దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు
- ఉపకరణాలు:
"నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ-
దీపించు నట్టి విదేహదేశ
మందు భూకాంతకు నాననదర్పణం-
బనఁ దనర్చిన మిథి లను పురమునఁ
గలఁడు శ్రీహరిపాదకంజాత భక్తుండు,-
గళితరాగాది వికారుఁ, డమల
చరితుఁ, డక్రోధుండు, శాంతుండు, నిగమార్థ-
కోవిదుం, డగు శ్రుతదేవుఁ డనెడి
- ఉపకరణాలు:
భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ
తంబు తుషమైన హేమ శైలంబు గాఁగఁ
దలఁచి పరితోష మందుచుఁ దగ గృహస్థ
ధర్మమున నుండె సముచితకర్ముఁ డగుచు.
టీకా:
నరనాథ = రాజా; విను = వినుము; భువన = లోకమునందు; ప్రసిద్ధంబుగన్ = ప్రసిద్ధముగా; దీపించున్ = ప్రకాశించే; అట్టి = అటువంటి; విదేహ = విదేహ అను; దేశము = దేశము; అందున్ = లో; భూకాంత = భూదేవి; కున్ = కి; ఆనన = ముఖము; దర్పణంబు = చూసుకొను అద్దము; అనన్ = అనగా; తనర్చిన = అతిశయించిన; మిథిల = మిథిల; అను = అనెడి; పురమునన్ = పట్టణమున; కలడు = ఉన్నాడు; శ్రీహరి = శ్రీకృష్ణుని; పాద = పాదములు అను; కంజాత = కమలముల; భక్తుండు = భక్తుడు; గళిత = తొలగిన; రాగ = రాగద్వేషములు {రాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము}; ఆది = మున్నగు; వికారుడు = వికారములు కలవాడు; అమల = నిర్మలమైన; చరితుడు = నడవడిక కలవాడు; అక్రోధుడు = కోపములేనివాడు; శాంతుడు = ఓర్పుకలవాడు; నిగమ = వేదముల; అర్థ = అర్ధములు; కోవిదుండు = విశదముగాతెలిసినవాడు; అగు = ఐన; శ్రుతదేవుడు = శ్రుతదేవుడు; అనెడి = అను.
భూసుర = విప్ర; ఉత్తముడు = ఉత్తముడు; ఒకడు = ఒకానొకడు; అనిచ్ఛా = కోరకుండా; సమాగతంబున్ = వచ్చినదానిని; తుషము = ఊకపొల్లు; ఐనన్ = అయినప్పటికి; హేమ = బంగారు; శైలంబు = కొండ; కాగన్ = ఐనట్లుగా; తలచి = భావించి; పరితోషమున్ = సంతోషమును; అందుచున్ = పొందుతు; తగ = యుక్తమైన; గృహస్థధర్మమునన్ = గృహస్థాశ్రమమున; ఉండెన్ = ఉండెను; సముచిత = తగినట్టి; కర్ముడు = కర్మములు చేయువాడు; అగుచున్ = ఔతు.
భావము:
“ఓ మహారాజా! మిథిలానగరం లోకప్రసిద్ధమైన విదేహదేశంలో భూదేవి ముఖానికి తళుకుటద్దంవలె ఉంటుంది. ఆ నగరంలో శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప హరిభక్తుడు; రాగాది వికారాలు లేనివాడు; వినిర్మలచరిత్రుడు; కోపము లేని పూర్తి శాంత స్వభావుడు; వేదార్థాలు తెలిసినవాడు; అతడు తనంత తానుగా ప్రాప్తించింది లేశమైనా దాన్ని మేరుపర్వత మంతగా భావించి సంతృప్తి చెందేవాడు. శ్రుతదేవుడు నిత్యమూ విద్యుక్తకర్మలను నిర్వహిస్తూ గృహస్థధర్మాన్ని పాలిస్తూ ఉండేవాడు.
- ఉపకరణాలు:
ఆ పురి నేలువాఁడు బహుళాశ్వుఁడు నా నుతి కెక్కినట్టి ధా
త్రీపతి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుఁడై
యే పనులందు ధర్మగతి నేమఱఁ కర్థిఁ జరించుచుండె ల
క్ష్మీపతి వారిపైఁ గరుణఁ జేసి ప్రసన్నముఖాంబుజాతుఁడై.
టీకా:
ఆ = ఆ యొక్క; పురిన్ = పట్టణమును; ఏలువాడు = పాలించువాడు; బహుళాశ్వుడు = బహుళాశ్వుడు; నాన్ = అనగా; నుతికెక్కినట్టి = ప్రసిద్ధిచెందిన; ధాత్రీపతి = రాజు; ఆ = ఆ యొక్క; ధరామరుని = బ్రాహ్మణుని; రీతిన్ = వలెనె; నిష్కలుష = కపటములేని; అంతరంగుడు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; ఏ = ఎట్టి; పనులు = కార్యములు; అందున్ = అందు; ధర్మగతిన్ = ధర్మమార్గమును; ఏమఱక = తప్పకుండ; అర్థిన్ = కోరి; చరించుచుండెన్ = మెలగుచుండెను; లక్ష్మీపతి = కృష్ణుడు; వారి = వారల; పైన్ = మీది; కరుణన్ = దయ; చేసి = కలవాడై; ప్రసన్న = అనుగ్రహించెడి; ముఖ = మోము; అంబుజాతుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి.
భావము:
ఆ నగరానికి రాజు బహుళాశ్వుడనే నామాంతరంగల జనకుడు. అతడు శ్రుతదేవుని వలెనే నిర్మలాంతరంగుడై ఏపనిచేసినా ధర్మాన్ని విస్మరించకుండా జీవిస్తున్నాడు శ్రీకృష్ణునికి వారిద్దరిమీద అనుగ్రహంకలిగింది
- ఉపకరణాలు:
అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద, వామదేవాత్రి, కృష్ణ, రామ, సితారుణ, దివిజగురు, కణ్వ, మైత్రేయ, చ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక, ధన్వ, కురుజాంగల, వంగ ,మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు.
