ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు
- ఉపకరణాలు:
"నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.
టీకా:
నీ = నీయొక్క; పాద = పాదము అనే; అబ్జము = పద్మము; బ్రహ్మ = బ్రహ్మచేత; పూజ్యము = పూజింపదగినది; కదా = కదా; నీ = నీమీది; సేవ = భక్తి; సంసార = సంసారమందలి; సంతాప = బాధలను; ధ్వంసిని = నాశనముచేయగలది; ఔన్ = అవును; కదా = కదా; సకల = సమస్త; భద్ర = శుభముల; శ్రేణులన్ = పంక్తులను; ప్రీతి = ప్రేమ; తోన్ = తో; ఆపాదింతు = సంక్రమింప చేయుదువు; కదా = కదా; ప్రపన్నులు = ఆశ్రితులు; కున్ = కు; కాల = కాలమునకు; అధీశ = అధిపతీ; కాలంబు = కాలము; నిర్వ్యాపారంబు = ప్రవర్తనలు లేనిది; కదా = కదా; అయ్య = అయ్యా; చాలరు = సరిపోరు; నినున్ = నిన్ను; వర్ణింపన్ = వర్ణించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మొదలగువారును.
భావము:
“స్వామీ! నీ పాదపద్మాలు బ్రహ్మపూజ్యాలు; నీ చరణ సేవ సంతాపమయ మైన సంసార సముద్రాన్ని దాటించే నావ; నీవు ఆశ్రితులకు సకలసౌభాగ్యాలను సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి; కాలస్వరూపుడవు; కాలానికి అధీశ్వరుడవు; బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించ సమర్థులు కారు.