పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

యక్షగానములు : దౌవారికుని ప్రవేశము

కీర్తన
కళ్యాణి - ఆది

పల్లవి
వాసు దేవయని వెడలిన యీ దౌ - వారికునిఁ గనరే
అనుపల్లవి
వాసవాది సుర పూజితుఁడై - వారిజ నయనుని మదిని దలఁచుచును
చరణ (1):
నీరుకావి ధోవతులను గట్టి - నిటలమునను శ్రీచూర్ణముఁ బెట్టి
సారివెడలి యీ సభలోఁ జుట్టి - సారెకు బంగరు కోలనుఁ బట్టి
చరణ (2):
మాటి మాటికిని మీసము దువ్వి - మన్మథ రూపుఁడు తానని క్రొవ్వి
దాటి దాటి పడుచునుఁ దా నివ్వి - ధంబున బలుకుచు పకపక నవ్వి
చరణ (3):
బాగుమీఱ నటన సేయుచును - పతిత పావనునిఁ దా వేడుచును
రాగతాళ గతులనుఁ బాడుచును - త్యాగరాజ సన్నుతునిఁ బొగడుచును
వ.
ఇవ్విధంబున దౌవారికుండు వచ్చి యీ నాటక మొనరించు సూత్రధారునింగని, ఈ సభ యేమి, ఈ దివిటీల ప్రభలేమి, ఈ మృదంగాది వాద్యఘోషలేమి, ఈ సొగసైన వేషము లేమి, యీ నాటకంబునకుఁ బేరేమి, దీని ఫలమేమి, యీ నాటకం బాడుమని యెవరానతిచ్చిరో, యా వివరంబు నెఱింగింపు మనఁగా, ఆ సూత్రధారి యెఱిగించు మార్గం బెట్టులనిన.
ద్వి.
యతులకు సురలకు నెల్ల వారలకు
సతులకు సుతులకు సద్భక్తులకును॥
నటులకు విటులకు నాల్గు జాతులకుఁ
జటుల కఠోరులై చెలగు దైత్యులకు॥
విన్నను కన్నను వివరంబుగాను
పన్నుగా జనులెల్ల పఠియించిరేని॥
ఇహపరంబులు గడిగి యిలను వర్ధిల్ల
మహికి వేల్పులు వచ్చి మఱి ప్రోచునట్లు॥
ఎందులే నాపద లెంతవచ్చినను
బంధించి యబ్ధిలోఁ బడవైచెనేని॥
మందుకైనను వాని మదివెతలేక
యందరు కీర్తించి యాడుకొన్నట్లు॥
త్యాగరాజ కృతంబయి యిది వెలసె
బాగుగ ప్రహ్లాద భక్తివిజయంబు॥
నాటకంబుగ సభానాయకుల్‌ మమ్ము
నాట గావింపరేయని యానతీయ॥
చైత్రోత్సవంబునఁ జెలగుచు మేము
చిత్రంబుగా సేయఁగోరెదము॥
వ.
ఇవ్విధంబున పలికి సూత్రధారుండు దౌవారికునిఁ జూచి నీ వెచ్చటి వాఁడ విచ్చోట వచ్చిన విధంబేమి యెఱిగింపుమనగా, దౌవారికుం డెఱిగింప జేయు మార్గం బెట్టులనిన.
ద్వి.
ఈడు లేనటువంటి యీ పురంబునను
వైడూర్యమణులెల్ల వసుధపైఁ బరచి॥
పందిళ్ళు కిన్ఖాబుపట్టుతోవేసి
మందీలమేల్కట్టు మఱిబాగఁ గట్టి॥
పనస రంభాద్రాక్ష ఫలగుచ్ఛ మమరఁ
గనకంబుచే నలంకారముల్‌ చేసి॥
వరమైన సాంబ్రాణివత్తులు నిలిపి
సురవారసుతుల నీక్షోణి రప్పించి॥
ఘన నాట్యములనెల్లఁ గావింపుఁడనుచు
ఘనుఁ డాపగేశుఁ డాజ్ఞాపించినాఁడు॥
నెరయ సింగారముల్‌ నేనటు చేసి
యెఱిగింపబోయెద నిలవిభుకదకు॥
వ.
అని పలుకు దౌవారికుం గనుంగొని యిట్లు పురాలంకారంబు సేయుటకు గారణంబేమనఁగా దౌవారికుం డెఱింగింపజేయు మార్గం బెట్టు లనిన.