దశమ స్కంధము - ఉత్తర : నరకాసుర వధ కేగుట
- ఉపకరణాలు:
ఆ దనుజేంద్రయోధ వివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్
మేదినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళ మార్గణాళిఁ గ్ర
వ్యాదకులాంతకుండసుర హస్త భుజానన కంఠ జాను జం
ఘాదులఁ ద్రుంచివైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్.
టీకా:
ఆ = ఆ; దనుజ = రాక్షస; ఇంద్ర = రాజు యొక్క; యోధ = వీరుల; వివిధ = నానా విధములైన; ఆయుధ = ఆయుధముల; సంఘమున్ = సమూహమును; ఎల్లనున్ = అన్నిటిని; ఉగ్రతన్ = తీవ్రతతో; మేదినిన్ = నేలపై; కూలనేయుచున్ = పడగొట్టుచు; సమ = మిక్కిలి; ఇద్ధ = ప్రకాశవంతమైన; నిరర్గళ = అడ్డులేని; మార్గణ = బాణముల; ఆళిన్ = సమూహముచేత {క్రవ్యాదుడు - మాంస భక్షకుడు, రాక్షసుడు}; క్రవ్యాదకులాంతకుండు = కృష్ణుడు {క్రవ్యాదకులాంతకుడు - క్రవ్యాద (రాక్షస) కులమునకు అంతకుడు (యముడు), విష్ణువు}; అసుర = రాక్షసుల {అసురులు - సుర (దేవత)లు కాని వారు, రాక్షసులు}; హస్త = చేతులు; భుజ = భుజములు; ఆనన = ముఖములు; కంఠ = మెడలు; జాను = మోకాళ్ళు; జంఘా = పిక్కలు; ఆదులన్ = మున్నగువాటిని; త్రుంచివైచెన్ = నరికివేసెను; తిలలు = నువ్వుగింజలు; అంతలు = అంతేసి; ఖండములు = ముక్కలు; ఐ = అయ్యి; ఇలన్ = నేలపై; పడన్ = పడునట్లుగా.
భావము:
ఆ రాక్షస యోధులు ప్రయోగించే ఆయుధాలు అన్నింటినీ పరాక్రమంతో నేలపాలు చేస్తూ, నిరాటంకంగా బాణాలను ప్రయోగించి, శ్రీకృష్ణుడు ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు మొన్నగు అవయవాలు అన్నింటినీ నువ్వు గింజలంత ముక్కలు ముక్కలై క్రింద పడేలా ఖండించాడు.