పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : గురుప్రశంస చేయుట

  •  
  •  
  •  

10.2-994-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తివిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు
వ్యయంబైన బ్రహ్మంబు నుభవించు
రితసత్త్వుండు, సత్కర్మనితుఁ, డతుల
భూసురశ్రేష్ఠుఁ, డలఘుండు, బుధనుతుండు.

టీకా:

తివిరి = కోరి; అఙ్ఞాన = అఙ్ఞానము అను; తిమిర = చీకటికి; ప్రదీపము = వెలుగు నిచ్చునది; అగుచున్ = ఔతు; అవ్యయంబు = నాశరహితము; ఐన = అయిన; బ్రహ్మంబును = పరమాత్మను; అనుభవించు = అనుభవంచే తెలిసికొను; భరితసత్త్వుండు = నిండుమనస్సు కలవాడు; సత్కర్మ = పుణ్యము లందు; నిరతుడు = ఆసక్తి కలవాడు; అతుల = సాటిలేని; భూసుర = బ్రాహ్మణ; శ్రేష్ఠుడు = ఉత్తముడు; అలఘుండు = గొప్పవాడు; బుధ = ఙ్ఞానులచే; నుతుండు = స్తుతింపబడువాడు.

భావము:

“మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటివాడు; బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు; సత్కర్మ పరాయణుడు; బ్రాహ్మణ శ్రేష్ఠుడు; పుణ్యాత్ముడు.

10.2-995-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అమ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నదిగావున.

టీకా:

ఆ = ఆ; మహాత్ముని = గొప్ప ఆత్మ కలవాని; వలన = వలన; సకల = సర్వ; వర్ణ = చతుర్వర్ణముల; ఆశ్రమంబుల = చతురాశ్రమముల; వారి = జనుల; కిన్ = కి; నేను = నేను; విఙ్ఞాన = విఙ్ఞానమును; ప్రదుండను = కలిగించువాడను; అగు = ఐన; గురుండను = గురువును; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికి; గురు = గురువును; భజనంబు = సేవించుట; పరమ = ఉత్కృష్టమైన; ధర్మంబు = ధర్మము; అని = అని; ఆచరించితిన్ = చేసితిని; అదిగావున = కాబట్టి.

భావము:

సకల వర్ణాశ్రమాలవారికీ నేను నిజానికి విజ్ఞానప్రదాత అయిన గురువును అయినా గురుసేవ అత్యున్నత ధర్మము అని బోధించడం కోసం నేను కూడ గురుసేవ చేసాను. అందుచేత....

10.2-996-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూసురులకెల్ల ముఖ్యుఁడ
నై కల కులాశ్రమంబు లందును నెపుడున్
ధీసుజ్ఞానప్రదుఁ డన
దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్.

టీకా:

భూసురులు = విప్రుల; కున్ = కు; ఎల్లన్ = ఎల్లవారికి; ముఖ్యుడను = ప్రధానుడను; ఐ = అయ్యి; సకల = సర్వ; కుల = చతుర్వర్ణము లందు; ఆశ్రమంబుల = చతురాశ్రమము లందు; ఎపుడున్ = ఎల్లప్పుడు; ధీ = శాస్త్రఙ్ఞానము; సుఙ్ఞాన = బ్రహ్మఙ్ఞానము; ప్రదుడు = ఇచ్చువాడు; అనన్ = అనగా; దేశికుడు = ఉపదేశగురువు; అనన్ = అనగా; ఒప్పుచుందు = ఉంటాను; ధృతిన్ = నిశ్ఛయముగా; ఎల్లెడలన్ = అన్ని చోటు లందును.

భావము:

బ్రాహ్మణులలో కెల్లా ముఖ్యుడను అయి, సకల వర్ణాలకూ ఆశ్రమాలకూ జ్ఞానప్రదాతను అయి నేను ప్రకాశిస్తూ ఉంటాను.

10.2-997-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలైక గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు.

టీకా:

అట్టి = అటువంటి; వర్ణ = వర్ణములు; ఆశ్రమంబుల = ఆశ్రమముల; అందున్ = లోను; అర్థ = విశదముగ తెలియుటలో; కుశలులు = నేర్పరులు; అగు = ఐన; వారు = వారు; నిఖిల = సమస్తమునకు; ఏక = అద్వితీయమైన; గురుడను = గురువును; ఐన = అయిన; నాదు = నా యొక్క; వాక్యంబున్ = ఆజ్ఞ; చేన్ = చేత; భవ = సంసారము అను; ఆర్ణవమున్ = సముద్రమును; పెలుచన్ = శీఘ్రముగా; దాటుదురు = తరించెదరు; మత్ = నా; పద = పాదములు అను; అంబుజ = పద్మములను; ధ్యానపరులు = ధ్యానించువారు.

