పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : విశ్వకరు విశ్వదూరుని

కం||
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.
బాహ్య|| ప్రపంచ నిర్మాతయుఁ బ్రపంచమునకు దూరుఁడును, ప్రపంచమే శరీరముగాఁ గలవాఁడును, ప్రపంచముచేఁ దెనియఁబడువాఁడును, ప్రపంచమునకు విలక్షుణు డగు, శాశ్వతుఁడును, నజుఁడును, వ్యాపకుఁడును, ప్రభువును, నియమించువాఁడు నగు పరమ పురుషుని భజియించెద నని తాత్పర్యము.
రహ|| శ్లో|| యస్యైకాంశాదిత్థమ శేషం జగదేతత్ప్రాదుర్భూతం, యేనపినద్ధపునరిద్ధంయే నవ్యాప్తం, యేన విబుధం సుఖ దుఃఖైః తం సంసారధ్వాంత వినాశం హరిమీడే||
తా|| యే పరమాత్మ యొక్క యేకాంశముచే నీ జగత్తు ప్రాదుర్భవించినదో, యెవనిచే గట్టఁబడినదో, యెవనిచే వ్యాపింపఁబడినదో, సుఖ దుఃఖాదులుచే నెవఁడు తెలుసుకొనుచున్నాడో, యట్టి (సంసార చీఁకటిని నశింపఁజేయు) హరిని స్తుతించెద నని భావము.
విశ్వదూరుని - "తస్యకర్తారమపిమాం విద్ధ్య కర్తారమవ్యయం"నేను కర్తగాఁ గనుపడుచున్నను నకర్తను (దూరుని)గాఁ దెలిసికొనుము - అజు - పుట్టుకలేనివాని "అజోనిత్యశ్శాశ్వితోzయం పురాణః" అజుఁడు, నిత్యుఁడు, శాశ్వతుఁడు, అట్టి యవ్యక్తా తీతుని భజియింతు నని జీవ ప్రార్థన
వ|| అని పలికి తన మనంబున నగ్గజేంద్రుం డీశ్వర సన్నిధానంబుఁ గల్పించుకొని యిట్లనియె.
బాహ్య|| ఇట్లు ప్రార్ధించి యగ్గజేంద్రుఁడు మానసికంబుగా నీశ్వరునిఁగల్పించుకొని.
రహ|| ఇట్లు జీఁవుడు మానసికముగా బ్రహ్మాకార తేజస్సును గల్పించుకొని