పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

యక్షగానములు : చతుర్థాంకము

వ.
అంతట బ్రహ్మానంద జలధిలో నోలలాడుచున్న ప్రహ్లాదునిఁ జూచి యతని చిత్తశుద్ధి లోకులకుఁ దెలియఁ జేయుటకై తలఁచి నిజ భక్తజన సంభాషణమందు నాసగలవాఁడై శ్రీమన్నారాయణమూర్తి పలుకున దెట్టులనిన.
శ్లో.
అరసికజన సంభాషణతో
రసికజనేషు వాక్కలహః శ్రేయః॥
క.
తలపున మోక్షదుఁడగుచును
వెలుపటి కా శుద్ధిగలిగి వేడుకగాగన్‌
తెలియని లోకులకెల్లను
జెలరేగుచు వాదులాడఁ జక్రియు దలఁచెన్‌.
వ.
శ్రీహరి ప్రహ్లాదునిఁ జూచి పలుకు వాక్యం బెట్టులనిన.
ఉ.
ఎప్పుడు పూర్ణకామి సుఖి హెచ్చుగ వేల్పుల కాదిమూలమై
చెప్పతరంబుగాదు తన చేతన జన్మములే మతజ్ఞులో
గొప్ప తపంబొనర్చుచును కోర్కెల నిమ్మన సంతసిల్లుచున్‌
తప్పక నిత్తు సంపదలు దానవ పుత్ర వరంబులందుకో.
వ.
ఈలాగున శ్రీమన్నారాయణుఁడు ప్రహ్లాదునిఁజూచి కామ్యవరము లందుకొమ్మనిన వార్తలు విని సహింపక యెదురు పలికినది యెట్టులనిన.
క.
ఆనాటి దాహమెల్లను
నేనార్చగ నిన్నుఁజూచి నేర్పునమదిలో
బానకపు పుల్లరీతిని
హీనంబగు వార్తఁబలుక నిది సమయంబా.
క.
సదయామర తరువునుఁ గని
ముదమునఁ బొక్కడుగఁ బోవు మూఢుఁడు గలఁడా
మొదలైన వేల్పు లెఱుఁగని
పదములఁగని విడువఁజాలఁ బదిమారులకున్‌.
వ.
ఇవ్విధంబున బలికి తిరుగ శ్రీహరినిఁ జూచి పలుకుటెట్టులనిన.
క.
స్వల్పము లడుగనుఁ జూచుట
కల్పాంతరమైన తృప్తిగాదయ మదిలోఁ
గల్పన చాలు బిలేశయ
తల్పామర వినుత! బ్రోవు తాళను నేనున్‌.

కీర్తన
శంకరాభరణము - త్రిపుట

పల్లవి
నన్నుబ్రోవకను - విడువనురా రామ
చరణ (1):
కాసును వెతుకగ గన్న రత్నమురీతి
దోసము తొలగింప దొరికితివికాని
చరణ (2):
అంబలిఁ దినువేళ నమృతమబ్బిన రీతి
తుంబురు సన్నుత దొరికితివికాని
చరణ (3):
చెయ్యలసినవేళ దెప్పదొరికినరీతి
నయ్యా నా పాలిటి కమరితివికాని
చరణ (4):
ఆడబోయిన తీర్థమెదురైనరీతి
నీడు జోడులేని యిష్టుడవైతివి
చరణ (5):
సిగ్గుపోవువేళ చీరలిచ్చినరీతి
నొగ్గి మాయింటికి వచ్చితివికాని
చరణ (6):
ఆగమ నిగమ చయార్థము నీవని
త్యాగరాజనుత తలచియున్నాను
వ.
ఈలాగునఁ బలికిన ప్రహ్లాదునిఁ జూచి దృఢభక్తిగల మనస్సును శోధించుటకై శ్రీహరి పలుకుటెట్టులనిన.
ఉ.
నాయెడ నాసగాని మది నాలుగు లోకములెల్ల సత్యమే
నీయెడఁ బ్రేమగొంటి నిది నిశ్చయమే ననుఁజూచి లబ్ధమే
మాయెను? ఏది యేదనగ మర్తులు లేదన నీవు నవ్వరా?
చాయగు కీర్తిగాదు మనసారగ నిత్తు వరంబులందుకో.
వ.
ఇవ్విధంబున ప్రహ్లాదుని మోహింప జేయుటకై శ్రీహరి తిరుగఁ బలుకునది యెట్టులనిన.
క.
ఎడలేని ప్రేమగొంటిని
కడు భక్తియు నీకుఁ గలదు కలదని తానే
యడియాసఁ జూపి భవమున
వడిగా మోహింపఁ జేయు వార్తలు పలికెన్‌.