భావము:

ఆ సకల వర్ణాలకు చెందిన జ్ఞానులు, లోకాలు సమస్తానికి గురుడనైన నా పలుకులను ఆలకించి, నా పాదపద్మాలను ధ్యానిస్తూ సంసార సాగరాన్ని దాటుతారు.

10.2-998-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను దపోవ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను; గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు” నని చెప్పి మఱియు “మనము గురుమందిరమున నున్న యెడ నొక్కనాఁడు గురుపత్నీ నియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబున.

టీకా:

అదియునున్ = అంతే; కాకన్ = కాకుండ; సకల = సర్వ; భూత = ప్రాణుల; ఆత్మకుండును = అందు ఉండువాడను; ఐన = అయిన; ఏను = నేను; తపః = తపస్సులచే; వ్రత = వ్రతములచే; యజ్ఞ = యజ్ఞములచే; దాన = దానములచే; శమ = బహిరింద్రియనిగ్రహంచే; దమ = అంతరింద్రియనిగ్రహముల; చేన్ = చేత; సంతసింపను = సంతోషించను; గురు = గురువులైన; జనంబులన్ = వారిని; పరమ = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; సేవించు = కొలచెడి; వారలన్ = వారిని; పరిణమింతున్ = హర్షింతును; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; మనము = మనము; గురు = గురువు యొక్క; మందిరమునన్ = గృహమునందు; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయము నందు; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; గురు = గురువు యొక్క; పత్నీ = భార్యచేత; నియుక్తులము = పంపబడినవారము; ఐ = అయ్యి; ఇంధన = కట్టెల; అర్థంబు = కొరకు; అడవి = అడవి; కిన్ = కి; చనినన్ = వెళ్ళగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.

భావము:

అంతే కాకుండా, సకల భూతాలలో ఆత్మగా ఉండు నేను తపోదానయజ్ఞాదులవల్ల సంతోషించను భక్తితో గురువును సేవించేవారిని ప్రేమిస్తాను.” ఇలా పలికి శ్రీకృష్ణుడు కుచేలుడితో మళ్ళీ ఇలా పలికాడు. “మనం గురువు గారి ఆశ్రమంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము. గుర్తుంది కదూ. ఆ సమయంలో...

10.2-999-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత-
టల సంఛన్నాభ్రభాగ మగుచుఁ
టుల ఝంఝానిలోత్కట సముద్ధూత నా-
నావిధ జంతుసంతాన మగుచుఁ
జండ దిగ్వేదండ తుండ నిభాఖండ-
వారిధారాపూర్ణ సుధ యగుచు
విద్యోతమానోగ్రద్యోత కిరణజి-
ద్విద్యుద్ధ్యుతిచ్ఛటావిభవ మగుచు

10.2-999.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డరి జడిగురియఁగ నినుఁ స్తమింప
భూరినీరంధ్రనిబిడాంధకా మేచి
సూచికాభేద్యమై వస్తుగోచరంబు
గాని యట్లుండ మనము న వ్వానఁ దడిసి.

టీకా:

