దశమ స్కంధము - ఉత్తర : బాణాసురునితో యుద్ధంబు
- ఉపకరణాలు:
సరిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్ మాపి వే
పరిఖల్ పూడిచి యంత్రముల్ దునిమి వప్రవ్రాతముల్ ద్రొబ్బి గో
పురముల్ గూలఁగఁ ద్రోచి సౌధ భవనంబుల్ నూకి ప్రాకారముల్
ధరణిం గూల్చి కవాటముల్ విఱిచి రుద్దండక్రియాలోలురై.
టీకా:
సరిత్ = నదులు; ఆరామ = ఉద్యానవనములు; సరోవర = చెరువులు; ఉపవన = తోటలు; యజ్ఞ = యాగ; స్థానముల్ = శాలలు; మాపి = పాడుచేసి; వేన్ = శీఘ్రముగా; పరిఖల్ = అగడ్తలు; పూడిచి = మట్టితో నింపేసి; యంత్రముల్ = కీలు కల సాధనములు; తునిమి = ముక్కలుచేసి; వప్ర = కోటబురుజుల; వ్రాతముల్ = సమూహములను; ద్రొబ్బి = పడగొట్టి; గోపురముల్ = తోరణ ద్వారములను; కూలంగద్రోచి = కూలగొట్టి; సౌధ = అంతస్థుల; భవనంబుల్ = ఇళ్ళు; నూకి = తోసేసి; ప్రాకారముల్ = ప్రహారీ గోడలను; ధరణింగూల్చి = నేలగూల్చి; కవాటముల్ = తలుపులను; విఱిచి = విరగ్గొట్టి; ఉద్దండ = ఉద్ధండమైన; క్రియన్ = పనులు చేయు టందు; లోలురు = లగ్నమైనవారు; ఐ = అయ్యి.
భావము:
యాదవవీరులు అత్యుత్సాహంగా శోణపురంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు; అగడ్తలను పూడ్చివేశారు; యంత్రాలను చెడగొట్టారు; కోటలను పడగొట్టారు; గోపురాలను కూలద్రోశారు; సౌధాలను, ప్రాకారాలను నేలకూల్చారు; కవచాలు విరగగొట్టారు.