దశమ స్కంధము - ఉత్తర : బలరాముని తీర్థయాత్ర
- ఉపకరణాలు:
"హలధర! యిల్వలుండను సురారితనూజుఁడు పల్వలుండు నాఁ
గలఁడొక దానవుండు బలగర్వమునం బ్రతిపర్వమందు న
చ్చలమున వచ్చి మా సవనశాలల మూత్ర సురాస్ర పూయ వి
ట్పలలము లోలిమైఁ గురిసి పాడఱఁ జేయును యజ్ఞవాటముల్.
^ పర్వము
టీకా:
హలధర = బలరామ; ఇల్వలుండు = ఇల్వలుడు; అను = అనెడి; సురారి = రాక్షసుని; తనూజుడు = కొడుకు; పల్వలుండు = పల్వలుండు; నాన్ = అనగా; కలడు = ఉన్నాడు; ఒక = ఒక; దానవుండు = రాక్షసుడు; బల = అధికమైన బలము వలని; గర్వమునన్ = గర్వముచేత; ప్రతి = ప్రతి; పర్వమున్ = పండుగదినము {పర్వము - పండుగ, పంచపర్వములు, 1అష్టమి 2చతుర్దశి 3కుహువు (చంద్రకళ కానరాని అమావాస్య) 4పూర్ణిమ 5రవిసంక్రాంతి}; అందున్ = అందు; ఆ = ఆ యొక్క; చలమునన్ = గర్వముతోటి; వచ్చి = వచ్చి; మా = మా యొక్క; సవన = యజ్ఞ; శాలలన్ = శాలలను; మూత్ర = నీరుడు; సుర = మద్యము; అస్ర = రక్తము; పూయ = చీము; విట్ = మలము; పలలములు = మాంసములను; ఓలిమై = వరసగా; కురిసి = అధికముగా జల్లి; పాడఱన్ = పాడైపోవునట్లు; చేయును = చేయును; యజ్ఞ = యాగ; వాటముల్ = శాలలు.
భావము:
“బలరామా! నాగలి ఆయుధంగా గలవాడా! ఇల్వలుడనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు బలగర్వితుడై ప్రతి పర్వం నాడూ వచ్చి యజ్ఞశాలల్లో మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను చాటునుండి కురిపించి పాడుచేస్తున్నాడు.