టీకా:
అట్లు = ఆ విధముగ; కృష్ణుండు = కృష్ణుడు; వారలన్ = వారిని; చూచు = చూడవలెనని; వేడ్కన్ = కుతూహలముతో; నిజ = తన; స్యందనన్ = రథముపై; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; నారద = నారదుడు; వామదేవ = వామదేవుడు; అత్రి = అత్రి; కృష్ణ = కృష్ణద్వైపాయనుడు; రామ = పరశు రాముడు; అసిత = అసితుడు; అరుణ = అరుణుడు; దివిజగురు = బృహస్పతి; కణ్వ = కణ్వుడు; మైత్రేయ = మైత్రేయుడు; చ్యవనలును = చ్యవనులు; నేనునున్ = నేను; మొదలైన = మొదలగు; మునులున్ = ఋషులు; అనుగమింపన్ = అనుసరించుచుండగా; చనుచున్ = వెళ్తూ; తత్తత్ = ఆయా; దేశ = దేశ మందలి; నివాసులు = ఉండువారు; అగు = ఐన; ఆనర్తక = ఆనర్తకము; ధన్వ = ధన్వము; కురు = కురు; జాంగల = జాంగలము; వంగ = వంగ; మత్స్య = మత్స్య; పాంచాల = పాంచాల; కుంతి = కుంతి; మధు = మధు; కేకయ = కేకయ; కోసలాది = కోసల; ఆది = మున్నగు; భూవరులు = రాజులు; వివిధ = నానావిధములైన; వస్తు = వస్తువుల; ప్రచయంబున్ = పెద్దసమూహములను; కానికలు = బహుమతులుగ; ఇచ్చి = ఇచ్చి; సేవింపన్ = కొలువగా; గ్రహ = శుక్రాది గ్రహముల; మధ్య = నడుమ; గతుండు = ఉండువాడు; ఐ = అయ్యి; దీపించి = ప్రకాశించెడి; సూర్యునిన్ = సూర్యుడిని; పోలి = సరిపోలి; ఆ = ఆ దివ్యమైన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; మందస్మిత = చిరునవ్వు కల; సుందర = అందమైన; వదన = ముఖము అను; అరవిందుడు = పద్మము కలవాడు; అగుచున్ = ఔతు; వారలన్ = వారిని; కరుణన్ = దయారసము వలన; అర్ద్ర = తడియైన; దృష్టిన్ = చూపులతో; చూచి = చూసి; యోగక్షేమంబులు = కుశలప్రశ్నలు; అరసి = అడిగి; సాదర = ఆదరపూర్వకమైన; భాషణంబులన్ = మాటలతో; ఆదరించుచున్ = మన్నించుచు; కతిపయి = అనేక; ప్రయాణంబులన్ = ప్రయాణములతో; చనిచని = వెళ్ళి; విదేహనగరంబున్ = విదేహనగరమును; డాయన్ = దగ్గరకు; చనుటయున్ = వెళ్ళగా; ఆ = ఆ; బహుళాశ్వుండు = బహుళాశ్వుడు; ఆ = ఆ దివ్యమైన; మాధవున్ = కృష్ణుని; రాకన్ = వచ్చుటను; విని = విని; మనంబునన్ = మనసునందు; హర్షించుచున్ = సంతోషించుచు; వివిధ = నానావిధములైన; పదార్థంబులున్ = వస్తువులు; కానికలుగాన్ = కానుకలుగా; కొని = తీసుకొని; తానునున్ = అతను; శ్రుతదేవుండును = శ్రుతదేవుడు; ఎదురుగాన్ = ఆహ్వానించుటకు ఎదురు; చనుదెంచి = వచ్చి; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:
శ్రీకృష్ణుడు ఆ బహుళాశ్వుడు శ్రుతదేవుడులను చూడాలన్న ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలానగరానికి బయలుదేరాడు. అతని కూడా వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయనుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చవనుడు మున్నగు మునిముఖ్యులూ వెళ్ళారు. వారిలో నేనూ ఉన్నాను. మార్గంలో అనర్తము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానావిధాలైన కానుకలు బహూకరించి సేవించారు. గ్రహాలనడుమ ప్రకాశించే సూర్యుడిలా కృష్ణుడు మందహాసంచేస్తూ వారందరి మీద కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపచేస్తూ వారి యోగక్షేమాలు విచారించాడు. వారితో ఆప్యాయంగా మట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రయాణంచేసి మిథిలానగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకుని అతడు శ్రుతదేవునితోపాటు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి ఎదురువచ్చాడు. అప్పుడు...
- ఉపకరణాలు:
ఆ మునికోటికిన్ వినయ మారఁగ వందన మాచరించి, యా
తామరసాభలోచనుఁ, డుదారచరిత్రుఁడు, పాపగోత్ర సు
త్రాముఁడు, భక్తలోకశుభదాయకుఁ డైన రమేశు, సద్గుణ
స్తోముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్.
టీకా:
ఆ = ఆ; ముని = మునుల; కోటి = సమూహమున; కిన్ = కు; వినయము = అణకువ; ఆరగన్ = కనబడునట్లు; వందనము = నమస్కారము; ఆచరించి = చేసి; ఆ = ఆ; తామరసాభలోచనుడు = కృష్ణుడు {తామరసాభలోచనుడు - తామరల వంటి కనులు కలవాడు, కృష్ణుడు}; పాప = పాపములు అను; గోత్రముల్ = పర్వతములకు; సుత్రాముడు = ఇంద్రుని వంటివాడు; భక్త = భక్తులు; లోక = సమూహమునకు; శుభ = శుభములను; దాయకుడు = ఇచ్చువాడు; ఐన = అయిన; రమేశు = కృష్ణుని; సద్గుణ = సుగుణములు కలవాని; పాద = పాదములు అను; పద్మములు = పద్మములు; సోకగ = తగులగా; మ్రొక్కి = నమస్కరించి; వినమ్రులు = వినయముతో వంగి; తగన్ = ఉచితరీతిని.
భావము:
వారిద్దరూ వచ్చిన మునీంద్రు లందరికీ వినయంగా నమస్కారాలు చేసారు. పద్మాక్షుడూ, ఉదారచరిత్రుడూ, పాపాలనే పర్వతాల పాలిటి ఇంద్రునివంటివాడూ, భక్తులకు శుభాలను కలిగించేవాడూ, సద్గుణాలకు నిలయుడూ, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేశారు.
- ఉపకరణాలు:
కరములు మోడ్చి యో! పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ
శ్వరులును మద్గృహంబునకువచ్చి మముం గృపసేసి యిచ్చటం
గర మనురక్తిఁ బూజనలు గైకొనుఁ డంచు నుతించి వేఁడ నా
హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్.