ఘమఘమ = ఘమఘమమను; ఆరావ = ధ్వనిచేత; సంకుల = సందడించుచున్న; ఘోర = భయంకరమైన; జీమూత = మేఘముల; పటల = సమూహములచేత; సంఛన్న = మిక్కిలి కమ్మబడిన; ఆభ్ర = ఆకాశ; భాగము = ప్రదేశము; అగుచున్ = ఔతు; చటుల = వడిచేత అతిశయిస్తున్న; ఝంఝానిల = వానగాలుల; ఉత్కట = సమూహముచేత; సమ = మిక్కిలి; ఉద్ధూత = ఎగరగొట్టబడిన; నానావిధ = వివిధ; జంతు = ప్రాణుల; సంతానము = సమూహములుగలది; అగుచున్ = అగుచు; చండ = భయంకరమైన; దిగ్వేదండ = దిగ్గజములయొక్క; తుండ = తొండములతో; నిభ = పోలిన; అఖండ = ఎడతెగని; వారి = నీటి; ధారా = ధారలచే; ఆపూర్ణ = నిండిన; వసుధ = నేలకలది; అగుచున్ = అగుచు; విద్యోతమాన = మిక్కిలివెలుగుచున్న; ఖద్యోత = సూర్యుని; కిరణ = కిరణములను; జిత్ = జయించుచున్న; విద్యుత్ = మెరుపుల; ద్యుతి = కాంతుల; ఛటా = సముదయము యొక్క; విభవము = వైభవము కలది; అగుచున్ = అగుచు; అడరి = విజృంభించి;
జడిన్ = ఎడతెగనిజల్లులుగ; కురియన్ = వర్షించుచుండ; ఇనుడు = సూర్యుడు; అస్తమింపన్ = అస్తమించగా; భూరి = అధికమైన; నీరంధ్ర = ఆకాశమంతానిండిన; నిబిడ = దట్టమైన; అంధకారము = చీకటి; ఏచి = పెరిగిపోయి; సూచికాఅభేద్యము = ఎడతెగనిది {సూచికాభేధ్యము - సూచిక (సూది) అభేద్యము (గుచ్చుటకు సందులేనిది), ఎడతెగనిది}; ఐ = అయ్యి; వస్తు = వస్తువులేవియును; గోచరంబుగాని = కనబడని; అట్లు = విధముగ; ఉండన్ = ఉండగా; మనమున్ = మనము; ఆ = ఆ; వానన్ = వానలో; తడిసి = తడిసిపోయి.

భావము:

పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి; సుడిగాలులు మహా వేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి; వర్షధారలు దిగ్గజాలతొండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి; మెరుపులు మిరుమిట్లు గొలిపాయి; వాన జడి పెరిగింది; సూర్యుడు అస్తమించాడు; వర్షం ఆగలేదు; చీకట్లు దట్టంగా వ్యాపించి, కంటికి ఏమీ కనపడటం లేదు; అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము.

10.2-1000-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యలు గొందియుఁ బెను మిఱ్ఱుల్లములును
హిత సహితస్థలంబు లేర్పఱుపరాక
యున్న యత్తఱి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నడచుచు నుండునంత.

టీకా:

బయలు = బహిఃప్రదేశము; గొందియున్ = సందు; పెను = పెద్ద; మిఱ్ఱు = ఎత్తున్న ప్రదేశము; పల్లములును = లోతుగా ఉన్న ప్రదేశము; రహిత = లేనివి; సహిత = ఉన్నవి ఐన; స్థలంబులున్ = ప్రదేశములు; ఏర్పఱుపరాక = తేడా తెలియకుండ; ఉన్న = ఉన్న; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; మనము = మనము (ఇద్దరము); ఒండొరుల = పరస్పరము; చేతులున్ = చేతులను; ఊతగాన్ = అసరాగా; కొని = తీసుకొని; నడుచుచున్ = నడుస్తూ; ఉండున్ = ఉండగా; అంత = అంతట.

భావము:

త్రోవలూ డొంకలూ మిట్ట పల్లాలూ కనపడకుండా వాననీరు కప్పివేసింది; ఒకరి చేతిని ఒకరం ఊతగా పట్టుకుని మనం ఆ అడవిలో దారి కానక తిరిగాము.

10.2-1001-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బిబిస నెప్పుడు నుడుగక
విరెడి వలిచేత వడఁకు విడువక మనముం
చెడి మార్గముఁ గానక
లితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్.

టీకా:

బిసబిస = బిస్ బిస్ అను; ఎప్పుడున్ = ఎప్పుడు; ఉడుగక = ఆగకుండ; విసరెడి = వీస్తున్నట్టి; వలి = శీతగాలి, చలి; చేత = వలన; వడకు = వణుకు; విడువక = వదలకుండ; మనమున్ = మనము; పసచెడి = శక్తిపోయి; మార్గమున్ = దారి; కానక = కనబడక; మసలితిమి = అక్కడే తిరిగాము; అంతటను = పిమ్మట; అంశుమంతుడు = సూర్యుడు {అంశు మంతుడు - కిరణములు కలవాడు, సూర్యుడు}; పొడిచెన్ = ఉదయించెను.

భావము:

తీవ్రంగా వీచే గాలులకు మనం విపరీతంగా వణకసాగాం; మనం ఏం చేయలో తోచక, దిక్కూ తెన్నూ తెలియక అడవిలో తెగ తిరిగాము; అప్పుడు, ఎట్టకేలకు సూర్యోదయం అయింది.

10.2-1002-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెతెలవాఱెడి వేళం
కల మని పలికెఁ బక్షిణ మెల్లెడలన్
మిమిలని ప్రొద్దుపొడువున
ధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్.

