దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు
- ఉపకరణాలు:
అని మఱియు నప్పుండరీకాక్షుండిట్లను “నెవ్వరేనియు నీ యుభయజ్వర వివాదంబును, నీవు మత్ప్రపత్తిం జొచ్చుటయునుఁ జిత్తంబులం దలంతు రట్టి పుణ్యాత్ములు శీతోష్ణజ్వరాది తాపంబులఁ బొర య” రని యానతిచ్చిన నమ్మహేశ్వరజ్వరంబు పరమానందభరిత హృదయంబై యారథాంగపాణికి సాష్టాంగదండప్రణామం బాచరించి నిజేచ్ఛం జనియె; నంత బాణాసురుండు నక్కడ.
టీకా:
అని = అని; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; పుండరీకాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ఇట్లు = ఇలా; అనున్ = పలికెను; ఎవ్వరేనియున్ = ఎవరైనాసరే; నీ = నీ; ఉభయ = రెండు; జ్వర = జ్వరముల; వివాదంబును = తగవును; నీవు = నీవు; మత్ = నా యొక్క; ప్రపత్తిన్ = ప్రాపకమును; చొచ్చుటయున్ = చేరుటను; చిత్తంబులన్ = మనస్సులలో; తలంతురు = ఎంచుకొనెదరో; అట్టి = అటువంటి; పుణ్యాత్ములు = పుణ్యాత్ములు; శీత = చలి యొక్క; ఉష్ణ = తాపము యొక్క; జ్వర = జ్వరము; ఆది = మున్నగు; తాపంబులన్ = తాపములను; పొరయరు = పొందరు; అని = అని; ఆనతిచ్చినన్ = చెప్పగా; ఆ = ఆ; మహేశ్వరజ్వరంబు = శివజ్వరము; పరమ = మిక్కుటమైన; ఆనంద = ఆనందముతో; భరిత = నిండిన; హృదయంబు = మనస్సు కలది; ఐ = అయ్యి; రథాంగపాణి = కృష్ణుని {రథాంగపాణి - రథాంగ (చక్ర) పాణి (చేత ధరించినవాడు), కృష్ణుడు, విష్ణుసహస్రనామాలలోని 998వ నామం}; కిన్ = కి; సాష్టంగదండప్రణామంబు = సాష్టాంగ నమస్కారము {సాష్టాంగ దండ ప్రణామము - 8 అవయవములు (2చేతులు 2పాదములు 2భుజాగ్రములు 1రొమ్ము 1నొసలు) భూమిని ఆనునట్లు కఱ్ఱవలె సాగి చేసెడి నమస్కారము}; ఆచరించి = చేసి; నిజ = తన; ఇచ్చన్ = ఇష్టానుసారమున; చనియె = వెళ్ళిపోయెను; అంతన్ = పిమ్మట; బాణా = బాణుడు అను; అసురుండున్ = రాక్షసుడు; అక్కడ = అక్కడ.
భావము:
అని ఇంకా ఇలా అన్నాడు “ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ; నీవు నన్ను శరణుకోరిన విధానాన్ని; మనస్సులో స్మరిస్తారో, అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు” అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగనమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో, అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్ళీ యుద్ధసన్నద్ధుడై బయలుదేరాడు.