పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ప్రవర్షణ పర్వ తారోహణంబు

  •  
  •  
  •  

10.1-1674-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శైలేంద్రముఁ జుట్టి రా విడిసి రోషావిష్టుఁడై మాగధో
ర్వీశుం డా వసుదేవ నందనులఁ దా వీక్షింపఁగా లేక త
న్నాశేచ్ఛన్ బిల సాను శృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్
రాశుల్గా నిడి చిచ్చుపెట్టఁ బనిచెన్ రౌద్రంబుతో భృత్యులన్.

టీకా:

ఆ = ఆ యొక్క; శైల = పర్వత; ఇంద్రము = శ్రేష్ఠము; చుట్టిరా = చుట్టూరా; విడిసి = చుట్టుముట్టి; రోషావిష్టుడు = రోషావేశము కలవాడు; ఐ = అయ్యి; మాగధోర్వీశుండు = జరాసంధుడు {మాగధోర్వీశుడు - మాగధ దేశ ప్రభువు, జరాసంధుడు}; ఆ = ఆ యొక్క; వసుదేవ = వసుదేవుని; నందనులన్ = పుత్రులను; తాన్ = అతను; వీక్షింపగాన్ = కనుగొన; లేక = లేకపోవుటచే; తత్ = వారిని; నాశ = నాశనము చేయవలె నని; ఇచ్ఛన్ = కోరికతో; బిల = గుహలలోను; సాను = చరియలలోను; శృంగములన్ = శిఖరములలోను; పూర్ణ = పూర్తిగా; క్రోధుడు = కోపము గలవాడు; ఐ = అయ్యి; కాష్ఠముల్ = కఱ్ఱలను, దుంగలను; రాశులుగా = పోగులుగా; ఇడి = పెట్టి; చిచ్చు = నిప్పు; పెట్టన్ = పెట్టుటకు; పనిచెన్ = నియమించెను; రౌద్రంబు = భీకరత్వము; తోన్ = తోటి; భృత్యులన్ = సేవకులను.

భావము:

మగధదేశాధీశుడైన జరాసంధుడు కోపవివశుడై ఆ పర్వతరాజం చుట్టూ దండువిడిశాడు. ఎంత వెతికించినా, అక్కడ రామకృష్ణులను కనుగొనలేకపోయాడు. వారిని నాశనం చేయాలని, ఆ కొండగుహల్లో చరియల్లో శిఖరాల్లో కట్టెలు కట్టలు కట్టలు పేర్చి దహించివేయ మని రౌద్రంతో సేవకులను ఆజ్ఞాపించాడు.