దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
"సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్
నర సుర యక్ష కింపురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కి
న్నరవర ముఖ్యులం బటమునన్ లిఖియించినఁ జూచి నీ మనో
హరుఁ గని వీడె పొమ్మనిన నప్పుడె వానిని నీకుఁ దెచ్చెదన్."
టీకా:
సరసిజనేత్ర = పద్మాక్షి; ఏటికి = ఎందుకు; విచారము = దుఃఖపడుట; నా = నా యొక్క; కుశలత్వము = నేర్పు; ఏర్పడన్ = విశద మగునట్లు; నర = మానవుల; సుర = దేవతల; యక్ష = యక్షుల; కింపురుష = కింపురుషుల; నాగ = నాగుల; నభశ్చర = ఆకాశ గమనుల; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; కిన్నర = కిన్నరులలో; వర = శ్రేష్ఠులలో; ముఖ్యులన్ = ముఖ్యమైనవారిని; పటమునన్ = బొమ్మలు వేయు బట్టమీద; లిఖియించినన్ = గీయగా; చూచి = చూసి; నీ = నీ యొక్క; మనోహరున్ = మనస్సు దొంగిలించిన వాని; కని = చూసి; వీడె = ఇతడే; పొమ్ము = పో, వెళ్ళు; అనినన్ = అనగాన్; అప్పుడె = వెంటనే; వానినిన్ = అతనిని; నీ = నీ; కున్ = కు; తెచ్చెదన్ = తీసుకొని వచ్చెదను.
భావము:
“ఓ పద్మాక్షీ! ఉషా! ఎందుకు విచారిస్తావు. నా నేర్పరితనం అంతా చూపిస్తాను. దేవ, మానవ, యక్ష, కిన్నర, సిద్ధ, సాధ్య శ్రేష్ఠుల చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను. వారిలో నీ మనసు దోచుకున్నవాడు ఎవరో నీవు గుర్తిస్తే, ఆ వెంటనే వాడిని నీ చెంతకు తీసుకుని వస్తాను.”