దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు
- ఉపకరణాలు:
కాలకంఠుఁడు బాణుపైఁ గరుణ గలఁడు
గాన నఖిలాండపతిఁ గృష్ణుఁ గదియవచ్చి
పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్జుఁ
డగుచుఁ బద్మాయతాక్షు నిట్లని స్తుతించె.
టీకా:
కాలకంఠుడు = శివుడు {కాల కంఠుడు - నల్లని కంఠము కలవాడు, శివుడు}; బాణు = బాణుని; పైన్ = మీద; కరుణ = దయ; కలడు = కలవాడు; కానన్ = కాబట్టి; అఖిలాండపతిన్ = కృష్ణుని {అఖిలాండపతి - సర్వులకు అండ (ఆశ్రయమ) ఐన పతి (ప్రభువు), అఖిల (ఎల్ల) అండ (బ్రహ్మాండములకు) పతి (నాయకుడు), విష్ణువు}; కృష్ణుని = కృష్ణుని; కదియన్ = దగ్గరకు; వచ్చి = వచ్చి; పురుషసూక్తంబున్ = పురుషసూక్తము {పురుషసూక్తము - ఒక విశిష్ఠమైన విష్ణు స్తోత్రము, పురుష (శాస్త్రమును అనుసరించి, పరమపురుషుని గురించి) సూక్తము (పలుకబడినది)}; చదివి = చదివి; సంపుట = జోడించిన, దోసిలిపట్టిన; కర = చేతులు అను; అబ్జుడు = పద్మములు కలవాడు; అగుచున్ = ఔతు; పద్మాయతాక్షుని = కృష్ణుని {పద్మాయతాక్షుడు - పద్మముల వలె విశాలమైన కన్నులు కలవాడు, విష్ణువు}; ఇట్లని = ఈ విధముగ; స్తుతించె = స్తుతించెను, పొగిడెను.
భావము:
పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత, ఆయన అతనిని రక్షించడం కోసం లోకనాయకు డైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, పురుషసూక్తం పఠించి, నమస్కరించి, పద్మాక్షుడిని ఇలా స్తుతించాడు