దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
అనుచు నమ్మత్తకాశిని చిత్తంబు చిత్తజాయత్తంబయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టఁ గన్నీరుమున్నీరుగా వగచుచు విన్ననైన వదనారవిందంబు వాంచి యూరకున్నఁ జిత్రరేఖ దన మనంబున న య్యింతి సంతాపంబు చింతించి యిట్లనియె.
టీకా:
అనుచున్ = అంటు; ఆ = ఆ యొక్క; మత్తకాశిని = ఉషాకన్య {మత్తకాశిని - మదముచేత ప్రకాశించు స్త్రీ}; చిత్తంబున్ = మనస్సును; చిత్తజ = మన్మథునికి; ఆయత్తంబు = ఆథీనమైనది; అయి = అయ్యి; తత్తరంబునన్ = తడబాటుతో; విరహా = ఎడబాటువలని; అనలంబున్ = తాపము; ఉత్తలపెట్టన్ = వేధించుచుండగా; వగచుచున్ = దుఃఖించుచు; విన్నను = చిన్న; ఐన = పోయిన; వదన = మోము అను; అరవిందంబున్ = పద్మమును; వాంచి = వంచుకొని; ఊరకున్నన్ = ఊరుకోగా; చిత్రరేఖ = చిత్రరేఖ; మనంబునన్ = మనస్సు నందు; ఆ = ఆ; ఇంతి = పడతి, ఉష; సంతాపంబున్ = పరితాపమును; చింతించి = విచారించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఇలా చెలికి చెప్పిన ఉషాసుందరి తన మనస్సు మన్మథ వేదనతో, విరహనలం అధికం కాగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తలవంచుకుని ఊరకున్నది. చిత్రరేఖ ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి ఇలా పలికింది.