దశమ స్కంధము - ఉత్తర : బాణున కీశ్వర ప్రసాద లబ్ధి
- ఉపకరణాలు:
"శంకర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంకర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా
ట్కంకణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంకజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! "
టీకా:
శంకర = శివా {శంకరుడు - శుభమును చేయువాడు, శివుడు}; భక్తమానసవశంకర = శివా {భక్త మానస వశంకరుడు - భక్తుల మనసులను వశపరచుకొనువాడు, శివుడు}; దుష్టమదాసురేంద్రనాశంకర = శివా {దుష్ట మదాసురేంద్ర నాశంకరుడు - దుర్మార్గులైన మదించిన రాక్షసరాజులను నాశనము చేయువాడు, శివుడు}; పాండునీలరుచిశంకరవర్ణనిజాంగ = శివా {పాండు నీల రుచి శంకరవర్ణ నిజాంగుడు - పాండు (తెలుపు) నీల (నలుపు) రుచి (కాంతులచే) శంకర (శుభము కలుగ జేయుచున్న) వర్ణ (రంగులు కల) నిజ (తన) అంగ (దేహము కలవాడు), శివుడు}; భోగిరాట్కంకణ = శివా {భోగిరా ట్కంకణుడు - భోగిరాట్ (సర్పరాజు, వాసుకి) కంకణముగా కలవాడు, శివుడు}; పార్వతీహృదయకైరవకైరవమిత్ర = శివా {పార్వతీ హృదయ కైరవకైరవమిత్రుడు - పార్వతి మనస్సు అను కైరవ (తెల్ల కలువకు) కైరవమిత్రుడు (చంద్రుడు వంటి వాడు), శివుడు}; యోగిహృత్పంకజపంకజాప్త = శివా {యోగి హృత్పంకజ పంకజాప్తుడు - యోగుల హృదయములను పంకజ (పద్మముల)కు పంకజాప్తుడు (సూర్యుని వంటి వాడు), శివుడు}; నిజతాండవఖేలన = శివా {నిజ తాండవ ఖేలనుడు - నిజ (స్వకీయమైన) తాండవమను నాట్యమును ఖేలన (ఆడు వాడు), శివుడు}; భక్తపాలనా = శివా {భక్త పాలనుడు - భక్తులను పాలించువాడు, శివుడు}.
భావము:
“శంకరా! భక్తవశంకరా! దుష్ట మదోన్మత్త రాక్షసులను నశింపచేయువాడా! ధవళాంగా! నీలకంఠా! సర్పభూషణా! పార్వతీ ప్రాణవల్లభా! యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యునివంటివాడా! తాండవ కేళీ ప్రియా! భక్తపరిపాలకా!”