టీకా:
కరములున్ = చేతులు; మోడ్చి = జోడించి; ఓ = ఓయీ; పరమ = ఉత్కృష్టమైన; కారుణిక = దయ గలవారిలో; ఉత్తమ = ఉత్తముడ; నీవున్ = నీవు; ఈ = ఈ; ముని = ఋషి; ఈశ్వరులునున్ = ఉత్తములు; మత్ = నా యొక్క; గృహంబున = ఇంటి; కున్ = కి; వచ్చి = వచ్చి; మమున్ = మమ్మలను; కృప = దయ; చేసి = చూపించి; ఇచ్చటన్ = ఇక్కడ; కరము = మిక్కిలి; అనురక్తిని = ప్రేమతో; పూజనలున్ = మర్యాదలు, పూజలు; కైకొనుడు = గ్రహింపుడు; అంచున్ = అని; నుతించి = స్తుతించి; వేడన్ = ప్రార్థింపగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హరి = కృష్ణుడు; మనము = మనస్సు; అందున్ = లో; వారి = వారి యొక్క; వినయంబులు = వినయమున; కున్ = కు; ఎంతో = ఎంతో అధికముగా; ప్రమోదమున్ = సంతోషమును; అందుచున్ = పొందుతు.
భావము:
“ఓ దయాసాగరా! నీవూ ఈ మునీశ్వరులూ మా గృహానికి వచ్చి మమ్ము అనుగ్రహించాలి మా పూజలు మీరు స్వీకరించాలి.” అని బహుళాశ్వ శ్రుతదేవులు చేతులు జోడించి కృష్ణుడిని ప్రార్థించారు, వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు.
- ఉపకరణాలు:
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
టీకా:
తిరముగన్ = స్థిరముగా {స్థిరము (ప్ర) - తిరము (వి)}; వారి = వారల; ఇష్టములు = కోరికలు; తీర్పన్ = నెరవేర్చవలెనని; తలంచి = భావించి; మురాసురారి = కృష్ణుడు {మురాసురారి - మురాసురుని శత్రువు, కృష్ణుడు}; ఒండొరుల = ఒకరిదొకరి; కిన్ = కి; ఎఱుంగకుండ = తెలియరాకుండ; ముని = మునుల; యూథమున్ = సమూహము; తానునున్ = అతను; ఏగెన్ = వెళ్ళెను; వారి = వారి యొక్క; మందిరముల = గృహముల; కున్ = కు; ఏక = ఒకే; కాలమునన్ = సమయము నందు; ధీరతన్ = ధైర్యముతో, తాలిమితో; ఆ = ఆ; ధరణీవరుడు = రాజు; వారిరుహదళాయతాక్షున్ = కృష్ణుని {వారిరుహదళాయతాక్షు - వారిరుహ (కలువ) దళ (పత్రముల)వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; ముని = మునుల; బృందముల్ = సమూహములను; కనక = బంగారు; ఆసనంబులన్ = పీఠములపై.
భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు
- ఉపకరణాలు:
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్ గడిగి, తత్పావనజలములు-
దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
రాజిత ధూప నీరాజనములు
- ఉపకరణాలు:
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.
టీకా:
కూర్చుండన్ = కూర్చుండమని; నియమించి = ఏర్పరచి; కొమరారు = అందగించెడి, చక్కటి; కాంచన = బంగారపు; కలధౌత = వెండి; కలశ = కలశములలోని; ఉదకములున్ = నీళ్ళతో; పాదములున్ = కాళ్ళు; కడిగి = కడిగి; తత్ = ఆ; పావన = పవిత్రమైన; జలములున్ = నీటిని; తానునున్ = తను; సతియును = భార్య; బాంధవ = బంధువుల; జనంబున్ = సమూహము; కరము = మిక్కిలి; అర్థిన్ = కోరికతో; నిజ = తన; మస్తకంబులన్ = శిరస్సులందు; ధరియించి = పెట్టుకొని; వివిధ = నానావిధములైన; అర్చనములున్ = పూజలతో; సత్ = చక్కటి; విధిన్ = విధముగా; ఒనర్చి = చేసి; మణి = రత్నాల; భూషణ = ఆభరణములు; అంబర = వస్త్రములు; మాల్య = పూలమాలలు; అనులేపన = గంధములు; రాజిత = ప్రకాశితములైన; ధూప = ధూపములు; నీరాజనములు = హారతులు.
భక్తిన్ = భక్తితో; కావించి = చేసి; పరి = మిక్కిలి; మృష్ట = పరిశుద్ధములైన; బహు = పెక్కు; విధ = రకముల; అన్న = అన్నములు; పాయస = పరమాన్నములు; ఆపూప = అప్పములు; పరి = చక్కగా; పక్వ = పండిన; ఫలములున్ = పండ్లను; ఓలిన్ = క్రమముగా; ఆరగింపగన్ = తినునట్లు; చేసి = చేసి; కర్పూర = కర్పూరము; మిళిత = కలిపిన; లలిత = మనోజ్ఞములైన; తాంబూలములున్ = విడెములు, తమలపాకులు; నెయ్యమున్ = ప్రీతి; అలరన్ = కనబడునట్లు; ఒసగెన్ = ఇచ్చెను.
భావము:
బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.
- ఉపకరణాలు:
ఇట్లు సమర్పించి, యనంతరంబ యమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; సమర్పించి = ఇచ్చి; అనంతరంబ = పిమ్మట; ఆ = ఆ; మిథిలేశ్వరుండు = మిథిలానగర ప్రభువు {మిథిల - విదేహరాజ్య ముఖ్య పట్టణము}; ఐన = అయిన; జనకుండు = రాజు, బహుళాశ్వుడు {జనకుడు - జనపథాధిపతి, ఒకానొక రాజు}; పరమ = మిక్కిలి; ఆనందంబును = సంతోషమును; పొంది = పొంది.
భావము:
ఈవిధంగా కృష్ణాదులను పరమానందంగా గౌరవించి మిథిలానాథుడైన ఆ జనకచక్రవర్తి..
- ఉపకరణాలు:
హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం
"బురుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు
స్థిరమతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో
నరయ నుమాధినాథ చతురాస్యులుఁ బోలరటందు వెప్పుడున్.
