పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఉపోద్ఘాతము

(సత)తంబు యత్నించి కష్టించుచుఁ దత్సంబంధుల వలన వంచితులయి దుఃఖించుచు మోక్షమార్గమునకుఁ గడు దూరగులై తమ తమ కర్మవిశేషంబున దేవదానవ నరమృగ పశుపక్షి క్రిమికాట కాది యోనులం బుట్టుచుఁ గిట్టుచుఁ జర్విత చర్వణముగాఁ దిరుగు కష్టజీవుల యందుఁ గనికర హృదయలై మహామహులైన పెద్ద లనేక చోట్ల దేవాలయములు నిలుపుటయే గాక, పురాణములు, భక్తుల యొక్క చారిత్రములు మొదలగునవి తగు దృష్టాంతములతో వర్ణించి రందు, సత్యము యొక్క మహిమను చూపించుటకై హరిశ్చంద్రుని యొక్క కథయు, భక్తుల యొక్క మహిమను చూపించుటకై ప్రహ్లాదుని యొక్క కథలును - సతీధర్మములు ప్రకటించుటకై సీతా సావిత్రీ మహిళామణుల యొక్క కథలును - పితృభక్తి యొక్కయు, బ్రహ్మచర్యము యొక్కయు మహిమలఁ దేటపఱచుటకై శ్రీరామ, భీష్ముల చరితములను - అతిధి సేవా మహిమను బోధించుటకై మయూరధ్వజుని చారిత్రము మొదలగునవి యెన్నిటినో, సమాధి - లౌకిక - పరకీయ భాషల యం దాయా సమయానుకూలములుగా ననేక రకముల రూపకముతో సరళములుగా నేరుపఱచి చిరస్మరణీయు లైరి. ఆ చరిత్రలఁ జదివియు నాలకించియు - నాయా పద్ధతులలోఁ దమ తమ కనుకూలములైన - ధర్మములను - శీలములను - గ్రహించి యాచరించి కొంతమంది ధన్యాత్ము లైరి. అట్టివారిలోఁ బరీక్షన్మహారా జొక్కఁ డతండు శమీక మహాముని తనూజుండగు శృంగి యనువాని వలన, శపింపబడి, శుకమహామునిచే నేడు దినంబులలో శ్రీమద్భాగవతం బాలించి తఱించె నట్టి భాగవతంబుననే, బుద్ధి యను జలంబులతో నిండి - సందేహము లను తరంగములతోను - నింద్రియార్థము లను బిసప్రసూనములతోడను గూడిన, మన స్సను సరస్సునందు, జీవుఁ డను గజేంద్రుఁడు దిగి, కామ మను మొసలిచే పట్టువడి, జన్మపరంపర లను నానావిధ దుఃఖము లనుభవించి, వ్యాపక చైతన్య స్వరూపుం డగు శ్రీ చక్రాయుధునిం బ్రార్థించిన, నా జనార్దనుం డంత జ్ఞాన మను చక్రముచే మొసలినిఁ ద్రుంచి త త్కుంజరాధిపతిని రక్షించె నెట్లనగా -

|| శ్లో||
అహంకారలతావిష్టం - కామః క్రోధదళాద్యుతం
ఇంద్రియార్థ భ్రమఃపుష్పం - సందేహతరగంతధా
బుద్ధిరూపజలోపేత - మగాధం తృష్ణసంజ్ఞితం
ఆశాకూల విశాలంచ - కంచిదస్తిసరోవరం
యస్యసంజ్ఞమనశ్చేతి - యస్మిన్ జీవోనగాహతి
అనపేక్ష్యతాని పుష్పాణి - తస్మిన్ స్నానం కరోతియః
తేనపత్రలతాస్పందం - నసంభవతి కుత్రచి
న్నాభిజాయత్యహంకారో - సజీవన్ముక్త ఉచ్యతే||
తాత్పర్యం|| అహంకార మను లతావృత మైనట్టియుఁ గామాది దలయుక్త మైనట్టియు - నింద్రియార్థము (విషయము) లను భ్రమజనక పుష్పంబులును, సంశయ తరంగములును, ధీ రూప జలంబునుఁ, దృష్ణ యను నగాధంబు (లోతు)ను, ఆశ యను కూలంబు (ఒడ్డు)ను, గలిగిన యొకానొక మనోనామక సరోవరము కలదు. త త్సరస్సు నందు జీవుఁడు ప్రత్యహము (ప్రతిదినము)ను స్నానముఁ జేయుచుండును - ఇంద్రియార్థ (శబ్దాది) పుష్పముల నపేక్షింపక "శరీరం కేవలం కర్మకుర్వ న్నాప్నోతి కిల్బిషమ్" శరీ రోపయోగ మాత్రముఁ గర్మఁ జేయుచున్నవాఁడు పాపమును పొందఁడు, అను గీతావచన ప్రకారము జీవన్ముక్తుఁ డని చెప్పబడుచున్నాడు -
అనగా నిమిత్తమాత్రమైనచో, నహంభావ మను లతయును విషయ సుమంబులను - స్పృశించక ప్రారబ్ధభోగమాత్రుం డైనవాఁడు జీవన్ముక్తుఁ డని యాశయము.
ఇట్లు శ్రుతి, స్మృతి, పురాణ, యుక్తిః యుక్త ప్రమాణములతోడను - అనుభవపూర్వక మైన యుపమానములతోడను - రహస్యార్థ, బాహ్యార్థములు వ్రాయబడినవి.