కీర్తన
ఆరభి - చాపు

పల్లవి
అడుగు వరముల నిచ్చేను
అనుపల్లవి
అడుగడుగుకు నిన్నే దలచుకున్నాను - అద్భుతమైన భక్తికి సొక్కినాను
చరణ (1):
ధనకనకములు ఎన్నైన నీకు - దారపుత్రులు సొగసైన యిండ్ల
చనువున నొసగుదు సంశయమేల - తనువు చిక్కఁగనేల దానవబాల
చరణ (2):
అక్రమ దనుజులఁ గొట్టి నీ - యాపదలను తలమెట్టి
విక్రమమున బహు విఖ్యాతిగా విధి - శక్రాదుల పట్టముల నొసగెదు
చరణ (3):
వాజి గజాందోళికములు నీకు - వరమైన మణి భూషణములు
రాజిగ నొసఁగక రవ తాళలేను - వరత్యాగరాజాప్తుఁడ నేను

సనకాదయః ॥ మాయామోహకరీ ॥
(సనకాదులు "మాయామోహకరీ" అను కీర్తన పాడుదురు)

వ.
ఇటువలె వంచనగాఁ బలికిన ప్రపంచనాథుని పలుకులువిని సైరింపక ప్రహ్లాదస్వామి పలుకునది యెట్టులనిన.
క.
పామరులనుఁ బలుకుము మఱి
సామర్థ్యములెల్ల నీవు సాగరశయనా
నే మఱువను చరణంబులు
నా మనసుకు సొమ్మునీవు నళినదళాక్షా.
వ.
ఇటువలె బలికి తిరుగ శ్రీహరినిఁ జూచి పలికినది యెట్టులనిన.

కీర్తన
కేదారగౌళ - ఆది

పల్లవి
వారిజ నయన నీవాఁడను నేను - వారిజానన బ్రోవు
అనుపల్లవి
సారెకు మాయా సాగరమందు - నేరక మునిగే నేమము లేదు
చరణ (1):
ధనకనకములను దారపుత్రులఁ గై - కొని మఱవను రవితనయుఁడ గాను
చరణ (2):
వాజి రథములను వారము కైకొని - రాజులనడచు పార్థరాజు నే గాను
చరణ (3):
నీజపములు నవనిధులౌ త్యాగ - రాజవినుత యీ దురాశలఁ దగలను
క.
ఏపాటి భవసుఖంబులు
నీ పాద సరోజభక్తి నిజముగ నిమ్మా
కాపాడు నీదు భక్తుల
వ్యాపారము సేయలేక వేసారితివా?
వ.
ఇవ్విధంబున సకలమైన యైహికభోగాదులయందు నిస్పృహ భావంబున బలికి మఱియు
నాత్మజ్ఞానానందమయుండగు ప్రహ్లాదుండు శ్రీహరినిఁ జూచి పలుకుటెట్టులనిన.
క.
ఓపిక చేతను వెలిగెఁడి
యీ పంచాత్మకపుమేను నీలోకంబున్‌
ప్రాపనుకొనదే మది నీ
కాపట్యములెల్లఁ దెలిసి కదలను సుమ్మీ.

కీర్తన
దేవగాంధారి - ఆది

పల్లవి
తనలోనే ధ్యానించి తన్మయమె కావలెరా
అనుపల్లవి
తన గుహలోఁ దానుండె - తావునుఁ దెలియఁగవలెరా
చరణ (1):
నీ మర్మ మాక్షణమే - నిశ్చయమై తెలుసునురా
చరణ (2):
ఏనను మాయావేళ - నేవంకో తెలియదురా
చరణ (3):
తొలికర్మమే బలము - తోయకూడదు విధికి
చరణ (4):
ప్రకృతి స్వభావములు - ప్రజ్వలించుచు నుండు
చరణ (5):
లక్ష్యముచేయరు మదిలో - లక్షాంతరములకైనా
చరణ (6):
మ్రింగిన కళ్ళను రుచుల - మేలుగనేవారెవరు
చరణ (7):
భూతములైదును నీవు - పొరలచేయుచున్నావు
చరణ (8):
నిరవధి శయ్యపై నీవు - నిత్యానందమున నున్నావు
చరణ (9):
శ్రీత్యాగరాజుని చేపట్టి రక్షించేవు
వ.
ఇవ్విధంబున బ్రహ్మజ్ఞాన నిష్ఠుడై పలికిన ప్రహ్లాదునిఁ జూచి
పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణమూర్తి పలుకునది యెట్టులనిన.
సీ.
మాయల దేహాభిమానంబుల జయించి
వర్ధిల్లునట్టి నీవంటివాని
గని యభీష్టములిచ్చి కరుణతో భువి
చక్రవర్తిగాఁ జేసి నే వరములిత్తు
స్వల్పమైనట్టి యాస్వర్గ భోగములకై
భువిలోన జపతపంబుల నొనర్చు
కామార్థులకు నేను కలనైనఁ గాని కన్ప
డను పామరులకేపాటి వినుము