టీకా:

తెల = తెల్లగా; తెలవాఱెడి = ఉదయించెడి { తెలవాఱెడి వేళ - తెలవారుఝాము - తెల్లగా వారు (అవ్వు) సమయము}; వేళన్ = సమయము నందు; కలకలమని = కలకల అని; పలికెన్ = కూసెను; పక్షి = పక్షుల; గణము = సమూహములు; ఎల్ల = అన్ని; ఎడలన్ = చోట్ల; మిలమిల = మిలమిల (మెరుస్తు); అని = అని; ప్రొద్దుపొడుపునన్ = సూర్యోదయవేళ; ధళధళమను = తళతళలాడునట్టి; మెఱుగు = వెలుగులు; దిక్ = దిక్కులు; వితానము = సమూహములు; నిండెన్ = నిండిపోయెను.

భావము:

ఇంతలో తెలతెల్లగా తెల్లవారింది. పక్షుల కలకలారావాలు వినబడుతున్నాయి. మిలమిల కాంతులు పరచుకుంటున్నాయి. సకల దిక్కుల లోనూ తళతళలాడుతూ ఉదయకాంతులు నిండాయి.
విశేషము- ఈ పద్యాన్ని పోతనగారు “తెలతెల”, “కలకల”, “మిలమిల”, “ధళధళ” జంటపదాలు అద్భుతంగా వాడారు.

10.2-1003-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు సాందీపని మన
చొప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం
దెప్పిఱిలుటఁ గని ఖేదం
బుప్పతిలం బలికె "నకట! యో! వటులారా!

టీకా:

అప్పుడు = అప్పుడు; సాందీపని = గురువు సాందీపనుడు; మన = మన యొక్క; చొప్పు = జాడ; అరయుచు = వెతుకుతు; వచ్చి = వచ్చి; వాన = వర్షమున తడిసి గాలి; సోకుననున్ = తగులుటచేత; వలిన్ = చలికి; తెప్పఱిలుటన్ = తేరుకొనుచుండుట; కని = చూసి; ఖేదంబున్ = దుఃఖము; ఉప్పతిలన్ = పొంగిపొర్లగా; పలికెన్ = అనెను; అకట = అయ్యో; ఓ = ఓయీ; వటులారా = పిల్లలూ.

భావము:

అప్పుడు, మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారం పొంగిపొరలగా ఇలా అన్నాడు. “అమ్మో! పిల్లల్లారా!....

10.2-1004-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కట! యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి మహాటవిన్ సము
త్కపరిపీడ నొందితిరి; గావున శిష్యులు! మీ ఋణంబు నీఁ
గు కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి
స్ఫు ధనబంధుదారబహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్‌. "

టీకా:

కటకట = అయ్యో; ఇట్లు = ఇలా; మా = మా; కొఱకున్ = కోసము; కాన్ = ఐ; చనుదెంచి = వచ్చి; మహా = గొప్ప; అటవిన్ = అడవి యందు; సమ = మిక్కిలి; ఉత్కట = ఎక్కువైన; పరిపీడన్ = శ్రమమును; ఒందితిరి = పొందారు; కావునన్ = లావుంది, కాబట్టి; శిష్యులు = శిష్యులారా; మీ = మీ యొక్క; ఋణంబున్ = ఋణమును {ఋణము - చేసిన మేలుకు ఇంకా తీర్చని ప్రతిఫలము}; ఈగుట = తీర్చుకొనుటకు; ఇది = దీని; కారణంబు = నిమిత్తమున, వలన; సమకూరెడిబో = తప్పక కలుగుగాక; ఇట = ఇక; మీదన్ = మీదట; మీ = మీ; కున్ = కు; విస్ఫుట = విస్తారమైన; ధన = సంపదలు; బంధు = బంధువులు; దార = భార్య; బహు = పెక్కు మంది; పుత్ర = కొడుకులు అను; విభూతి = వైభవములు; జయ = జయములు; ఆయుస్ = జీవితకాలము; ఉన్నతుల్ = గౌరవములు.

భావము:

మాకోసం అడవికి వచ్చి అయ్యయ్యో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక, ఓ శిష్యులారా! మీరు మీ గురుఋణం తీర్చుకున్నారు. మీకు ధన దార బహు పుత్ర సంపదలూ దీర్ఘాయురున్నతులూ విజయశ్రీలు చేకూరగలవు.”