టీకా:
హరి = కృష్ణుని; పద = పాదములు అను; పద్మ = పద్మముల; యుగ్మమున్ = జంటను; నిజ = తన; అంకతలమునన్ = ఒడిలో; చేర్చి = పెట్టుకొని; ఒత్తుచున్ = పిసుకుతు; పురుషవరేణ్య = కృష్ణా {పురుషవరేణ్యుడు - పురుషోత్తముడు, కృష్ణుడు}; ఈ = ఈ; నిఖిల = సమస్తమైన; భూత = జీవ; గణ = జాలముల; ఆవలి = అన్నిటి; ఆత్మలు = అంతఃకరణముల; అందున్ = లోను; సుస్థిర = మిక్కిలి నిలకడగల; మతిన్ = బుద్ధితో; కర్మ = సమస్తమైన పనులకు; సాక్షివి = సాక్షీభూతుడవు; సుధీవర = కృష్ణా {సుధీవరుడు - శ్రేష్ఠమైన ఙ్ఞానవంతుడు, కృష్ణుడు}; నీ = నీ యొక్క; పద = పాదముల యొక్క; భక్త = భక్తుల; కోటి = సమూహము; తోన్ = తోటి; అరయన్ = తరచిచూసినచో; ఉమాథినాథ = శివుడు; చతురాస్యులున్ = చతుర్ముఖబ్రహ్మ; పోలరు = సరిపోలరు; అట = అని; అందువు = అంటావు.
భావము:
కృష్ణుని పాదాలను తన ఒడిలో ఉంచుకుని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు. “పురుషోత్తమా! జ్ఞాన స్వరూప! సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షివై నీవు ఉంటావు. పార్వతీదేవి భర్త శంకరుడు, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వంటివారు అయినా నీ భక్తులకు సాటిరారని నీవంటూ ఉంటావు.
- ఉపకరణాలు:
అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబు లందు నొకానొకవేళ లేశమాత్రధ్యానంబుగల నా గృహంబున కకించనుండని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి విజయం జేసితివి; భవత్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధ్యానంబు వదలం జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు నిన్నైన నిత్తువు గదా!” యని వెండియు నిట్లనియె.
టీకా:
అట్టి = అటువంటి; లోక = లోక మంతను; విదితంబు = ప్రసిద్ధమైనది; అయిన = ఐన; భవత్ = నీ యొక్క; వాక్యంబున్ = పలుకు; నిక్కంబుగా = సత్యమే కదా; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అను; అరవిందంబుల్ = పద్మములు; అందున్ = అందు; ఒకానొక = ఏదోఒక; వేళన్ = సారి; లేశ = కొంచెము; మాత్ర = పాటి; ధ్యానంబున్ = ధ్యానములు; కల = ఉన్నట్టి; ఆ =నా యొక్క; గృహంబునన్ = ఇంటి; కిన్ = కి; అకించనుండు = ఏమియు లేనివాడు; అని = అని; చిత్తంబునన్ = మనసు నందు; తలంపక = ఎంచకుండ; భక్త = భక్తుల ఎడ; వత్సలుండవు = వాత్సల్యము కలవాడవు; అగుటన్ = అగుట; చేసి = వలన; విజయంజేసితివి = వచ్చితివి; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అను; పంకేరుహ = పద్మము లందలి; ధ్యాన = ధ్యానించు టందు; సేవా = పూజించు టందు; రతిన్ = ఆసక్తితో; తగిలిన = లగ్నమైన; మహాత్ములు = గొప్పవారు; త్వత్ = నీ యొక్క; ధ్యానంబున్ = ధ్యానమును; వదలన్ = వదలుట; చాలుదురే = చేయగలరా; నిరతంబును = ఎల్లప్పుడు; శాంత = ప్రశాంతమైన; చిత్తులు = మనసుకలవారు; ఐ = అయ్యి; నిష్కించనులు = ఏకోరికలులేనివారు; ఐ = అయ్యి; యోగి = ఋషి; ఇంద్రులు = ఉత్తములు; ఐ = అయ్యి; నీ = నీ; వలనన్ = అందు; కోరిక = ఇచ్ఛ; కలవారి = కలవారల; కున్ = కి; నిన్నున్ = నిన్ను; ఐనన్ = అయినప్పటికి; ఇత్తువుగదా = ఇయ్యగలవు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:
ఆ నీ మాట సార్థకం అయ్యేలా, నీ పాదపద్మాల మీద ఏదో రవంత భక్తి గల నన్నుదరిద్రుడని అనుకోకుండా నా యింటికి వచ్చావు. ఇది నీ భక్తవాత్సల్యానికి నిదర్శనం. నీ పాదసేవలో ఆనందించే మహాత్ములు దాన్ని వదలలేరు. ఎప్పుడూ శాంతస్వభావులై, నిష్కాములై, నీ యందు భక్తిగల యోగిశ్రేష్ఠులకు నిన్ను నీవు సమర్పించుకుంటావు కదా.” అని పలికి బహుళాశ్వుడు మరల ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
"కృష్ణ! పరమాత్మ! యదుకుల క్షీరవార్ధి
పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన
వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!
భక్తజనపోషపరితోష! పరమపురుష!
టీకా:
కృష్ణ = కృష్ణా; పరమాత్మ = పరబ్రహ్మయైనవాడ; యదుకుల = యదువంశము అను; క్షీరవార్ధిన్ = పాలసముద్రమునకు; పూర్ణ = నిండు; చంద్రమ = చంద్రుడా; దేవకీపుత్ర = దేవకి కొడుకా; సుజన = సజ్జనులచేత; వినుత = స్తుతించబడువాడా; నారాయణ = కృష్ణా {నారాయణుడు - నారములు (జలము నందు) ఉండువాడ, విష్ణువు}; అచ్యుత = కృష్ణా {అచ్యుతుడు - దిగజారుటన్నది లేనివాడు, విష్ణువు}; వేదవేద్య = కృష్ణా {వేదవేద్యుడు - వేదములు వలన తెలియబడు వాడు, విష్ణువు}; భక్త = భక్తులు; జన = అందరిని; పోష = పోషించువాడా; పరితోష = ఆనంద స్వరూపుడా; పరమపురుష = పురుషోత్తమా.
భావము:
“పరమపురుషా! శ్రీకృష్ణా! యదుకుల క్షీరసాగరానికి పూర్ణచంద్రుడా! దేవకీనందనా! అచ్యుతా! నారాయణా! సజ్జన నుత! వేదవేద్యా! భక్తజనవత్సల! నీకు ప్రణామం.
- ఉపకరణాలు:
శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర
క్షాపరతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
నీ పదపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
దాపసవంద్య! యే నిపుడ ధన్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!”
