దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట
- ఉపకరణాలు:
అట్లు కౌఁగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుణుకుచుం బ్రేమాతిశయమున మేనం బులకలొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవమాయామోహితులై స్తన్యపానంబు సేయుచు భగవంతు డయిన రథాంగపాణి యంగ సంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుఁ దలిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగి; రంత దేవకీదేవి తన మనంబున.
టీకా:
అట్లు = ఆ విధముగ; కౌగిటన్ = కౌగిలిలోనికి; చేర్చి = తీసుకొని; నిజ = తన; అంకపీఠమునన్ = ఒడిలో; ఉనిచి = కూర్చుండబెట్టుకొని; శిరంబులున్ = తలలు; మూర్కొని = వాసనచూసి; చిబుకంబులున్ = గడ్డములు; పుణుకుచున్ = నొక్కుతు; ప్రేమ = ప్రేమ; అతిశయమునన్ = విశేషించుటచేత; మేనన్ = దేహము నందు; పులకలు = గగుర్పాటు; ఒలయన్ = వ్యాపించగా; చన్ను = స్తన్యము; ఇచ్చినన్ = ఇవ్వగా; వారును = వారు; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయా = మాయచేత; మోహితులు = మోహములో పడినవారు; ఐ = అయ్యి; స్తన్య = చనుబాలు; పానంబు = తాగుట; చేయుచున్ = చేస్తూ; భగవంతుడు = సాక్షాద్భగవంతుడే; అయిన = ఐన; రథాంగపాణిన్ = చక్రపాణిని, కృష్ణుని; అంగ = దేహమును; సంగంబునన్ = సంస్పర్శంబువలన; విగత = తొలగిన; కల్మషులు = పాపములు కలవారు; ఐ = అయ్యి; విధి = బ్రహ్మదేవుని; శాప = శాపము అను; సాగరంబున్ = సముద్రమును; హరి = కృష్ణుని; దయా = దయతో కూడిన; కటాక్షంబు = కడకంటిచూపు; అను = అనెడి; నావ = పడవ; చేతన్ = వలన; తరించి = దాటి; నిజ = తమ; స్వరూపంబులు = స్వంత రూపములను; ధరించి = పొంది; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; తల్లిదండ్రుల్ = తల్లిదండ్రుల; కున్ = కు; వందనంబు = నమస్కారములు; ఆచరించి = చేసి; గగనపథంబునన్ = ఆకాశమార్గమున; నిజ = తమ; స్థానంబున్ = నివాసమున; కున్ = కు; అరిగిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = పిమ్మట; దేవకీదేవి = దేవకీదేవి; తన = తన యొక్క; మనంబునన్ = మనసు నందు.
భావము:
అలా లాలించి, తన చిన్నారి తనయులను దేవకీదేవి ఆలింగనం చేసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకుంది. వారి నడినెత్తిన ముద్దిడింది, గడ్డం పుణికింది. పెల్లుబికిన ప్రేమతో ఆమె దేహం పులకలెత్తంది. వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ మాయా ప్రభావానికి వశులై తల్లిపాలు త్రాగారు. శ్రీకృష్ణుని స్పర్శవలన నిర్మలులు అయ్యారు. శ్రీహరి దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి స్వస్వరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు. అంతట దేవకీదేవి తన మనసులో అచ్చెరువొందింది.