బాల సతతంబు నీ రాజ్య పాలనంబు
సల్పగాఁ జూచితే గాని శమముగాదు
కొమ్ము నీ హృద్గతంబైన కోర్కెలెల్ల
స్వస్థచిత్తుండవై యుండు స్వపురమందు.
వ.
జగదీశ్వరుండు తిరుగ బలుకునది యెట్టులనిన.
ద్వి.
భవసుఖంబుల కాసపడుచు నీ ధరను
అల జపధ్యాన పూజాది కర్మముల॥
నొనరించుచును నగ్నినొక కాలనిలచి
ఘనవేషములఁ దాల్చి గాసందు జనుల॥
గన నాస గొనదయ్య కడుభూతమైన
తనకు వారికి మంచితనమదెన్నటికి॥
నిర్మలచిత్తులై నిఖిలజ్ఞులైన
ధర్మకర్మాదులఁ దప్పి లయించి॥
దేహాశ వీడి విదేహులైనట్టి
సోహంబనుచు మదిసొంపు మీరంగ॥
ప్రజలు తానీవంటి బ్రహ్మనిష్ఠులకు
దెబగుబలుగ గడిదేరి యెదురౌచు॥
వలసి యొల్లని వరము వరుసగా నొసఁగి
యిలను దైత్యులఁబట్టి యిపుడు నేఁ దునిమి॥
యెల్లకాలము భూమినేలగాఁ జేతుఁ
గొల్లగా వరముఁ జేకొనుము ప్రహ్లాద॥
వ.
ఈలాగున తన దయకుఁ బాత్రుఁడని యెంచక నిర్దయుని వలెనే పలికిన శ్రీహరినిఁ జూచి ప్రహ్లాదుఁడు అత్యంత దీనుఁడై యానంద బాష్పధారాసిక్త కపోలుండై పలుకునది యెట్టులనిన.
క.
దీనార్తి భంజనుండని
యానాడే కీర్తినీకు హెచ్చెను కనవే
నీ నోము సేయువాఁడని
శ్రీనాయక నాదుపైనఁ జింతయు లేదే.
వ.
ప్రహ్లాదస్వామి తిరుగఁ బలుకున దెట్టులనిన.
క.
కద్దని నమ్మిన భక్తులఁ
బద్దునఁగని నీదుమనసు పాకంబగునే
సద్దయుఁడ వైతివైనను
చద్దన్నపు మీదివెన్న చందమునగునే.
క.
వంచన సేయకు నాయెడఁ
గొంచెతనంబదియు నీకు కోదండధరా
మంచిది నీ నడతలు వ
ర్ణించెద నిను నిర్మలాత్మ నీరజనయనా.
వ.
ఈలాగున శ్రీహరి గుణానుభవంబులను ప్రహ్లాదుండు వర్ణించునది యెట్టులనిన.

కీర్తన
నాగగాంధారి - చాపు

పల్లవి
ఓరామ రామ సర్వోన్నత నీకిపు - డోరవంచన యేలరా ఘృణాకర
చరణ (1):
వేదశిరములెల్ల నాదరణతో నీ - వే దైవమని నమ్మితి మేనమ్మితి
చరణ (2):
పెద్దలైన వారి యొద్దనే సత్యము కద్దని నమ్మితిని సమ్మతిని
చరణ (3):
బంధురత్నమా దయా - సింధువీవని సత్యరత్నమ వనుకొంటిని రమ్మంటిని
చరణ (4):
భరతుచర్య సహచరునితో నిండారఁ - గరఁగుచుఁ బలికితివే కాచితివే
చరణ (5):
సతిమాటలుసదా కపిజుచే విని స -మ్మతిని గౌగిలించిన శుభానన
చరణ (6):
వరభక్తకోటులు కొనియాడ నీవు - వారల బ్రోచినది లేదా మరియాద
చరణ (7):
ఈ జగతిని ప్రహ్లాదుని బ్రోచుట - కీ జాలమిక తాళ నీవేళను
వ.
ఇవ్విధంబునఁ గనులు కలంగగ నంతరంగము కరంగగఁ బలికిన ప్రహ్లాదునిఁ
జూచి కపటపు చిరునవ్వెలయ శ్రీహరి పలుకున దెట్టులనిన.
చ.
కపటపునవ్వుగాగఁ జిఱకాలము లింద్రియ నిగ్రహంబుచేఁ
దపమొనరించువారలకుఁ దప్పవు భోగము లింద్రసౌఖ్యముల్‌
అపరిమితాపదల్‌ మదిని నార్చుచు ధైర్యముసేయు నీదుపై
కృపగల వాఁడనైతి బహు కీర్తిగ సంపదలీక తీరునే.
వ.
తిరుగ శ్రీహరి కపట వాక్యములు పలుకున దెట్లనిన.
క.
నీకొక మర్మము దెలిపెద
లోకుల కరుదైన నిధుల లోకువసేతున్‌
చేకొనుము చనెద దూరము
నాకోర్కెలు నాదుపనులు నానావిధముల్‌.
వ.
ఈలాగున నెడబాయఁదలచి పలికిన శ్రీహరి వాక్యములను వినఁగనే
ప్రహ్లాదుండతి వ్యసనాక్రాంతుఁడై పలుకున దెట్టులనిన.
క.
చనవలెనను వార్తనువిని
కనులను బాష్పములురాలఁ గడు దుఃఖముతో
వనరుహనయనునిఁ జూచుచు
దనుజార్భకుఁ డడలుకొన్న తరి యెట్లన్నన్‌.
ద్వి.
ఏ యాలి సుతులకై యెవరిపైకాలకు
నాయాసమగు తపంబమరఁజేసితిని॥
ఏ శత్రువర్గాలకే రాజ్యములుగోరి
యాసించి నే తపంబమరఁజేసితిని॥
ఏ దేవతలగోరి యేజలంబులలోన
ప్రాదేశకుక్షియై ప్రార్థించుకొంటి॥
ఏ యాపదలను నేనెఱిగి తాళితిని
మాయావిలాస నామది నెఱుగలేవ॥
నిను సుఖదుఃఖముల్‌ విశ్వమంతయును
నిను వినాయెవ్వరే నిఖిలభావజ్ఞ॥
న్యాయమా నీకు నన్యాపదేశముగఁ
బాయనెంచుచు మాటఁ బల్కితివిపుడు॥
తాళదు యీమాట తాళదే మనసు
వేళగాదిది వేదవేద్య మ్రొక్కెదను॥
క.
ఎడబాయఁ దలచినావిక
విడువను నాతండ్రి నిన్ను వేమరుమదిలో
జడియక నీపదయుగముల
దడసేయక కట్టివేతు దాళను నేనున్‌.

