దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
పొరిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ బుక్కిటనుంచి కుచాగ్రసీమపై
బెరసిన సన్న లేఁజెమటబిందువు లొయ్యన నార్చుఁ గన్నులం
దొరఁగెడు బాష్పపూరములు దొంగలిఱెప్పల నాని చుక్కలం
"దరుణులు! రండు చూత'మని తా మొగ మెత్తును గూఢరాగ యై.
టీకా:
పొరిపొరిన్ = ఒకదాని మీదొకటి; పుచ్చు = వదలెడి; ఊర్పు = నిట్టూర్పుల; గమిన్ = సమూహమును; పుక్కిటన్ = పుక్కిలిలో {పుక్కలి - బుగ్గల లోపల భాగం}; ఉంచి = అణచుకొని; కుచాగ్ర = స్తనముల; సీమ = ప్రదేశము; పైన్ = మీద; బెరసిన = ఆవరించిన; సన్న = కొద్దిగా పట్టిన; లేత = లేత; చెమట = చెమట యొక్క; బిందువులున్ = బిందువులను; ఒయ్యన = మెల్లగా; ఆర్చున్ = ఊదుతు; కన్నులన్ = కళ్ళలో; తొరగెడు = స్రవించెడి; బాష్పపూరములున్ = కన్నీటిని; తొంగలి = వాలుచున్న; ఱెప్పలన్ = కనురెప్ప లందు; ఆని = నిలిపికొని; చుక్కలన్ = నక్షత్రములను; తరుణులు = యువతులు; రండు = రండి; చూతము = చూసెదము; అని = అని; తాన్ = ఆమె; మొగమున్ = ముఖమును; ఎత్తునున్ = పైకెత్తును; గూఢ = రహస్యమైన; రాగ = అనురాగము కలామె; ఐ = అయ్యి.
భావము:
వస్తున్న నిట్టూర్పులను అణచుకున్నది. వక్షోజాలపై పొడసూపిన చిరుచెమటను తుడిచి వేసింది. నేత్రాల నుండి జారనున్న కన్నీటిని రెప్పల క్రింద ఆపి, నక్షత్రాలను చూద్దాం రండని స్నేహితురాండ్రను పిలిచి ఆ వంకతో ముఖం పైకెత్తింది. ఇలా తన అనురాగం బయటపడకుండా దాచుతున్నది.