టీకా:
శ్రీ = ఐశ్వర్యవంతుడైన; పురుషోత్తమ = పురుషోత్తముడు అను; ఆఖ్య = పేరు కలవాడా; యదు = యదువంశపు; సింహ = సింహపు, శ్రేష్ఠమైన; కిశోరక = పిల్లవంటివాడా; భక్త = భక్తుల; లోక = అందరిని; రక్షా = రక్షించుట యందు; పరతంత్ర = లగ్నమై ఉండువాడా; నీవు = నీవు; ముని = మునుల; సంఘమున్ = సమూహము; కొన్ని = కొన్ని; దినంబులు = రోజులు; ఉండవే = ఉండుము; నీ = నీ; పద = పాదములు అను; పద్మ = పద్మముల; రేణువులు = ధూళికణములు; నెమ్మిన్ = ప్రీతితో; మదీయ = నా యొక్క; గృహంబున్ = ఇంటికి; సోకినన్ = తాకినను; తాపస = ఋషులచే; వంద్య = నమస్కరించువాడు; ఏను = నేను; ఇపుడ = వెంటనే; ధన్యుడను = కృతార్థుడను; అయ్యెద = ఔతాను; కాదె = కదా; మాధవా = కృష్ణా {మాధవుడు - లక్ష్మీపతి, విష్ణువు}.
భావము:
ఓ యదు సింహమా! నందకిశోరా! భక్తరక్షణ పరాయణా! పురుషోత్తముడు అనే సార్థక నామధేయం కలవాడ! నీవూ ఈ మునులు కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉండండి. నీ పాదధూళి నా గృహములో సోకితే చాలు నేను ధన్యుడిని అవుతాను కదా.”
- ఉపకరణాలు:
అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత.
టీకా:
అని = అని; అభ్యర్థించినన్ = ప్రార్థించగా; ప్రసన్నుండు = అనుగ్రహించువాడు; ఐ = అయ్యి; ఆ = ఆ దివ్యమైన; పుండరీకాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; నిమి = నిమి; కుల = వంశమును; ప్రదీపకుండు = ప్రకాశింపజేయువాడు; ఐన = అయిన; జనకచక్రవర్తిన్ = బహుళాశ్వ మహారాజుని; కరుణించి = అనుగ్రహించి; ఆ = ఆ; మిథిలానగరంబునన్ = మిథిలానగరము నందు; పౌరజనంబుల్ = ప్రజల; కున్ = కు; ఉన్నత = ఉత్తమమైన; శోభనంబులున్ = సౌఖ్యములను; కావించుచున్ = కలిగించుచు; కొన్ని = కొద్ది; దినంబులున్ = రోజులు; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట.
భావము:
ఈ రీతిని నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నాడు. అంతట....
- ఉపకరణాలు:
శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
పతిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి, యచ్చోట స
మ్మతి దర్భాస్తరణంబులన్నునిచి, సమ్యగ్జ్ఞానపారీణుఁడై
సతియుం దానుఁ బదాబ్జముల్ గడిగి చంచద్భక్తిఁ దత్తోయముల్.
టీకా:
శ్రుతదేవుండును = శ్రుతదేవుడు; మోది = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ముని = మునులైన; జన = వారి; స్తోమంబున్ = సమూహము; తోన్ = తోటి; ఇందిరాపతిన్ = కృష్ణుని, లక్ష్మీపతిని; తోకొంచున్ = కూడా తీసుకుని వెళ్తూ; నిజ = తన; ఆలయంబున్ = గృహమున; కున్ = కు; ఒప్పన్ = చక్కగా; ఏగి = వెళ్ళి; అచ్చోటన్ = అక్కడ; సమ్మతిన్ = ఇష్టముతో; దర్భ = దర్భల; ఆస్తరణంబులన్ = చాపలపై, ఆసనములపై {దర్భ + ఆస్తరణంబులన్ = దర్భాస్తరణంబులన్, సవర్ణదీర్ఘ సంధి}; ఉనిచి = కూర్చుండబెట్టి; సమ్యక్ = పరమాత్మకు చెందిన; ఙ్ఞాన = ఙ్ఞానమునందు; పారీణుడు = మిక్కిలి తెలిసినవాడు; ఐ = అయ్యి; సతియున్ = భార్య; తానున్ = తను; పద = పాదములు అను; అబ్జముల్ = పద్మములను; కడిగి = కడిగి; చంచత్ = మెరుస్తున్న; భక్తిన్ = భక్తితో; తత్ = ఆ యొక్క; తోయముల్ = నీటిని.
భావము:
శ్రుతదేవుడు కూడ పరమానందంతో శ్రీకృష్ణుడిని మునులనూ తన ఇంటిలోకి తీసుకు వెళ్ళాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు, అతని భార్యా వారి పాదపద్మాలను కడిగి, ఆ నీటిని...
- ఉపకరణాలు:
శిరములఁ దాల్చి, నవ్యతులసీదళదామ కుశప్రసూన వి
స్ఫుర దరవింద మాలికలఁ బూజ లొనర్చి, "గృహాంధకూప సం
చరణుఁడ నైన నాకడకుఁ జక్రి దనంతనె వచ్చునట్టి సు
స్థిరమతి నే తపంబు మును సేసితినో?" యని సంతసించుచున్.
టీకా:
శిరములన్ = తలలపై; తాల్చి = ధరించి; నవ్య = తాజా; తులసీదళ = తులసీ దళముల; దామ = దండ; కుశ = దర్భలు; ప్రసూన = పూలు; విస్ఫురత్ = వికసించిన; అరవింద = పద్మముల; మాలికలన్ = దండలతో; పూజలున్ = అర్చనలు; ఒనర్చి = చేసి; గృహ = ఇల్లు అను; అంధ = చీకటి; కూప = నూతిలో; సంచరణుడను = మెలగువాడను; ఐన = అయిన; నా = నా; కడ = వద్ద; కున్ = కు; చక్రిన్ = కృష్ణుడు; తనంతనె = స్వయంగా; వచ్చునట్టి = వచ్చుటకు తగినట్లు; సుస్థిర = మిక్కిలి నిలుకడైన; మతిన్ = బుద్ధితో; ఏ = ఎలాంటి; తపంబున్ = తపస్సును; మును = మునుపు; చేసితినో = చేసానో; అని = అని; సంతసించుచున్ = సంతోషించుచు.
భావము:
కృష్ణుని పాదజలాన్ని వారు తమ తలల మీద జల్లుకున్నారు. తులసిమాలలనూ, తామరపూల హారాలనూ వారికి సమర్పించి పూజించాడు. “ఈ ఇల్లనే చీకటినూతిలో పడికొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావటానికి నేను ఎంతటి తపస్సు చేసానో కదా.” అని ఎంతో సంతోషించాడు.
- ఉపకరణాలు:
మఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ
గలయఁ జిలికించి, సంప్రీతి గడలుకొనఁగఁ
బత్త్ర ఫలపుష్పతోయముల్ భక్తి నొసగి,
హరి మురాంతకమూర్తి నిజాత్మ నిలిపి.