కీర్తన
మధ్యమావతి - ఆది

పల్లవి
శ్రీరామ జయరామ - శృంగారరామ
చరణ (1):
గారవమున బ్రోవు - కరుణాసముద్ర
చరణ (2):
నాలోని జాలి నీ - కేల తోచదురా
చరణ (3):
మనసిచ్చినాతోను - మాటాడేదెపుడు
చరణ (4):
తాల నీవేళ నిక - తాళమారామ
చరణ (5):
బలిమిని వలచితే - చలమా ఓరామ
చరణ (6):
ఈసౌఖ్య మీభాగ్య - మెందైనఁ గలదా
చరణ (7):
జపమేమొ తపమేమొ - యపరాధమేమో
చరణ (8):
పంకజనయనా నా - కుంకుమ నీవే
చరణ (9):
అవనిజాధిప నాసొగ - సెవరిదె రామ
చరణ (10):
నీవు నిమిషములేని - భావుకమేలే
చరణ (11):
తోషింపకెన్నాళ్లు - తోచునేరామ
చరణ (12):
ఎల్లసౌఖ్యములు - మనసొల్లదేరామ
చరణ (13):
పాయగా మేను సగమాయె నోరామ
చరణ (14):
ఈయంద మీచంద మెందైన గలదా
చరణ (15):
కూర్చు వెతలార్చు కడ - తేర్చవే రామ
చరణ (16):
మిక్కిలి మ్రొక్కి చేఁజిక్కితి రామ
చరణ (17):
రాజిల్లు శ్రీత్యాగరాజాది వినుత
వ.
అంతట ప్రహ్లాదస్వామి తనలోఁ దానే స్వరూపమెఱింగి యపరోక్ష సాక్షాత్కారమైనందున నజ్ఞాన జనితమైన జాలినిఁక జెందనేల అని ధైర్యానందజలధిలో నీదుచు బలుకున దెట్టులనిన.
క.
ఇంతటి భాగ్యముఁ గల్గగ
జింతల చేఁజిక్కనేల శ్రీహరియనుచున్‌
అంతఃకరణంబున జగ
మంతయు హరిమయమటంచు నమరగఁ బలికెన్‌.
సీ.
వెన్నయుండగ నేతి వెసనంబుపడనేల
అన్నముండగఁ జొన్నయంబలేల
తల్లి గల్గు సుతకు దాది వెసనమేలఁ
దన్నుఁ దాఁ దెలిసిన తత్త్వమేల
వ్యాధిహీనునకును వైద్యుని చెలిమేల
స్వధనంబులుండఁ బంచాంగమేల
నన్ని నీవనువాని కమరభేదంబేల
ధీరునకొక వైరి దిగులదేల

నాదు భావంబు నీవెంచి నన్నుఁ బ్రోవు
మన్యమైన సహింపలే నప్రమేయ
నీవు నా యొద్ద నుండుటే నిండు సుఖము క్ష్మాసుతాధీశ నీ కటాక్షంబె చాలు.

కీర్తన
బిలహరి - చాపు

పల్లవి
సరసీరుహనయన నీ కటాక్షమే చాలు సజ్జన జీవన
చరణ (1):
మీన మర్భకుల కామించి కన్నట్లు - దానమీలంకను దయజూచినట్లు
చరణ (2):
సాధుసంగతి నేను సలిపినయట్ల - మాధుర్య భోజనము చేసినట్ల
చరణ (3):
ధనకనకములెల్ల దగిలినయట్ల - దినము దురాశలు దీరినయట్ల
చరణ (4):
సింహాసనంబునఁ జెలగిన యట్ల - బ్రహ్మేంద్రపట్టానుభవ మందినట్ల
చరణ (5):
నాల్గొక్కపది భువనము లేలినట్ల - కల్గుకులములెల్లఁ గడతేరినట్ల
చరణ (6):
రాజీవభవనుత రమణీయచరిత - రాజిల్లు శ్రీత్యాగరాజాదివినుత
వ.
ఇవ్విధంబున నతి ధైర్యభక్తి గల పలుకులు పలికిన ప్రహ్లాదునిఁ జూచి అత్యంత దయతో నతని నిజభక్తిమార్గము లోకులకెల్లఁ దెలియుటకై శ్రీహరి పలుకున దెట్టులనిన.
క.
నీ వద్దను నేనుండగ
నీవలనను చేయుటేమి నిర్మలచిత్తా
భారము నాతోఁ దెల్పుము
కావలసిన కోర్కెలొసఁగి కాపాడెదఁగా
వ.
ఇటువలె సాదరుండై పలికిన శ్రీమన్నారాయణమూర్తినిఁ జూచి అత్యంత సంతోషంబున నానందాశ్రు పరిపూరిత లోచనుండై గద్గద కంఠుండగుచు ప్రహ్లాదమూర్తి పలుకు టెట్టులనిన.
క.
ఎన్నిన నా కోర్కెలు విను
పన్నుగ నే సొమ్మువెట్టి పరిమళములచే
మిన్నైన మేన నలదుచు
కన్నుల నేఁ జూచి చూచి కాలము గడుతున్‌.

