దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు
- ఉపకరణాలు:
ఆ తఱి నుగ్రసేన వసుధాధిప, పంకజనాభ, ముష్టికా
రాతులు దమ్ము నర్థి మధురప్రియభాషల నిల్వ వేఁడినం
గౌతుక మాత్మ నివ్వటిలఁగా వసియించిరి గోపగోపికా
వ్రాతముతోడ నచ్చట ధరావర! నందయశోద లిమ్ములన్.
టీకా:
ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; ఉగ్రసేన = ఉగ్రసేన; వసుధాధిప = మహారాజు; పంకజనాభ = కృష్ణుని; ముష్టికారాతులున్ = బలరాములు; తమ్మున్ = వారిని; అర్థిన్ = ప్రీతితో; మధుర = ఇంపైన; ప్రియ = ప్రియమైన; భాషలన్ = మాటలతో; నిల్వన్ = ఆగమని; వేడినన్ = కోరగా; కౌతుకము = కుతూహలము; ఆత్మన్ = మనసు లందు; నివ్వటిలగా = కలుగగా; వసియించిరి = ఉన్నారు; గోప = గోపకుల; గోపికా = గోపికల; వ్రాతము = సమూహముల; తోడన్ = తోటి; అచ్చటన్ = అక్కడ; ధరావర = రాజా; నంద = నందుడు; యశోదలు = యశోదేవి; ఇమ్ములన్ = సుఖముగా.
భావము:
ఆ తరుణంలో, ఉగ్రసేన మహారాజు బలరామ కృష్ణులూ తియ్యని మాటలతో ఉండమని మరీ మరీ వేడారు. వారి మాట మన్నించి నందుడు యశోదా గోపగోపికలతోసహా కొన్నాళ్ళుపాటు తృప్తిగా అక్కడే ఉన్నారు.