దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు
- ఉపకరణాలు:
శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు-
దారమై వెలుగొందు తావకీన
భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ-
గడుఁ గృశించితి, నన్ను గరుణఁజూడు
మితరదేవోపాస్తిరతి మాని మీ పాద-
కమలముల్ సేవించు విమలబుద్ధి
యెందాక మది దోఁప దందాఁకనే కదా-
ప్రాణులు నిఖిలతాపములఁ బడుట?
- ఉపకరణాలు:
యవిరళానన్యగతికుల నరసి ప్రోచు
బిరుదుగల నీకు ననుఁ గాచు టరుదె? దేవ!
ప్రవిమలాకార! సంసారభయవిదూర!
భక్తజనపోషపరితోష! పరమపురుష!"
టీకా:
శాంతము = శాంతమైనది; ఐ = అయ్యి; మహిత = మిక్కుటమైన; తీక్ష్ణ = తీక్షణము; సుదుస్సంహంబు = మిక్కిలి సహింపరానిది; ఐ = అయ్యి; ఉదారము = అధిక్యతకలది; ఐ = అయ్యి; వెలుగొందు = ప్రకాశించెడి; తావకీన = నీ యొక్క; భూరి = అతి అధికమైన; భాస్వత్ = ప్రకాశించు; తేజమునన్ = తేజస్సుచేత; తాపమున్ = బాధను; ఒందితిని = పొందితిని; కడు = మిక్కిలి; కృశించితిన్ = చిక్కిపోతిని; నన్నున్ = నన్ను; కరుణన్ = దయతో; చూడుము = ఆదరించుము; ఇతర = ఇతర; దేవ = దేవుళ్ళ; ఉపాస్తి = ఉపాసన యందు; రతిన్ = ఆసక్తిని; మాని = విడిచిపెట్టి; మీ = మీ యొక్క; పాద = పాదములు అను; కమలముల్ = కమలములను; సేవించు = కొలిచెడి; విమల = నిర్మలమైన; బుద్ధిన్ = బుద్ధి; ఎందాక = ఎప్పటివరకు; మదిన్ = మనసునందు; తోపదు = కలుగదో; అందాకనే = అప్పటివరకు మాత్రమే; కదా = కదా; ప్రాణులు = మానవులు; నిఖిల = సర్వ; తాపములన్ = బాధలను {తాపత్రయములు - 1అధ్యాత్మిక 2ఆధిదైవిక 3ఆధిభౌతికము అను మూడు తాపములు}; పడుట = అనుభవించుట; అవిరాళ = ఎడతెగక; అనన్యగతికులన్ = ఏకాగ్రమైనభక్తులను; అరసి = తరచివిచారించి; ప్రోచు = కాపాడు; బిరుదు = ప్రతిజ్ఞ; కల = ఉన్నట్టి; నీవు = నీ; కున్ = కు; ననున్ = నన్ను; కాచుట = కాపాడుట; అరుదె = అపూర్వమైనదా, కాదు; దేవ = భగవంతుడా; ప్రవిమల = మిక్కిలి నిర్మలమైన; ఆకారా = స్వరూపము కలవాడా; సంసార = సంసారము వలని; భయ = భయమును; విదూర = దూరముచేయువాడా; భక్త = భక్తులు; జన = అందరకును; పోష = పోషణము; పరితోష = సంతోషము కలుగజేయు వాడా; పరమపురుష = పురుషోత్తమ.
భావము:
ఓ పరమపురుషా! భక్తజన ఆనందదాయకా! సంసార భయనివారకా! దివ్యాకారా! శాంతమూ, తీక్షణమూ, దుస్సహమూ, ఉదారమూ అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సు వలన తాపం పొందాను, కృశించిపోయాను నన్ను రక్షించు. ఇతర దైవాలను సేవించడం మాని నీ పాదపద్మాలను సేవించాలనే బుద్ధి ఉదయించేటంతవరకే అన్ని తాపాలు. అనాథ రక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించడం ఏమంత గొప్పవిషయం.”