దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు
- ఉపకరణాలు:
"నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!"
టీకా:
నమ్మితిన్ = నమ్మినాను; నా = నా యొక్క; మనంబునన్ = మనసునందు; సనాతనులు = శాశ్వతులు; ఉమా = పార్వతీ {ఉమ - అనత్యీత్యుమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి}; మహేశులన్ = పరమేశ్వరులను {మహేశుడు - మహాంశ్ఛాసావీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు}; మిమ్మున్ = మిమ్ములను; పురాణదంపతులన్ = పురాతనమైన దంపతుల; మేలు = చక్కగా; భజింతున్ = పూజించెదను; కదా = కదా; అమ్మ = తల్లీ; మేటి = గొప్ప; పెద్దమ్మ = గొప్పతల్లీ; దయా = దయకు; అంబురాశివి = సముద్రమువంటి ఆమెవు; కదా = కదా; అమ్మ = తల్లీ; హరిన్ = కృష్ణుని; పతిన్ = భర్తగా; చేయుము = కావింపుము; అమ్మ = తల్లీ; నిన్నున్ = నిన్ను; నమ్మిన = నమ్ముకొన్న; వారి = వారల; కిన్ = కి; ఎన్నటికిన్ = ఎప్పటికి; నాశము = చెరుపు; లేదు = లేదు; కద = కదా; అమ్మ = తల్లి; ఈశ్వరీ = పార్వతీదేవి.
భావము:
“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. (గమనిక: రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.)