దశమ స్కంధము - పూర్వ : గోపికల విరహాలాపములు
- ఉపకరణాలు:
లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ?
గలకాలంబు నహంబు గాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా
వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;
కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్.
టీకా:
లలనా = పడతి {లలన – విలసనశీల యైనామె, స్త్రీ}; ఏటికిన్ = ఎందుకు; తెల్లవాఱెన్ = తెల్లవారినది; రవి = సూర్యుడు {రవి – రూయతేస్తూ యత ఇతి రవిః, సూర్యుడు}; ఏలా = ఎందుకు; తోచెన్ = కనబడెను; పూర్వా = తూర్పు; అద్రి = కొండ; పైన్ = మీద; కలకాలంబు = ఎల్లప్పుడు; అహంబు = పగలు; కాకన్ = కలుగకుండా; నిశి = రాత్రి; కాన్ = అగునట్లు; కల్పింపడు = కలుగజేయడు; ఆ = ఆ యొక్క; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; తాన్ = తాను; వలఱేడున్ = మన్మథుడును {మన్మథుడు – యత్ బుద్ధిః తాం మంథాతీతి మన్మథః};; కృపలేడు = దయలేనివాడు; కీరములు = చిలుకలు; దుర్వారంబులు = అడ్డగింపరానివి; ఎట్లోకదే = ఎలాగో ఏమిటో; కలదే = ఉన్నదా అసలు; మాపటి = రాత్రి; కాలము = సమయము; అందున్ = దానిలో; మన = మన; కున్ = కు; కంజాక్షు = పద్మాక్షునితో, కృష్ణునితో; సంభోగముల్ = కలియికలు.
భావము:
ఓ విలాసవతీ! ఎందుకు తెలవారిందే? తూర్పుకొండ మీద భానుడు ఎందుకు ఉదయించాడే? ఉన్న పగళ్ళన్నీ ఎప్పటికీ తెలవారని రాత్రిళ్ళుగా బ్రహ్మదేవు డెందుకు చేయడే? మన్మథుడు కూడా మరీ కరుణమాలినవాడు అయిపోయాడు. చిలుకలను వారించేవారే లేరు. ఎలాగమ్మా ఈ పగలు వేగించడం? మళ్ళీ రాత్రి అవుతుందా? పద్మాక్షుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా?
విశేషము : - కృష్ణవిరహదుఃఖంతో ఓపికలులేక ఇళ్లల్లో వేగిపోతూ ఉన్న గోపికలలో ఒకామె తన స్నేహితురాలి దగ్గర ఇలా విలపిస్తోంది. తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం కలిగి మెళకువ అనుకుంటే, ‘ఇంద్రియాణాం మనశ్చాస్మి’ అని గీత కనుక రవి అంటే మనస్సు అనుకుంటే, పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని, అద్రి అంటే ఈ దేహం అనుకుంటే, మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు. అహము అంటే సంసార సంపాదనకై సంచారం చేసే పగలు అనుకుంటే నిశి అంటే నిర్వికల్ప స్థితిలో ఉండే సమయం రాత్రి అనుకుంటే. పగళ్ళు వద్దు రాత్రే కావాలి అనటం. ‘బుద్ధిః తాం మంథాతీతీ మన్మథః ’ అని వ్యుత్పత్తి. ఆ మన్మథుడు మనసుని బ్రహ్మజ్ఞానం తెలుసుకోమని మథించేస్తున్నాడుట, పోని సంసార లంపటంలో పడుతున్నాడు పడనీ అని జాలిపడకుండా. చిలకలు అంటే సమాధి కుదరకుండా చెదరగొట్టే బాహ్యాభ్యంతరంలో ‘తియ్యగా అనిపించే శబ్దప్రపంచం’ అనుకుంటే. దానిని ఆపే నాథుడు లేడని విసుగు కలుగుతోంది అనుకోవచ్చు. మాపటివేళ అంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానం స్పురించే సమాధిలో ఉండే సమయం. కంజాక్షుడు బ్రహ్మజ్ఞానమే చూపుగా కల ఆ పరబ్రహ్మతో కూడుట ఎప్పటికి లభిస్తుంది అని ఆత్రుతగా ఉంది అనుకోవచ్చు.