దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
సరసమృదూక్తులుం, గుసుమసాయకకేళియు, శాటికా కచా
కరషణముల్, నఖక్రియలుఁ, గమ్రకపోల లలాట మేఖలా
కర కుచ బాహుమూలములుఁ గైకొని యుండుట లాదిగాఁ దలో
దరి మది గాఢమై తగిలె దర్పకుఁ డచ్చుననొత్తినట్లయై.
టీకా:
సరస = సరసమైన; మృదు = మెత్తని; ఉక్తులున్ = మాటలు; కుసుమసాయకు కేళియు = మన్మథక్రీడ; శాటికా = పైట కొంగు; కచా = శిరోజములను; ఆకరషణముల్ = లాగుట; నఖక్రియలున్ = నఖక్షతములు; కమ్ర = ఇంపైన; కపోల = చెక్కిళ్ళు; లలాట = నొసలు; మేఖలా = మొలతాడు; కర = చేతులు; కుచ = స్థనములు; బాహుమూలములున్ = చంకలు; కైకొని = చేతితో ఒత్తి; ఉండుటలు = ఉండుట; ఆదిగాన్ = మున్నగునవి; తలోదరి = యువతి {తలోదరి - తల (పల్చటి) ఉదరము కలామె, స్త్రీ}; మదిన్ = మనసు నందు; గాఢమై = గాఢముగా; తగిలెన్ = అంటెను; దర్పకుడు = మన్మథుడు; అచ్చున్ = అచ్చు; ఒత్తినట్లు = గుద్దినట్లు; ఐ = అయ్యి, తోచి.
భావము:
మృదుసరస సంభాషణలూ; మన్మథ లీలలూ; కొంగు, శిరోజాలు లాగటం; కపోల, లలాట, బాహుమూల, కుచాదుల మీద గోటిగుర్తులూ వంటివి అన్నీ ఆమె మనస్సులో గాఢ ముద్రవేశాయి. ఆ యువకుడు అచ్చంగా మన్మథుడిలాగా వచ్చి ఆమెను గ్రుచ్చి కౌగలించినట్లే ఆమెకు అనిపించింది.