దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
"భామినీమణి! సొబగుని బయల వెదకు
విధమునను నాత్మ విభుఁ బాసి విహ్వలించు
వగను జేతికి లోనైనవానిఁ బాసి
భ్రాంతిఁ బొందిన భావంబు ప్రకటమయ్యె.
టీకా:
భామినీ = యువతులలో; మణి = ఉత్తమురాలా; సొబగుని = అందగాడిని; బయలన్ = వెలుపల; వెదకు = అన్వేషించు; విధముననున్ = విధముగా; ఆత్మ = తన; విభున్ = పెనిమిటిని; పాసి = దూరమై; విహ్వలించు = పరవశముచేసెడి; వగనున్ = తాపముతో; చేతి = చేతి; కిన్ = కి; లోనైన = దొరికిన; వానిన్ = వాడిని; పాసి = దూరమై; భ్రాంతి = భ్రమపడుట; పొందిన = పొందినట్టి; భావంబున్ = విధము; ప్రకటము = కనబడునది; అయ్యెన్ = అయినది.
భావము:
“ఓ యువతీ రత్నమా! నీ ప్రవర్తన చూస్తుంటే ప్రియుడి కోసం దిక్కులు చూస్తూ వెతుకుతున్నట్లూ, ప్రాణేశ్వరుడికి దూరమై బాధ చెందుతున్నట్లూ, చేతికి చిక్కిన వానిని కోల్పోయి భ్రాంతిలో మునిగినట్లూ కనబడుతోంది.