ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట
- ఉపకరణాలు:
వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా, వారింప నా వల్లభుల్
రారీవేళ, నుపేక్ష సేయఁ దగవే, రావే, నివారింపవే?
లే రే త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగి యై కుయ్యిడం
గారుణ్యంబున భూరివస్త్రకలితంగాఁ జేయఁడే ద్రౌపదిన్?
టీకా:
వైరుల్ = శత్రువులు; కట్టిన = కట్టుకొన్న; పుట్టముల్ = వస్త్రములను; విడువఁగా = విప్పుతుండగా; వారింపన్ = ఆపుటకు; నా = నాయొక్క; వల్లభుల్ = భర్తలు; రారు = వచ్చుటలేదు; ఈ = ఈ; వేళన్ = సమయమును; ఉపేక్షన్ = ఆలస్యమును; చేయన్ = చేయుటకు; తగవే = తగదు; రావే = రమ్ము; నివారింపవే = అడ్డగింపుము; లేరు = లేరు; ఏ = ఏ; త్రాతలు = రక్షించేవారు; కృష్ణా = కృష్ణా; అంచున్ = అంటూ; సభ = సభ; లోన్ = లోపల; లీన = ఒదిగిన; అంగి = శరీరము కలది; ఐ = అయి; కుయ్యిడన్ = మొరపెట్టుకొనగా; కారుణ్యంబున = దయతో; భూరి = అత్యధికములు అయిన {భూరి - 1. ఒకటి (1) తరువాత 34 సున్నాలు కల సంఖ్య అదే కోటైతే తరువాత ఏడు (7) సున్నాలు. 2. చాలా ఎక్కువ, 3. అత్యధికమైన}; వస్త్ర = వస్త్రములు; కలితంగాన్ = కలిగినది అగునట్లుగ; చేయఁడే = చేయలేదా ఏమి; ద్రౌపదిన్ = ద్రౌపదిని.
భావము:
ఆనాటి మహాసభలో క్రూరాత్ములై కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు. ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్జాసంకుచితాంగియై ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా!