దశమ స్కంధము - ఉత్తర : చిత్రరేఖ పటంబున చూపుట
- ఉపకరణాలు:
"శారద నీరదాబ్జ ఘనసార సుధాకర కాశ చంద్రికా
సార పటీరవర్ణు, యదుసత్తము, నుత్తమనాయకుం, బ్రమ
త్తారి నృపాల కానన హుతాశనమూర్తిఁ, బ్రలంబదైత్య సం
హారునిఁ, గామపాలుని, హలాయుధుఁ జూడుము దైత్యనందనా!
టీకా:
శారద = శరత్కాలపు; నీరద = మేఘము వంటి; అబ్జ = శంఖము వంటి; ఘనసార = కర్పూరము వంటి; సుధాకర = చంద్రుని వంటి; కాశ = రెల్లుపూల వంటి; చంద్రికా = వెన్నెల వంటి; సారపటీర = మంచిగంధము వంటి; వర్ణున్ = రంగువానిని; యదు = యాదవవంశమున గల; సత్తమున్ = సమర్థుని; ఉత్తమనాయకున్ = ధీరోధాత్త నాయకుని; ప్రమత్త = మిక్కిలి మదము కల; అరి = శత్రువులైన; నృపాల = రాజులు అను; కానన = అడవికి; హుతాశన = అగ్ని; మూర్తిన్ = స్వరూపుని; ప్రలంబ = ప్రలంబుడు అను; దైత్య = రాక్షసుని; సంహారునిన్ = చంపినవానిని; కామపాలుని = బలరాముని; హలాయుధున్ = బలరాముని {హలాయుధుడు - నాగలి ఆయుధముగా కలవాడు, బలరాముడు}; చూడుము = చూడుము; దైత్యనందనా = రాక్షసకుమారి, ఉషా.
భావము:
“ఓ దైత్య బాలికా! ఉషా! శరత్కాల మేఘం, శంఖం, ఘనసారం, చంద్రుడు, చందనం వంటి వర్ణంతో శోభిస్తున్న ఈ వీరుడు బలరాముడు; ఇతడు ఉత్తమ నాయకుడు; ప్రమత్తులైన శత్రురాజులు అనే అరణ్యాల పాలిట అగ్నిదేవుని వంటివాడు; ప్రలంబుడనే దైత్యుని సంహరించిన మహావీరుడు; కామపాలుడు; ఇతడే హలాయుధుడు అయిన యదువంశశేఖరుడు.