దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
అంతకంతకు సంతాప మతిశయించి
వలుఁద చన్నులు గన్నీటి వఱదఁ దడియఁ
జెలులదెసఁ జూడఁ జాల లజ్జించి మొగము
వాంచి పలుకక యుండె న వ్వనరుహాక్షి.
టీకా:
అంతకంతకున్ = సమయము గడచు కొలది; సంతాపము = వేదన; అతిశయించి = పెరిగిపోయి; వలుద = పెద్ద; చన్నులున్ = స్తనములు; కన్నీటి = కన్నీటి యొక్క; వఱదన్ = ప్రవాహము నందు; తడియన్ = తడిసిపోగా; చెలుల = చెలికత్తెల; దెసన్ = వైపు; చూడన్ = చూచుటకు; చాలన్ = మిక్కిలి; లజ్జించి = సిగ్గుపడి; మొగమున్ = ముఖమును; వాంచి = వంచుకొని; పలుకక = మాటలాడకుండ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; వనరుహాక్షి = పద్మాక్షి.
భావము:
ఆ పద్మాల వంటి కన్నులు గల కన్య అంతకంతకూ సంతాపం అధికమై వక్షోజాలపై కన్నీరు కాల్వలు కట్టగా చెలికత్తెల వైపు కన్నెత్తి చూడడానికి చాల సిగ్గుపడి ముఖం వంచుకుని మాట్లాడకుండా ఉండిపోసాగింది.