10.2-1005-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని గారవించి యాయన
లం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం
నుదెంచుట లెల్లను నీ
మునఁ దలఁతే" యటంచు ఱియుం బలికెన్.

టీకా:

కని = చూసి; గారవించి = గారాబములు చూపి; ఆయన = ఆ గురువు; మనలన్ = మనలను; తోడ్కొనుచున్ = కూడా తీసుకొని వెళ్తూ; ఆత్మ = తన; మందిరమునకున్ = ఇంటికి; చనుదెంచుట = వచ్చుట; ఎల్లను = అంత; నీ = నీ యొక్క; మనమునన్ = మనసు నందు; తలతే = గుర్తు చేసుకుంటావా; అట = అని; అంచున్ = అనుచు; మఱియున్ = ఇంకను; పలికెన్ = చెప్పెను.

భావము:

ఇలా దీవించి, పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలచుకుంటూ ఉంటావా?” అని కుచేలునితో శ్రీకృష్ణుడు మరల ఇలా అన్నాడు.

10.2-1006-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె.

టీకా:

అనఘ = పుణ్యుడ; మనము = మనము; అధ్యయనంబు = చదువుకొనుట; చేయచున్ = చేస్తు; అన్యోన్య = పరస్పర; స్నేహ = చెలిమిచేత; వాత్యల్యంబులన్ = ప్రీతిచేతను; చేయు = చేయునట్టి; కృత్యంబులున్ = పనులు; మఱవవు = మరచిపోలేదు; కదా = కదా; అని = అని; అవి = వాటిని; ఎల్లన్ = అన్నిటిని; తలచి = ఙ్ఞాపకము చేసుకొని; ఆడు = పలికెడి; మాధవు = కృష్ణుని; మధుర = తీయని, ఇంపైన; ఆలాపంబులు = మాటలు; విని = విని; అతనిన్ = అతనిని; కనుంగౌని = చూసి; కుచేలుండు = కుచేలుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

“పుణ్యాత్మా! అప్పుడు, మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా?” ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తుచేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు.

10.2-1007-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వజోదర! గురుమందిర
ము మనము వసించునాఁడు ముదమునఁ గావిం
ని పను లెవ్వియుఁ గలవే?
విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా!

టీకా:

వనజోదర = కృష్ణ; గురు = గురువు యొక్క; మందిరమునన్ = గృహము నందు; మనము = మనము; వసించు = ఉండెడి; నాడున్ = రోజులలో; ముదమునన్ = సంతోషముతో; కావింపన = చేయనట్టి; పనులు = పనులు; ఎవ్వియున్ = ఏమైన; కలవే = ఉన్నాయా; వినుము = వినుము; అవి = వానిని; అట్లు = అలా; ఉండనిమ్ము = ఉండనిమ్ము; విమల = నిర్మలమైన; చరిత్రా = నడవడికలవాడా.

భావము:

“ఓ సచ్చరితుడా! దామోదరా! గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉండనీ కాని నా మాట విను.

10.2-1008-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురుమతిఁ దలఁపఁగఁ ద్రిజగ
ద్గురుఁ డవనం దగిన నీకు గురుఁ డనఁగా నొం
డొరుఁ డెవ్వ? డింతయును నీ
యంగ విడంబనంబ గుఁ గాదె హరీ!"

టీకా:

గురు = గొప్ప; మతిన్ = బుద్ధితో; తలపగన్ = విచారించగా; త్రిజగత్ = ముల్లోకములకు; గురుండవు = గురువవు; అనన్ = చెప్ప; తగిన = తగినట్టి; నీ = నీ; కున్ = కు; గురుడు = గురువు; అనగన్ = అనుటకు; ఒండొరుండు = ఇంకొకడు; ఎవ్వడు = ఎవరు; ఇంతయున్ = ఇదంతా; నీ = నీ; కున్ = కు; అరయంగన్ = తరచి చూసినచో; విడంబనంబు = లీలలు; అగున్ = అగును; కాదే = కాదా, అవును; హరీ = కృష్ణ.

భావము:

మురారీ! ముల్లోకాలకూ గురుడవు అన తగిన నీకు గురుడు అంటూ ఇంకొకడు ఉంటాడా? తెలివిగా ఆలోచించి చూస్తే ఇదంతా నీ లీలలే తప్ప మరేమీ కాదు.”

10.2-1009-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున.