టీకా:
మఱియున్ = ఇంకను; తత్ = అతని; పాద = పాదసేచన; తీర్థంబున్ = నీటిని; మందిరమునన్ = ఇంటిలో; కలయన్ = అంతటి యందు; చిలికించి = జల్లించి; సంప్రీతిన్ = మిక్కిలి ప్రీతి; కడలుకొనగన్ = అతిశయించగా; పత్ర = పత్రములు; ఫల = పండ్లు; పుష్ప = పూలు; తోయముల్ = నీళ్ళు; భక్తిన్ = భక్తితో; ఒసగి = ఇచ్చి; హరిన్ = కృష్ణుని; మురాంతకమూర్తిన్ = కృష్ణమూర్తిని; నిజ = తమ; ఆత్మన్ = మనసు నందు; నిలిపి = ఉంచుకొని.
భావము:
ఇంకా, తన గృహం నలుమూలలా శ్రుతదేవుడు శ్రీకృష్ణ పాదతీర్థాన్ని చల్లాడు, అతడు కృష్ణుడిని తన మనసులో భక్తిగా నిలుపుకున్నాడు. మిక్కిలి భక్తితో పత్రం పుష్పం ఫలం జలాలను సమర్పించి, అర్చించాడు.
- ఉపకరణాలు:
మానితంబుగ విశ్వనిదానమూర్తి
యైన కృష్ణుండు దనయింట నారగించెఁ
దన మనోరథసిద్ధియుఁ దనకు నబ్బె
ననుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె.
టీకా:
మానితంబుగన్ = గౌరవించుతున్న రీతిని; విశ్వ = ప్రపంచమునకు; నిదాన = మూలకారణము ఐన; మూర్తి = స్వరూపము కలవాడు; ఐన = అయినట్టి; కృష్ణుండు = కృష్ణుడు; తన = తన యొక్క; ఇంటన్ = ఇంటిలో; ఆరగించెన్ = భుజించెను; తన = తన యొక్క; మనోరథ = కోరిక; సిద్ధియున్ = నెరవేరుట; తన = తన; కున్ = కు; అబ్బెన్ = లభించెను; అనుచున్ = అంటు; పైపుట్టము = పైబట్ట, కండువా; అల్లార్చి = తిప్పి; ఆడుచున్ = నాట్యము చేయుచు; ఉండె = ఉండెను.
భావము:
“సర్వ జగత్తుకు మూలకారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేసాడు. నా కోరిక ఫలించింది.” అంటూ శ్రుతదేవుడు ఎంతో ఆనందంతో తన పైబట్ట ఆడిస్తూ చిందులు త్రొక్కాడు.
- ఉపకరణాలు:
తరుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ, త
చ్చరణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
వరుఁ గని వల్కె "భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో
హర చతురాస్యులున్నెఱుఁగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.
టీకా:
తరుణియున్ = భార్య; తానున్ = అతను; పుత్రులున్ = కొడుకులు; పదంపడి = ఒకరి వెను నొకరు; కృష్ణున్ = కృష్ణుని; భజించుచుండన్ = సేవించుచుండగా; తత్ = అతని; చరణములన్ = పాదములను; అంకపీఠమునన్ = ఒడిలోకి; చాచినన్ = చాపగా; మెల్లనన్ = మెల్లిగా; ఒత్తుచున్ = పిసుకుచు; రమావరునిన్ = కృష్ణుని; కని = చూసి; పల్కెన్ = ఇట్లనెను; భక్త = భక్తులైన; జన = వారల ఎడ; వత్సల = వాత్సల్యము కలవాడా; మామక = మా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్టిదో = ఎంతగొప్పదో; హర = శివుడు; చతురాస్యులు = చతుర్ముఖబ్రహ్మ; ఎఱుగనట్టి = తెలిసికోలేని; నినున్ = నిన్ను; కనుగొంటిన్ = దర్శించగలిగితిని; నెమ్మిన్ = ప్రీతి; తోన్ = తోటి.
భావము:
తను తన భార్యాపుత్రులూ కృష్ణుడిని స్తుతిస్తూ ఉండగా, ఆయన పాదాలను ఒడిలో చేర్చుకుని మెత్తగా ఒత్తుతూ శ్రుతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు. “భక్తవత్సలా! నా భాగ్యం ఎంత గొప్పదో కదా. పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కనలేని నిను దర్శించగలిగాను.
- ఉపకరణాలు:
ముని యోగిమానసస్ఫుట
వనజంబుల నెల్ల ప్రొద్దు వర్తించు భవ
ద్ఘనదివ్యమూర్తి నా లో
చనగోచర మయ్యెఁ గాదె! సర్వాత్మ! హరీ!
టీకా:
ముని = మునుల {ముని - వాగ్నియమము ప్రధానమార్గముగా కల ఋషి}; యోగి = యోగుల {యోగి - యమనియమాది అష్టాంగములు కల యోగాభ్యాసము ప్రధానమార్గముగా కల ఋషి}; మానస = మనసు లనెడి; స్ఫుట = వికసించిన; వనజంబులన్ = కమలములను; ఎల్లప్రొద్దు = ఎల్లప్పుడు; వర్తించు = మెలగెడి; భవత్ = నీ యొక్క; ఘన = గొప్ప; దివ్య = మానవాతీతమైన; మూర్తిన్ = రూపము; నా = నా యొక్క; లోచన = కన్నులకు; గోచరము = కనబడినది; అయ్యెన్ = అయినది; కాదె = కదా; సర్వాత్మా = సమస్త మందుండు వాడా; హరీ = కృష్ణా.
భావము:
ఓ సర్వాంతర్యామీ! శ్రీహరీ! మునీశ్వరుల యోగీంద్రుల హృదయ పద్మాలలో నిరంతరం మెలిగెడి నీ యొక్క దివ్య మంగళరూపం నా కనులకు గోచరమైంది.
- ఉపకరణాలు:
దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు, నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం, దమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;” వని మఱియు నిట్లనియె.
