పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

 •  
 •  
 •  

10.2-747-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వపద్మలోచను, వబంధమోచను-
భరితశుభాకారు, దురితదూరుఁ,
గంగణకేయూరుఁ, గాంచనమంజీరు-
వివిధశోభితభూషు, విగతదోషుఁ,
న్నగాంతకవాహు, క్తమహోత్సాహు-
తచంద్రజూటు, నున్నతకిరీటు,
రినీలనిభకాయు, రపీతకౌశేయుఁ-
టిసూత్రధారు, జద్విహారు

10.2-747.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హా వనమాలికా మహితోరువక్షు,
శంఖచక్రగదాపద్మశార్‌ఙ్గహస్తు,
లిత శ్రీవత్సశోభితక్షణాంగు,
సుభగచారిత్రు దేవకీసుతునిఁ గాంచి.

టీకా:

నవపద్మలోచను = కృష్ణుని {నవపద్మలోచనుడు - నవ (లేత) పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; భవ = జన్మజన్మల; బంధ = బంధములను; మోచనున్ = తొలగించువానిని; భరిత = నిండు; శుభ = శుభములు; ఆకారున్ = స్వరూపమైనవానిని; దురిత = పాపములను; దూరున్ = తొలగించువానిని; కంకణ = చేతికడియములు; కేయూరున్ = భుజకీర్తులుధరించినవానిని; కాంచన = బంగారు; మంజీరున్ = కాలి అందెలు ధరించినవానిని; వివిధ = నానావిధ; శోభిత = ప్రకాశవంతమైన; భూషున్ = అలంకారములు కలవానిని; విగత = తొలగిన; దోషున్ = పాపములు కలవానిని; పన్నగాంతక = గరుత్మంతుని {పన్నగాంతకుడు - పాములకు యముడు, గరుత్మంతుడు}; వాహున్ = వాహనముగా కలవానిని; భక్త = భక్తులకు; మహా = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహముకలిగించువానిని; నత = నమస్కరించిన; చంద్రజూటున్ = శివుడు కలవానిని {చంద్రజూటుడు - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు}; ఉన్నత = గొప్ప; కిరీటున్ = కిరీటము కలవానిని; హరినీల = ఇంద్రనీలము; నిభ = వంటి; కాయున్ = దేహము కలవానిని; వర = శ్రేష్ఠమైన; పీత = పచ్చని; కౌశేయున్ = పట్టువస్త్రము ధరించినవానిని; కటిసూత్రధారున్ = మొలనూలు ధరించినవానిని; జగత్ = లోకములెల్లను; విహారున్ = విహరించువానిని; హార = ముత్యాలపేరులు; వనమాలికా = వనమాలలచేత {వనమాల - పూలు ఆకులుతో కట్టిన దండలు}; మహిత = ఘనతవహించిన; ఉరు = పెద్ద; వక్షున్ = వక్షస్థలము కలవానిని; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మము; శార్ఙ్గ = శార్ఙ్గము అను విల్లు; హస్తున్ = చేతులందు ధరించినవానిని; లలిత = మనోజ్ఞమైన; శ్రీవత్స = శ్రీవత్సము అను; శోభిత = శోభకల; లక్షణ = గురుతుగల, పుట్టుమచ్చ కల; అంగున్ = దేహము కలవానిని; సుభగ = మనోహరమైన; చారిత్రున్ = నడవడిక కలవానిని; దేవకీసుతునిన్ = కృష్ణుని; కాంచి = చూసి.

భావము:

పద్మాక్షుడూ, భవబంధ విమోచనుడూ, దురిత దూరుడూ, నానాలంకార సంశోభితుడూ, దోష రహితుడూ, భక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చేవాడూ, శివుడి చేత పొగడబడేవాడూ, సకల లోక విహారుడు, గరుడ వాహనుడూ, మంగళాకారుడూ, ఇంద్రనీల ఛాయ దేహము వాడూ, విశాల వక్షము వాడు, గొప్ప కిరీటం ధరించు వాడు, పచ్చని పట్టువస్త్రాలు ధరించు వాడు, ముత్యాల పేరులు వనమాలలు ధరించువాడు, శ్రీవత్సశోభితుడూ, శంఖ చక్ర గదా శార్ఞ్గ పద్మాలను ధరించు వాడు, పవిత్ర చరితుడూ, దేవకీపుత్రుడూ అయిన కృష్ణుడిని ఆ రాజులు అందరు చేరి దర్శించారు.