కీర్తన
వరాళి - చాపు

పల్లవి
వద్దనుండేదే బహుమేలు వారిజాక్ష
అనుపల్లవి
అద్దంపు మోముగల రంగ - అనుపమ మోహనాంగ
చరణ (1):
బంగారు పూలఁ బూజింతు - బాగుగ నిన్ను సేవింతు
శృంగారించి కౌగలింతు - చిరకాల మారాధింతు
చరణ (2):
ముంగల నే నటియింతు - ముద్దుమాటలఁ దేలింతు
సంగీతము వినిపింతు - సారెకునే సంతోషింతు
చరణ (3):
సత్తమాత్రమా నీయందు - చిత్తముగాని పోదెందు
తత్తరముఁ దీర్చుకొందు - త్యాగరాజ సులభుడందు
వ.
ఇవ్విధంబునఁ బలికిన పలుకులు విని శ్రీహరి ప్రహ్లాదుని నిజభక్తిగల హృదయ మర్మంబు దెలియ బలుకున దెట్టులనిన.
క.
అంకమొసంగితి నాసుర
శంకల వధియింతునంటి సంపదలొసగే
నింకన్‌ నా దయయెట్లో
సంకేతము దెల్పు రాత్రిచరవర తనయా.
వ.
ఈలాగున బలికిన శ్రీహరిని గనుంగొని ప్రహ్లాదస్వామి తన హృదయ గతమగు సంకేత మెఱింగించు మార్గ మెట్టులనిన.
క.
తీర దలంకారించక తీరదు
నుతియింపలేక దివ్యాన్నంబుల్‌
తీరదు తినిపింపక నే
తీరదు నీకింక ప్రొద్దు దీనాధారా.

కీర్తన
సావేరి - జంపె

పల్లవి
తీరునా నాలోని దుగ్ధ
అనుపల్లవి
సారమౌ నీపాద సారసము
నాదు హృదయార విందము బెట్టి కట్టుకోక
చరణ (1):
కమ్మవిల్తునిఁ గన్న - కాంతి గలిగిన హరే
ముమ్మారు పాలన్నము - భుజియింపఁ బెట్టి
కమ్మని విడెంబొసఁగి - కడు రత్నములు మెఱయు
తమ్మ పుటికనుఁ బట్టి - తానిపుడు నిలువకను
చరణ (2):
అనుదినము నీదు పాదాబ్జముల నొత్తుచును
కనకమయమౌ సురటి కరమునిడి విసరి
ఘనమైన ఫణితల్పమున నుంచి పాడుచును
కనులార సేవించి కాలములఁ గడపకను
చరణ (3):
రాజాధిరాజ సురరాజ వందిత పాద
శ్రీ జానకీరమణ శృంగార జలధే
రాజ వరుఁడగు త్యాగరాజ పూజితుఁడనుచు
రాజిల్లు నీకీర్తి రాజిగాఁ బొగడకను
వ.
ఇవ్విధంబున ప్రహ్లాదుండు తన నిజహృదయ మర్మంబు దెలిపి మఱియు శ్రీహరినిఁ జూచి పల్కునది యెట్టులనిన.
ఉ.
పున్నమనాటి చందురునిఁబోలు ముఖంబునుఁ జూచి చూచి యో
పన్నగశాయి యో దనుజభంజన నన్ను యెడబాయకంచు దాఁ
బన్నుగ వేడుకొంచు నిజ భక్తిని నిమ్మని జాలిజెందుచున్‌
కన్నుల నీరుతో నసుర కాంతజుఁడా హరి సేవసేయగాన్‌.
వ.
ఇటువలెఁ బలికి యూరకున్న ప్రహ్లాదుని జూచి శ్రీహరి పలుకున దెట్టులనిన.
క.
ముందటి భక్తుఁడు నీవని
ముందరనే ఖ్యాతిగాను మోదముతోడన్‌
అందరు బల్కగఁ జేసితి
నిందున నీకన్న భక్తులెవ్వరుఁ గలరే.
వ.
ఇవ్విధంబునఁ బలికిన శ్రీమన్నారాయణునిఁ జూచి సమయమనుచుఁ దెలిసి పలుకున దెట్టులనిన.
క.
స్వర్ణమయాంబర శ్రీకర
వర్ణాభయహస్త మత్తవారణశరణా
కర్ణింపుము నామనవి సు
పర్ణునివలె భక్తినిమ్ము పదిమారులకున్‌.
వ.
ఇటువలె వైనతేయునివలెఁ బరిచార భక్తినిమ్మనిన ప్రహ్లాదునిఁ జూచి శ్రీమన్నారాయణుండు పలుకున దెట్టులనిన.
క.
అజశక్రాదు లెఱుంగని
నిజ భజన పథంబు దెలిసి నిశ్చయమనుచున్‌
గజవరదుఁడు యోచించి స
హజమున ప్రహ్లాదుఁజూచి యమరగఁ బలికెన్‌.
సీ.
సరిసమానము నిను సల్పంగఁ బూనిన
బరిచారకముసేయు బ్రతుకదేల
నేర్పైన దృఢభక్తి నేనెఱుంగలేక
యెన్నగా నీ నిజం బెందు లేదు
నలువక్రిందుకైన నాదివ్యరూపంబుఁ
గన దూరమైయుండుగాని ధరను
నీ స్నేహరజ్జుచే నిండారఁ దగిలి నే
నీకు వశ్యుఁడనైతి నిర్మలాత్మ

