పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సత్యభామ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-172-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

టీకా:

లేమా = చిన్నదానా {లేమ - లేతవయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ = జయింప; లేమా = సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కడగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలివేయుము; మానవు = మానని; ఏనిన్ = పక్షమున; లే = లెమ్ము; మా = మా యొక్క; విల్లున్ = ధనుస్సు; అందికొనుము = పుచ్చుకొనుము; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో.

భావము:

“భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!”
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, “లేమా” అనే అక్షర ద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకౌశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాలా అన్నట్లు ఉంటుంది “10.2-187-క. కొమ్మా…” పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.