పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గర్భస్థకుని విష్ణువు రక్షించుట

  •  
  •  
  •  

1-287-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భక్తపరాధీనుం డయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలం దనచేతి యఖండిత మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి విప్రుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁజెఱచి డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి గర్భంబు గందకుండ నర్భకునికి నానందంబు గల్పించిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తుల; పర = పరముగ; ఆధీనుండు = లొంగి ఉండువాడు; అయిన = అయినట్టి; పరమేశ్వరుండు = హరి; ఆవిర్భవించి = ప్రభవించి; మంచు = మంచును; విరియించు = విరిచేసే; మార్తాండు = సూర్యుని; చందంబునన్ = వలె; శిశువు = శిశువు; కున్ = కు; దశదిశలన్ = పది దిక్కులను {దశదిశలు - నాలుగు (4)దిక్కులు (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) నాలుగు (4) మూలలు (5ఈశాన్యము 6ఆగ్నేయము 7నైరృతి 8వాయవ్యము) 9పైన 10 కింద}; తన = తనయొక్క; చేతి = చేతి; అఖండిత = అఖండమైన; మహా = మిక్కిలి పెద్దదైన; ఉల్కా = ఉల్కతో; సన్నిభంబు = సమానమైనట్టిది; ఐన = అయినట్టి; గదాదండంబున్ = గదాదండము; మండల = గుండ్రని; ఆకారంబుగన్ = ఆకారముగా; జిఱజిఱన్ = మిక్కిలి వేగముగ; త్రిప్పి = తిప్పి; విప్రుని = బ్రాహ్మణుని; చిచ్చఱ = నిప్పులు చిమ్మే; అమ్ము = బాణముయొక్క; వేఁడిమిన్ = తాపముయొక్క; పోఁడిమిన్ = ఉద్రిక్తతను; చెఱచి = చెదరగొట్టి; డింభకుని = పిల్లవాని; పరితాప = పరితాపముయొక్క; విజృంభణంబు = చెలరేగుటను; నివారించి = అరికట్టి; గర్భంబున్ = గర్భమును; కందకుండన్ = కందిపోకుండగ; అర్భకుని = పసిబిడ్డ; కిన్ = కు; ఆనందంబున్ = ఆనందమును; కల్పించినన్ = కలుగజేయగా.

భావము:

ఈ విధంగా సాక్షాత్కరించి భక్తపరాధీనుడైన భగవానుడు భానుడు మంచును పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్కవంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశదిశలా గిరగిర త్రిప్పుతూ, సెగలు పొగలు గ్రక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు. కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి అపరిమితానందం కలిగించాడు.