సత్వగుణభక్తికిపుడు నే సాక్షిగాద
నీకుఁ బలుమారు నడుగంగ నీతిగాదు
యన్యమైనట్టి యధికార మడుగవయ్య
ఖ్యాతిమీరంగ నొసగెదఁ బ్రీతితోడ

సనకాదయః ॥రాజన్‌పతి గురురయం॥
(సనకాదులు "రాజన్‌పతి గురురయం" అను కీర్తనము పాడుదురు)

వ.
ఈలాగున పలికిన శ్రీమన్నారాయణునిఁ జూచి ప్రహ్లాదుండు పలుకున దెట్టులనిన.
క.
ధర్మార్థ కామమోక్షము
భర్మాంబర తనకుఁ గలుగు భక్తియువలెనే
శర్మంబులెల్ల దొరుకును
నిర్మలమగు భక్తినిమ్ము నిన్నే కొలుతున్‌.
శ్లో.
నాస్థాధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్‌ పూర్వకర్మానురూపం
ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంభోరుహ యుగగతా నిశ్చలాభక్తిరస్తు॥
వ.
తిరుగ ప్రహ్లాదస్వామి పలుకున దెట్టులనిన.
క.
తెగనాడు మాటలెందుకు
నగధర సరివారిలోన నగుబాటుగదా
వగలెల్లఁ జూపి నాయెడఁ
బగసేయుట కేమిఫలము భక్తాధీనా.
క.
నాలోని జాలిఁదెలిసియు
నీలాగు బరీక్ష సేయనేలా మేలా
చాలా ధర్మము గాదికఁ
బాలించుర వేగ నన్ను భావజజనకా.
వ.
ఈలాగున ప్రహ్లాదుండు అత్యంతజాలిచే శ్రీహరినిఁ జూచి మఱియు బలుకున దెట్టులనిన.

కీర్తన
సావేరి - ఆది

పల్లవి
రామాభిరామ రఘురామ ఓరామ
అనుపల్లవి
తామసంబేల సీతా మనోరమణ
చరణ (1):
పగసేయుటెల్ల నాపాలా నీదు - వగలేల విడఁజాలవు గజేంద్రపాలా
చరణ (2):
నీసొమ్ము నేనడుగలేదు నిండు - మోసమౌ ప్రపంచ మందాసలేదు
చరణ (3):
ఆసనీయెడఁ దనకుఁ బోదు నిజ - దాసరక్షక నినువినా గతియులేదు
చరణ (4):
నీ సరిసమాన మెవరిలలో రామ - నీరజదళాక్ష చిక్కితిరా నీవలలో
చరణ (5):
శ్రీపతే నను మరువఁదగునా యిది - పాపమేగాని యెడబాయ మనసగునా
చరణ (6):
ఆజానుబాహు కరమీరా శ్రీత్యాగరాజుని భవాబ్ధి దాటించి వరమీరా
వ.
ఇవ్విధంబునఁ బలికిన ప్రహ్లాదునియొక్క యాంతర భక్తిమార్గమునుఁ దెలియుటకై శ్రీహరి పలుకునది యెట్టులనిన.
క.
గౌరవమని లాఘవమని
సారెకు భావించునడత సమ్మతి గాగన్‌
వారము సమమై నడిచెను
వారిని నే నెఱుగజాల వసుధాస్థలిలోన్‌
క.
ఆ భారతీశుకైన స
దా భేదపు బుద్ధియొల్ల దత్యనుభావం
బే భక్తి చిత్తయుతమౌ
నా భక్తికి కట్టుపడుదు నతఁడే నేనున్‌.
వ.
ఇవ్విధంబునఁ బలికిన శ్రీహరినిఁ జూచి ప్రహ్లాదుండు తన యంతరానుభవంబుఁ దెలియఁజేయున దెట్టులనిన.
క.
అందరిలోపల నీపై
నందార్చిత నాదుమనసు నళినదళాక్షా
ముందు నెఱుంగగ లేదా
సుందర లోకోపకార సుద్దులు గాకన్‌.

కీర్తన
మోహన - ఆది

పల్లవి
దయరానీ దయరానీ - దాశరథే రామ
చరణ (1):
వివరింప దరమా రఘు - వీరానందమున రామ
చరణ (2):
తలచితే మేనెల్లఁ - బులకరించీని రామ
చరణ (3):
కనుగొన నానందమై - కన్నీరు నిండీని రామ
చరణ (4):
చరణ కౌగిలివేళ - జెలగి మైమఱచీని రామ
చరణ (5):
చెంతనుండగా నాదు - చింతలు తొలగీని రామ
చరణ (6):
ఆసించువేళ జగమెల్ల - తృణమయ్యీని రామ
శ్రీత్యాగరాజుని - చెలికాఁడు నీవే రామ

సనకాదయః ॥పథి పథికము॥
(సనకాదులు "పథి పథికము" అను కీర్తనము పాడుదురు)

వ.
ఈలాగున స్వానుభవంబు తెలిపిన ప్రహ్లాదునిఁ జూచి యంతరాంతర మర్మములు దెలియ వలయుటకై శ్రీహరి పలుకున దెట్టులనిన.
ద్వి.
పంతంబు సాధింపఁ బల్కెదుగాని
యంతకు నే పాత్రుఁడని యెంచవలదు॥
వెన్నవంటి మనసు విశ్వాత్మకుండు
అన్న నీవెఱుఁగవా యసురేశతనయ॥
అబ్బబ్బ నీయొక్క యంతరంగమును
గొబ్బునఁ దెలియంగఁ గూడలేదికను॥
బాలక నీలోని భావమిట్లనుచు
నీలోకులకు నీవె యెఱింగింపు మిపుడు॥
వ.
ఈలాగున శ్రీమన్నారాయణుఁ డనగా విని యిక తీరదని ప్రహ్లాదుండు
తన మనోభావంబు నెఱిగింపఁజేయు మార్గం బెట్టులనిన.
ద్వి.
సారెసారెకు నామనోరథంబులను
నీరజలోచన నిజముగా వినుము॥
పంకజములకెల్ల భానుచందమున
నింకనుఁ గలువల కిందు చందమున॥
మాన్యయౌ మగువకు మగని చందమున
దీనజనావన దేవదేవేశ॥
తనకు నీవటుగాద ధరణీసుతారమణ
మనసిజలావణ్య మంజులవదన॥
వలచుచు నేనొక్క వరమడిగెదయ్య
సలలిత గుణబృంద సాధుహృత్సదన॥
పరమపావన రామ పాపౌఘశమన
కరుణను దయచేసి కావవే కృష్ణ॥

కీర్తన
యదుకులకాంభోజి - ఆది

పల్లవి
దయసేయవయ్యా స - దయ రామచంద్ర
అనుపల్లవి
దయను కొంచెమైన నాఁడు - తలచుచున్న సీతాసుఖము
చరణ (1):
క్షితినాథుల రాకయు స - మ్మతిలేక శ్రీసాకేత
పతి రాడేయన వచ్చునంటె - సతికి గల్గినానందము
చరణ (2):
చెలియరో నావలె నాథునకు - గలరేమో రాలేదని జాలిఁ
దెలిసి మ్రొక్కుకోఁ బోవువేళ - బలిమిని నెదురైన సుఖము
చరణ (3):
కొంచమీ రూపమా విల్లు - వంచకూడకపోనో యని
ఎంచి జాలిఁజెంద మేను - బెంచి కనిపించినట్ల
చరణ (4):
ఎట్టివారికైన దొరక - నట్టి జనకజను బొట్టు
గట్టి కరముఁ బట్టువేళ - కాంతకున్న సుఖము తనకు
చరణ (5):
కోరిన వారలను నే - నీరీతి బ్రోతునని సభ
వారలకు దెలియఁజేయు - దారి త్యాగరాజునకు
వ.
ఈలాగున సీతాభక్తి నిమ్మనుచు ప్రహ్లాదుడు శ్రీహరినిఁ జూచి తనమదిలో నీశ్వరుండు మానాభిమానంబులు లేని పరవస్తువని తెలిసి శపథంబు చేయునది ఎట్టులనిన.

క.
వేడెద, మ్రొక్కెద, ననుఁదెగ
నాడక శపథంబు వినుము నారదగురుఁడా
నాఁ డుపదేశించినదే
పోడిమిగా సత్యమైనఁ బోరాడకురా.
వ.
ఈలాగునఁ బలుకుచు తిరుగ ప్రహ్లాదుండు
క.
తల్లినిఁగను పుత్రునివలె
నుల్లం బానందమంది యోహోయనుచున్‌
ఝల్లను తనతో హరిపద
పల్లవముల వ్రాల హరియు బాహునఁ బట్టెన్‌.

సనకాదయః ॥భవాబ్ధిమంతి॥
(సనకాదులు "భవాబ్ధిమంతి" అను కీర్తనము పాడుదురు)

వ.
ఇవ్విధంబునఁ బాదాక్రాంతుఁడైన పరమభాగవతాగ్రేసరుండును, భక్తవారిధి చంద్రుండునుఁ, బరవశుండునునగు ప్రహ్లాదునిఁ జూచి శ్రీమన్నారాయణమూర్తి యేమి చేయుచున్నాఁడనిన.
క.
పంకజ నేత్రుఁడు భక్తవ
శంకరుఁ డాద్యంతరహిత శాంతాకారుం
డంకమున నుంచి ప్రేమనుఁ
గంకణములు ఘల్లనంగఁ గౌగిటఁజేర్చెన్‌.