టీకా:
దేవా = భగవంతుడా; నీ = నీకు చెందిన; సత్ = మంచి; చరితంబులున్ = వృత్తాంతములు; కర్ణ = చెవులకు; రసాయనంబులు = రసవంతములు, ఇంపు; కాన్ = ఔనట్లు; ఆకర్ణించుచు = వినుచు; నీ = నీ; కున్ = కు; పూజలున్ = అర్చనములు; ఒనర్చుచు = చేయుచు; నీ = నీ; చరణ = పాదములు అను; అరవిందంబుల్ = పద్మముల; కున్ = కు; వందనములున్ = నమస్కారములను; చేయుచున్ = చేస్తూ; నీ = నీకు చెందిన; దివ్య = దివ్యమైన; నామ = నామములను, పేర్లను; సంకీర్తనంబులు = కీర్తించుటలు; చేయుచున్ = చేస్తూ; తమ = వారి; శరీరంబులున్ = దేహములను; భవత్ = నీకు; అధీనంబులు = పరమైనవి; కాన్ = ఔనట్లు; మెలంగు = వర్తించెడి; నిర్మల = స్వచ్ఛమైన; బోధా = బ్రహ్మఙ్ఞానము కల; ఆత్ములు = మనసులు కలవారు; అగు = ఐన; వారి = వారి యొక్క; చిత్తంబులు = మనసులు; అను = అనెడి; దర్పణంబులన్ = అద్దములలో; కానంబడుచున్ = కనబడుతు; ఉందువు = ఉంటావు; కర్మ = కర్మములచేత; విక్షిప్త = చలింపజేయబడిన; చిత్తులు = మనసులు కలవారు; ఐన = అయినట్టి; వారి = వారి యొక్క; హృదయంబులన్ = మనసులలో; ఉండియున్ = ఉండినప్పటికి; దూరగుండవు = దూరముగా ఉండువాడవు; అగుదువు = ఔతావు; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:
ఓ దేవా! చెవులపండువుగా నీ దివ్యగాథలు వింటూ; నీకు పూజలు చేస్తూ; నీ పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ; నీ దివ్యనామం జపిస్తూ; తమ శరీరాలు నీ ఆధీనాలుగా సంచరిస్తూ; ఉండే సజ్జనుల హృదయాలనే అద్దాలలో నీవు కనిపిస్తూ ఉంటావు; కర్మపరతంత్రులైన వారి హృదయాలకు దూరంగా ఉంటావు.” అని స్తుతించి శ్రుతదేవుడు ఇంకా ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
“నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య!-
లోకరక్షక! భక్తలోకవరద!
నీపాదసేవననిరతుని నన్ను నే-
పనిఁ బంపె దానతి” మ్మనినఁ గృష్ణుఁ
డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు-
కర మాత్మకరమునఁ గదియఁ జేర్చి
పాటించి యతనితోఁ బలికెఁ “దపశ్శక్తి-
వఱలిన యమ్మునివర్యు లెపుడుఁ
- ఉపకరణాలు:
దమ పదాంబుజరేణు వితానములను
దవిలి లోకంబులను బవిత్రంబు సేయు
వారు ననుఁ గూడి యెప్పుడు వలయు నెడల
కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు.
టీకా:
నీ = నీ; కున్ = కు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; కృష్ణ = కృష్ణా; నిగమ = వేదముల; అంతన్ = సారముచేత; సంవేద్య = చక్కగా తెలియబడువాడా; లోకరక్షక = లోకాలని కాపాడువాడా; భక్త = భక్తులు; లోక = అందరికి; వరద = వరము లిచ్చువాడా; నీ = నీ యొక్క; పాద = పాదములను; సేవన = కొలుచుటందు; నిరతుని = ఆసక్తి కలవానిని; నన్నున్ = నన్ను; ఏ = ఎట్టి; పనిన్ = పనికి; పంపెదు = నియమించెదవో; ఆనతిమ్ము = చెప్పుము; అనినన్ = అనగా; కృష్ణుడు = కృష్ణుడు; ఎలనవ్వు = చిరునవ్వు; మోమునన్ = ముఖమునందు; చెలువొందన్ = అందగించగా; ఆ = ఆ యొక్క; విప్రు = బ్రాహ్మణుని; కరమున్ = చేతిని; ఆత్మన్ = తన యొక్క; కరమునన్ = చేతితో; కదియన్ = దగ్గరకు; చేర్చి = తీసుకొని; పాటించి = ఆదరించి; అతని = అతని; తోన్ = తోటి; పలికెన్ = ఇట్లనెను; తపస్ = తపస్సు వలని; శక్తిన్ = సామర్థ్యముచేత; వఱలిన = ప్రసిద్ధులైన; ఆ = ఆ; ముని = ముని; వర్యులు = ఉత్తములు; ఎపుడున్ = ఎల్లప్పుడు; తమ = వారి యొక్క.
పద = పాదములు అను; అంబుజ = పద్మముల; రేణు = దుమ్ముకణముల; వితానములను = సమూహములతో; తవిలి = పూని; లోకంబులను = లోకములను; పవిత్రంబు = పావనులుగా; చేయు = చేసెడి; వారు = వారు; ననున్ = నన్ను; కూడి = కలిసి; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; వలయున్ = కావలసిన; ఎడల = చోటుల; కున్ = కు; అరుగుదెంతురు = వస్తారు; నీ = నీ యొక్క; భాగ్య = అదృష్టము యొక్క; గరిమన్ = గొప్పదనముచేత; ఇట = ఇక్కడ; కున్ = కు.
భావము:
కృష్ణా! వేదవేద్యా! లోకరక్షకా! భక్తవరదా! నీకు నమస్కరిస్తున్నాను. నీ పాదసేవలో నిరంతరం సంచరించే నన్ను ఏమి చేయమంటావో అజ్ఞాపించు.” ఇలా పలుకుతున్న శ్రుతదేవుడి పలుకులు విని గోవిందుడు మందహాసం చేస్తూ తన చేతిలోకి అతని చేతిని తీసుకుని, ఇలా అన్నాడు. “ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేసే వారు, పరమ తపోధనులు అయిన ఈ మునివరులు నాతోపాటు తాము కోరిన చోటికి వస్తూంటారు. ఈనాడు నావెంట నీ ఇంటికి విచ్చేసారు. నీ అదృష్టం పండింది.
- ఉపకరణాలు:
చనుదెంచిరి; పుణ్యస్థలంబులును, విప్రులును, దేవతలును సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె.
