహర్షి {బాదరాయణి - బదరీవనమున ఉండువాడు బాదరాయణుడు (వ్యాసమహర్షి) వారి పుత్రుడు బాదరాయణి (శుకమహర్షి)}; కిన్ = కి; అభిమన్యునందనుండు = పరీక్షిన్మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ముని = ముని; ఇంద్రా = ఉత్తముడా; ఘట = కుండ; పట = వస్త్రము; ఆది = మొదలగు; వస్తు = వస్తువుల; జాతంబున్ = సముదాయము; భంగిన్ = వలె; నిర్దేశింపన్ = ఇట్టిది అని చెప్పను; అర్హంబు = వీలు, యుక్తమైనది; కాక = కాకుండ; సత్వాదిగుణ = త్రిగుణముల {సత్వాది - గుణత్రయము, 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; శూన్యంబు = లేనిది; ఐన = అయినట్టి; బ్రహ్మంబున్ = పరతత్వము; అందున్ = అందు; సత్వాది = గుణత్రయముల; గుణ = గుణములతో; గోచరంబులు = తోచునవి; ఐన = అయినట్టి; వేదంబులు = వేదములు; ఏ = ఏ; క్రమంబునన్ = ప్రకారము; ప్రవర్తించును = ప్రతిపాదించును; అట్టి = అటువంటి; చందంబు = విధానము; నా = నా; కున్ = కు; ఎఱిగింపుము = తెలుపుము; అనినన్ = అనగా; భూవరున్ = రాజున; కున్ = కు; ముని = ముని; వరుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; సకల = సమస్తమైన; చేతన = ప్రాణము కలవాని; అచేతన = ప్రాణము లేనివాని; అంతరన్ = లోపల; యామి = వ్యాపించినవాడు; ఐన = అయినట్టి; సర్వేశ్వరుండు = కృష్ణుడు {సర్వేశ్వరుడు - సమస్తమును నియమించువాడు, విష్ణువు}; సర్వశబ్దవాచ్యుండు = కృష్ణుడు {సర్వశబ్దవాచ్యుండు - సర్వ శబ్దముచే తెలియబడు వాడు, ప్రమాణ శ్లో. సర్వగత్వాదనంతస్య సఏవాహ మనస్థితః, మత్తస్సర్వమహం సర్వం మయి సర్వం సనాతనః., విష్ణువు}; కావునన్ = కనుక; సకల = ఎల్ల; జంతు = స్థావర జంగములైన జంతు; నివహంబులు = జాలము; అందున్ = అందు; బుద్ధిః = బుద్ధి {బుద్ధి - నిశ్చయాత్మకమైన అంతఃకరణము}; ఇంద్రియ = దశేంద్రియములు {దశేంద్రియములు - ఙ్ఞానేంద్రియ పంచకము మరియు కర్మేంద్రియపంచకము, మొత్తం పది ఇంద్రియములు}; మనః = మనస్సు {మనస్సు - సంకల్పాత్మకమైన అంతఃకరణము}; ప్రాణ = పంచప్రాణములు {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; శరీరంబులు = దేహత్రయములు {దేహత్రయము - 1స్థూలశరీరము 2సూక్ష్మశరీరము 3కారణశరీరములు}; సృజియించి = కలుగజేసి; చేతన = ఎల్ల ప్రాణుల; వర్గంబున్ = సమూహమున; కున్ = కు; ఙ్ఞాన = తెలివిని; ప్రదుండు = ఇచ్చువాడు; అగున్ = అగును; కావునన్ = కాబట్టి; సకల = సమస్త; నిగమ = వేదముల; సమూహంబులును = సమూహములు; తత్ = అతని, అట్టివాని; స్వరూప = శుభ స్వరూపములను {శుభస్వరూపములు - సచ్చిదానందాది స్వరూపములు}; గుణ = శుభ గుణములను {శుభగుణములు - సర్వజ్ఞత్వాది గుణములు}; వైభవ = వైభవములను; ప్రతిపాదికంబులు = విశదపరచునవి; కావునన్ = కాబట్టి; ముఖ్యంబు = ప్రధానము; ఐ = అయ్యి; ప్రవర్తించు = ఉండునట్టి; శ్రుతి = వేద రూపమైన; స్తోత్రంబున్ = స్తోత్రము; ఉపనిషత్ = ఉపనిషత్తులో; తుల్యంబు = సమానమైనది; అనేక = అసంఖ్యాకులైన; పూర్వ = పూర్వకాలపు; ఋషి = ఋషుల; పరంపర = పరంపరలనుండి; ఆయతంబునున్ = వచ్చినిది; ఐన = అయినట్టి; దీనిని = దీనిని; శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ఎవ్వండునున్ = ఎవరైతే; అనుసంధించున్ = పఠించునో; అతని = వాని; కిన్ = కి; మోక్షంబు = ముక్తి; సులభంబు = సుళువుగా దొరుకునది; దీని = ఈ విషయమున; కిన్ = కు; నారాయణ = నారాయణునిచే; ఆఖ్యాతంబు = చెప్పబడినది; అగు = ఐన; ఒక్క = ఒకానొక; ఉపాఖ్యానంబు = వృత్తాంతము; కలదు = ఉన్నది; వినిపింతున్ = చెప్పెదను; వినుము = వినుము; భగవత్ = నారాయణునికి; ప్రియుండు = ఇష్టమైనవాడు; ఐన = అగు; నారదుండు = నారదుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; నారాయణాశ్రమంబు = నారాయణాశ్రమమున {నారాయణాశ్రమము - నారాయణ ఋషి యొక్క ఆశ్రమము}; కున్ = కు; చని = వెళ్ళి; ఋషి = మునుల; గణ = సమూహములతో; సమేతుండు = కూడి ఉన్నవాడు; ఐన = అయినట్టి; నారాయణఋషిన్ = నారాయణఋషిని; కనుంగొని = చూసి; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగిన = ప్రశ్నించిన; అట్ల = ఆ విధముగనే; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిని; అడిగినన్ = అడుగగా; అతండు = అతను; మున్ను = మునుపు; ఈ = ఈ; అర్థంబున్ = విషయమును; శ్వేతద్వీప = శ్వేతద్వీపమున; వాసులు = నివసించువారు; ఐన = అయినట్టి; సనకసనందనాది = సనకాది {సనకాదులు - 1సనకుడు 2సనందనుడు 3సనత్సుజాతుడు 4సనత్కుమారుడు}; దివ్య = దేవ; యోగి = ఋషి; ఇంద్రులు = ఉత్తములు; ప్రశ్నసలిపినన్ = చర్చించుకొనుచుండగ; వారల = వారి; కున్ = కి; సనందనుండు = సనందనుడు; చెప్పిన = చెప్పిన; ప్రకారంబు = విధముగా; నీ = నీ; కున్ = కు; ఎఱింగించెదను = తెలిపెదను; అని = అని; చెప్పన్ = చెప్పట; తొడంగె = మొదలిడెను; శయానుండు = పరుండి యున్నవాడు; ఐన = అయినట్టి; రాజ = రాజ; శ్రేష్ఠునిన్ = ఉత్తముని; తత్ = అతని; పరాక్రమ = పరాక్రమము; దక్షత = సమర్థతల; ఆది = మున్నగువాని; చిహ్నంబులను = గుర్తులను; నుతియించు = స్తోత్రములు చేయు; వంది = స్తుతిపాఠకుల; జనంబులు = సమూహము; చందంబునన్ = విధముగ; జగత్ = లోకములకు; అవసాన = ప్రళయకాల; సమయంబునన్ = సమయమునందు; అనేక = పెక్కు; శక్తి = శక్తులతో; యుతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; యోగనిద్రా = యోగనిద్రలో; పరవశుండు = మునిగినవాడు; ఐన = అయినట్టి; సర్వేశ్వరుని = సర్వనియాకుని; వేదంబులు = వేదములు; స్తోత్రంబున్ = స్తుతించుట; చేయు = చేసెడి; విధంబున్ = విదానమును; నారాయణుండు = నారాయణడు; నారదున్ = నారదుని; కున్ = కి; చెప్పినిన్ = చెప్పగా; తెఱంగు = విధమున; వినుము = వినుము; అని = అని; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

ఇలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు. “శుకమహర్షి! ఘటపటాదులలాగా నిర్దేశించటానికి వీలుగాకుండా సత్త్వాది గుణశూన్యమైన బ్రహ్మముతో సత్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసింది” అని కోరాడు అందుకు శుకయోగీంద్రుడు పరీక్షన్నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. “సకల చరాచరములందు సర్వాంతర్యామియై ఉండు భగవంతుడు సమస్త చేతన వర్గానికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కనుక వేదాదులు సర్వం ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శ్రుతిస్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. ఎందరో మహర్షులు పూర్వం ప్రసాదించిన ఇది పరంపరాగతంగా అందుతోంది. దీనిని శ్రద్ధాపూర్వకంగా అనుసంధించే వారికి మోక్షం సులభ సాధ్యం అవుతుంది. దీనికి దృష్టాంతంగా నారాయణోపాఖ్యానము అనే ఒక పురాణకథ ఉంది. చెప్తాను, విను. పానుపుమీద పడుకుని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్ధ్యాలను వందిమాగధులు కొనియాడేవిధంగా కల్పాంతసమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుడిని వేదాలు స్తోత్రం చేసే పద్ధతి (శ్రుతిగీతలు) ఎలాంటిదో పూర్వం సనందుడనే ముని, శ్వేతద్వీపవాసులైన సనకాది మునులు పరస్పరం చర్చించుకునే సందర్భంలో విశదీకరించాడు. దానిని నారాయణముని తన దగ్గరకు విచ్చేసిన నారదుడికి చెప్పాడు. ఆ వృత్తాతం వివరిస్తాను” అని శుకుడు పరీక్షత్తునకు ఇలా చెప్పసాగాడు.