సనకాదయః (సనకాదులు)

శ్లో.
యది హాస్య ప్రియాఖ్యాతః నకుర్మి సదృశం ప్రియం
ఏష సర్వస్వ భూతస్తు పరిష్వంగో హనూమతః॥
వ.
అంతట శ్రీహరి ప్రహ్లాదు నుపలక్షించి పలుకున దెట్టులనిన.
క.
జ్ఞానము వైరాగ్యము వి
జ్ఞానము సద్భక్తి సమముగాగ భవుని నే
గానను ముల్లోకములన్‌
మాన్యుని నినుఁగంటి నీ సమానంబెవరే.
ద్వి.
వినవోయి ప్రహ్లాద విమలాంతరంగ
వినఁగోరి నీ పల్కు వివరంబుగాగ॥
చలమున వాదంబు సల్పితి విపుడు
సలలితమతినైతి సంతోషినైతి॥
నీకోర్కు లెల్లను నిజముగఁ గల్గు
నేఁ గోరు పనులెల్ల నెరవేరె నిపుడు॥
సుఖమున వర్ధిల్లు సురవైరి తనయ
అఖిలాండములనేలు మాచంద్రసూర్య॥
స్థాయిగా విలసిల్లు సానందముగను
హాయిగానుండు నీవారోగ్యమునను॥
వ.
ఇటువలె తన స్వాభీష్టముల నొసంగిన భక్తపరాధీనునిఁ, బరమ పురుషుని, చరాచరరూపుని, శంఖచక్రాంకితాజాను చతుర్బాహుని, పుండరీకాయతాక్షుని, పురాణపురుషుని, శరణాగతవత్సలుని, జగన్మోహనాకారుని, దివ్యతేజోమయుని, దివ్యపీతాంబర వనమాలాధరుని, ఆదిమధ్యాంత రహితుని, అఖిల జగత్పూజ్యుని, ఆత్మారాముఁడగు శ్రీమన్నారాయణమూర్తిని ప్రహ్లాదుండు షోడశోపచారములచేఁ బూజించుచు బ్రహ్మానంద పరవశుఁడై పలుకునది యెట్టులనిన.

కీర్తన
భైరవి - ఆది

పల్లవి
ఆనందమానందమాయెను బ్రహ్మానంద - నిత్యానంద సదానంద పర
చరణ (1):
శ్రీరామ నే ధన్యుఁడనైతిని ఆనంద - నీరధిలోన నీదనైతిని - రామ
సారెకు నీవాడని పేరును గాంచితి
చరణ (2):
ఆనాటి మొదలు నిన్ను వేడితి - దుష్టమానవుల చెలిమివీడితి - నా
మానమె నీదు భారమనుచునుఁ దలచితి
చరణ (3):
పాపములకు భయమందితి హృత్తాపములెల్ల చల్లచేసితి - రామ
నీ పాదమురమున - నుంచి ధ్యానించగ బ్ర
చరణ (4):
కలికి యాసలు రోసినాడను ఈ - కలికి బ్రతుకు నామసారము- ఇట్లు
పలికి పల్కి తొలఁగి పాయ విచారము
చరణ (5):
ఇలలో సుఖము లేమాయెను అంటె - కలఁగన్న భాగ్యపు చందమాయె - నిన్ను
కొలిచి ధ్యానించి తెలిసికొంటి నీ మాయను
చరణ (6):
నీయందమునుఁ గని సొక్కితి నెడ - బాయని ప్రేమచేతఁ జిక్కితి నా
ప్రాయము లెల్ల నీ - పాలిజేసి మ్రొక్కితి
చరణ (7):
నలువకైనను నింద్రుకైనను జంద్ర - కళను ధరించు వానికైనను రామ
తలఁచినదెల్లఁ జెప్పతరమా - నోటికి రాదు
చరణ (8):
అన్యముగాఁ జూడఁ దోచెనా కనుక - ధయ్న్యోహమని పల్క యోచనా మూ
ర్ధన్యులైన భక్తాను ధ్వాంత విరోచనా
చరణ (9):
రాజసగుణమును మానితి రామ - నీజపమును మదిఁ బూనితి త్యాగ
రాజు చేసిన పుణ్య - రాశియని యెంచితి
వ.
ఈలాగునఁ బరవశుండై పాడుచు మంగళముఁ బాడున దెట్టులనిన.

మంగళము
కీర్తన
ఘంటా - ఝంపె

పల్లవి
జయమంగళం నిత్యశుభమంగళం
చరణ (1):
కరుణారసాక్షాయ కామారి వినుతాయ - తరుణారుణాభ సుందరపదాయ
నిరుపమ శరీరాయ నిఖిలాగమచరాయ - సురవినుత చరితాయ సుందరాయ
చరణ (2):
కుందసుమ రదనాయ కుంభజ సుగేయాయ - మందరాగ ధరాయ మాధవాయ
కందర్ప జనకాయ కామిత సుఫలదాయ - బృందారకారాతి భీకరాయ
చరణ (3):
సర్వలోకసహితాయ సాకేత సదనాయ - నిర్వికారాయ మానిత గుణాయ
సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ - నిర్వాణఫలదాయ నిర్మలాయ

చతుర్థాంకము సమాప్తము.