టీకా:
చనుదెంచిరి = వచ్చిరి; పుణ్యస్థలంబులును = పుణ్యక్షేత్రములు; విప్రులునున్ = బ్రాహ్మణులు; దేవతలునున్ = దేవతలు; సంస్పర్శన = తాకుట; దర్శన = చూటుట; అర్చనంబులన్ = పూజించుటచేతను; ప్రాణులను = జీవులను; సమస్త = ఎల్ల; కిల్బిషంబులన్ = పాపములనుండి; పాయన్ = తొలగునట్లు; చేయుదురు = చేస్తారు; అదియునున్ = అంతే; కాక = కాకుండా; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; జనన = పుట్టుక; మాత్రంబునన్ = మాత్రముచేతనే; జీవ = ప్రాణులు; కోటి = అందరి; అందున్ = లోను; ఘనుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; జప = జపములు {జపము - ఏకాగ్రమననము}; తపస్ = తపస్సులు {తపస్సు - సాధించుటకు నిరంతరముగ తపించుట}; ధ్యాన = ధ్యానములు {ధ్యానము - మనసును ఏకాగ్రము చేసి అంతఃకరణ శుద్ధి సాధించుట}; అధ్యయన = వేదాధ్యయనములు; అద్యాత్మములన్ = బ్రహ్మ ఙ్ఞాన విచారణలలో; చతురుండు = మిక్కిలి నేర్పు కలవాడు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; కల = అంశకు; ఆశ్రయుండు = ఉనికి ఐనవాడు; అయ్యెనేనిన్ = అయినచో; అతండు = అతను; ఉత్తముండు = ఉత్తముడు; ఐ = అయ్యి; వెలుంగున్ = ప్రకాశించును; అతనిన్ = అతని విషయము; చెప్పనేల = వేరే చెప్పడ మెందుకు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను;
భావము:
అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేసారు. పుణ్యస్థలాలూ, విప్రులూ, దేవతలూ, స్పర్శ, దర్శన, అర్చన వలన జీవుల పాపాలు సమస్తమూ తొలగిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సకల జీవులలోను గొప్పవాడు అయి ఉంటాడు. అతడు జపము, తపస్సు, ధ్యానము అధ్యయనము మున్నగు సాధనలతో పరిపూర్ణుడై నా భక్తుడు అయితే గొప్పగా ప్రకాశిస్తాడు.” అని పలికి కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
“నా మది విప్రులపైఁ గల
ప్రేమము నా తనువు నందుఁ బెట్టని కతనన్
భూమీసురు లర్హులు; నీ
వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా!
టీకా:
నా = నా యొక్క; మదిన్ = మనసు నందు; విప్రులు = బ్రాహ్మణుల; పైన్ = మీద; కల = ఉన్నట్టి; ప్రేమము = ప్రీతిని; నా = నా యొక్క; తనువున్ = దేహము; అందున్ = పైన; పెట్టని = ఉంచుకొనని; కతనన్ = కారణముచేత; భూమీసురులు = బ్రాహ్మణులు; అర్హులు = యోగ్యులు; నీవున్ = నీవు; ఈ = ఈ; మునులన్ = మునులను; పూజ = అర్చించుట; చేయుము = చేయుము; ఇద్ధచరిత్రా = ప్రసిద్ధ మైన వర్తన కలవాడ.
భావము:
“ఓ శుద్ధాత్మా! వారు మిక్కిలి అర్హులు అగుటచే, నా మనసులో నా శరీరం మీద కన్నా బ్రాహ్మణుల మీద నాకు ప్రేమ అధికముగా గలదు. కనుక నీవు ఈ మునులను పూజించుము.
- ఉపకరణాలు:
ఇదియే నా కిష్టము ననుఁ
బదివేలవిధంబు లొలయ భజియించుటగా
మది కింపగు నటు గావున
వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్!”
టీకా:
ఇదియే = ఇదే; నా = నా; కున్ = కు; ఇష్టము = ఇష్టమైనది; ననున్ = నన్ను; పదివేల = పదివేల (10,000); విధంబులన్ = విధములుగా; ఒలయన్ = వ్యాపించునట్లు; భజియించుట = అర్చించుట; కాన్ = ఐనట్లు; మదిన్ = మనస్సున; కిన్ = కు; ఇంపు = ఇష్టమైనది; అటుగావునన్ = కాబట్టి; వదలని = ఎడతెగని; భక్తిన్ = భక్తితో; భజింపు = అర్చించుము; వసుధామరులన్ = బ్రాహ్మణులను.
భావము:
నాకు ఇష్టం కూడా అదే. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేల విధాల పూజించినట్లు భావించి సంతోషిస్తాను. కనుక, సుస్థిర భక్తితో విప్రులను పూజించు.”
- ఉపకరణాలు:
అని సర్వలోక విభుఁ డగు
వనజోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
డన భూమీసురుఁ డమ్ముని
జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్ వరుసన్.
టీకా:
అని = అని చెప్పి; సర్వ = సమస్తమైన; లోక = లోకములకు; విభుడు = ప్రభువు; అగు = ఐన; వనజోదరుడు = కృష్ణుడు; ఆనతిచ్చు = చెప్పెడి; వాక్యంబులన్ = మాటల; జాడన = విధముగనే; భూమీసురుండు = బ్రాహ్మణుడు; ఆ = ఆ; ముని = ఋషుల; జనుల్ = సమూహముల; కున్ = కు; సద్భక్తిన్ = మంచిభక్తితో; పూజన్ = అర్చించుట; సలిపెన్ = చేసెను; వరుసన్ = వరుసగా.
భావము:
లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శ్రుతదేవుడు అత్యంతభక్తితో ఆ మునిపుంగవులను పూజించాడు.
- ఉపకరణాలు:
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో
కన మొలయన్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్
జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై!"
టీకా:
ఎనయగన్ = పొందునట్లుగ; కృష్ణుడు = కృష్ణుడు; అంతన్ = అంతట; మిథిలేశ్వర = బహుళాశ్వుని, జనకుని; భూసురులన్ = శ్రుతదేవుని; కృపావలోకనము = దయతోడిచూపులతో; ఒలయన్ = వ్యాపించునట్లు; అనూన = మిక్కుటమైన; సుభగ = సౌభాగ్యవంతమైన; స్థితిన్ = స్థితి; పొందగన్ = పొందునట్లుగ; చేసి = చేసి; వారిన్ = వారినుండి; వీడ్కొని = శలవుతీసుకొని; రథమున్ = రథమును; ఎక్కి = ఎక్కి; దివ్య = గొప్ప; ముని = ఋషుల; కోటియున్ = సమూహము; తానును = అతను; వచ్చెన్ = వచ్చెను; క్రమ్మఱన్ = తిరిగి; జనవర = రాజా; మోక్షదంబు = ముక్తి నిచ్చునది; అగు = ఐన; కుశస్థలి = ద్వారకాపట్టణమున; కిన్ = కు; ప్రమద = సంతోషముతోడి; అంతరంగుండు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి.
భావము:
ఓ రాజా పరీక్షిత్తు! మిథిలాదేశ ప్రభువు బహుళాశ్వుని, విప్రుడు శ్రుతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషాతంరంగుడై రథం ఎక్కి మునులతోపాటు మోక్షదాయకమైన ద్వారకను తిరిగి చేరుకున్నాడు.