దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ కల్యాణంబు
- ఉపకరణాలు:
హరి యీ తెఱఁగున రుక్మిణి
నరుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు
ష్కరకృత్య మనుచు వెఱగం
దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్.
టీకా:
హరి = కృష్ణుడు; ఈ = ఈ; తెఱగునన్ = విధముగ; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని; అరుదుగన్ = అపురూపముగా; కొనివచ్చి = తీసుకు వచ్చి; పెండ్లి = వివాహము; ఆడుట = చేసికొనుట; విని = విని; దుష్కర = అసాధ్యమైన; కృత్యము = పని; అనుచు = అని; వెఱగందిరి = ఆశ్చర్యపడిరి; రాజులున్ = రాజులు; రాజసుతులున్ = రాకుమారులు; దిక్కులన్ = అన్నివైపుల ఉన్నవారు; ఎల్లన్ = అందరును.
భావము:
ముకుందుడు శ్రీకృష్ణుడు రుక్మణీదేవిని అపూర్వంగా తీసుకొని వచ్చి యిలా వివాహమాడిన విధము, బహు దుస్సాధ్య మైన విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాకుమారులు, అందరు అచ్చరువొందారు. అంటు పరీక్షిత్తునకు శుకుడు చెప్పసాగాడు.