దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు
- ఉపకరణాలు:
అనినఁ బ్రసన్నుఁడై హరి యనంతుఁడు దైత్యవిభేది దాని కి
ట్లనియె "మదీయ సాధన మనన్యనివారణమౌట నీ మదిం
గని నను నార్తిఁ జొచ్చితివి గావున మజ్జ్వర తీవ్ర దాహ వే
దన నినుఁ బొంద దింకఁ బరితాపము దక్కుము నీ మనంబునన్."
టీకా:
అనినన్ = అనగా; ప్రసన్నుడు = అనుగ్రహము కలవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు {హరి - భక్తుల హృదయములు ఆకర్షించువాడు, విష్ణువు}; అనంతుడు = కృష్ణుడు {అనంతుడు - అంతము లేనివాడు, శాశ్వతుడు, విష్ణువు}; దైత్యవిభేది = కృష్ణుడు {దైత్య విభేది - రాక్షసుల శత్రువు, విష్ణువు}; దాని = దాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మదీయ = నా యొక్క; సాధనము = ఉపకరణమేదైనా; అనన్యనివారణము = ఇతరులచే నివారింపరానిది; ఔటన్ = అగుటను; నీ = నీ యొక్క; మదిన్ = మనసు నందు; కని = తెలిసికొని; ననున్ = నన్ను; ఆర్తిన్ = దుఃఖముతో; చొచ్చితివి = శరణు కోరితివి; కావునన్ = కాబట్టి; మత్ = నా యొక్క; జ్వర = జ్వరము యొక్క; తీవ్ర = తీక్షణమైన; దాహ = తాపము యొక్క; వేదన = బాధ; నినున్ = నిన్ను; పొందదు = పట్టుకొనదు; ఇంకన్ = ఇంక; తాపమున్ = బాధపడుటను; తక్కుము = విడువుము; నీ = నీ యొక్క; మనంబునన్ = మనస్సు నందు.
భావము:
అని స్తుతించగా దానవాంతకు డైన కృష్ణుడు శివజ్వరంతో ఇలా అన్నాడు “నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు. కనుక, నా జ్వరం నిన్నుబాధింపదు నీ మనస్సులో పరితాపం మాను”