టీకా:

అని = అని; సాభిప్రాయంబుగాన్ = సాభిప్రాయముగా; పలికిన = చెప్పిన; పలుకులు = మాటలు; విని = విని; సమస్త = ఎల్లవారి; భావ = అభిప్రాయములు; అభిఙ్ఞుండు = తెలిసినవాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; మందస్మిత = చిరునవ్వు గల; వదన = మోము అను; అరవిందుండు = పద్మములు కలవాడు; అగుచున్ = ఔతు; అతనిన్ = అతనిని; చూచి = చూసి; నీవు = నీవు; ఇచ్చటి = ఇక్కడ; కి = కి; వచ్చునప్పుడు = వచ్చేటప్పుడు; నా = నా; అందుల = ఎడల; భక్తిన్ = భక్తిచేత; నా = నా; కున్ = కు; ఉపాయనంబు = కానుక; కన్ = అగునట్లు; ఏమి = ఏ; పదార్థంబున్ = పదార్థమును; తెచ్చితి = తీసుకొని వచ్చావు; ఆ = ఆ; పదార్థంబున్ = వస్తువును; లేశమాత్రంబు = రవ్వంత; ఐనన్ = అయినను; పదివేలు = పదివేలు (10000); కాన్ = ఐనట్లు; అంగీకరింతున్ = గ్రహించెదను; అట్లుగాక = అలాకాకుండా; నీచ = అల్పబుద్ధికల; వర్తనుడు = నడవడిక కలవాడు; మత్ = నా యొక్క; భక్తిన్ = భక్తి యందు; తగులని = ఆసక్తి లేని; దుష్టాత్ముండు = దుష్టుడు; హేమా = బంగారపు; అచల = కొండ; తుల్యంబు = అంత; ఐనన్ = అయినట్టి; పదార్థంబున్ = వస్తువును; ఒసంగినన్ = ఇచ్చినను; అది = అది; నా = నా; మనంబున్ = మనస్సున; కున్ = కు; సమ్మతంబు = అంగీకారము; కాదు = కాదు; కావునన్ = కాబట్టి.

భావము:

గోవిందుడు సకల ప్రాణుల మనసులోని భావాలను ఎరిగిన వాడు, కనుక సాభిప్రాయంగా కుచేలుడు పలికిన ఈ పలుకులలోని అంతర్యాన్ని గ్రహించాడు. మందస్మిత వదనారవిందుడై కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత...

10.2-1010-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మైనఁ బుష్పమైనను
మైనను సలిలమైనఁ బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన
నెమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్.

టీకా:

దళము = ఆకుల రెమ్మ; ఐనన్ = అయినను; పుష్పము = పువ్వు; ఐనను = అయినను; ఫలము = పండు; ఐనను = అయినను; సలిలము = నీళ్ళు; ఐనన్ = అయినను; పాయని = విడువని; భక్తిన్ = భక్తితో; కొలిచినన్ = సేవించినచో; జనులు = మానవులు; అర్పించిన = ఇచ్చినచో; ఎలమిన్ = ప్రీతితో; రుచిర = పరిశుద్ధమైన; అన్నము = అన్నము; కనె = అయినట్లే; ఏను = నేను; భుజింతున్ = ఆరగించెదను.

భావము:

పత్రమైనా ఫలమైనా పుష్పమైనా జలమైనా సరే భక్తితో నాకు సమర్పిస్తే దానిని మధురాన్నంగా భావించి స్వీకరిస్తాను.”

10.2-1011-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పద్మోదరుఁ డాడిన
వియోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె
చ్చి యడుకులు దగ నర్పిం
ను నేరక మోము వాంచి లుకక యున్నన్.

టీకా:

అని = అని; పద్మోదరుడు = కృష్ణుడు; ఆడిన = పలికిన; వినయోక్తులు = వినయ పూరిత మాటలు; కున్ = కు; ఆత్మన్ = మనస్సులో; అలరి = సంతోషించి; విప్రుడు = బ్రాహ్మణుడు; తాన్ = తాను; తెచ్చిన = తీసుకు వచ్చినట్టి; అడుకులున్ = అటుకులను; తగన్ = తగినట్లు; అర్పింపనేరక = ఇవ్వలేక; మోము = ముఖమును; వాంచి = వంచి; పలుకక = ఏమీ మాట్లాకుండ; ఉన్నన్ = ఉండగా.

భావము:

అనిన పద్మనాభుడి వినయ పూరిత వాక్కులకు కుచేలుడు సంతోషించాడు. తాను తీసుకు వచ్చిన అటుకులను అర్పించలేక తలవంచుకుని మౌనంగా ఉన్నాడు.