గజేంద్రమోక్షణ రహస్యార్థం : తనవెంటన్ సిరి
మ॥
తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
గరుత్మంతుఁడు మున్నగు వైకుంఠంబునం గలుగు వారాబాలగోపాలము (సంపూర్ణముగా) బైలుదేరి రని తా॥
రహ॥ - పురుషుని వెంటఁ బ్రకృతియు - దాని వెనుక శుద్ధసాత్విక మున్నగు పరాకాశంబు నందుండు కాంతలును జ్ఞాన పక్షీంద్రుఁడును - మఱియుఁ గౌమోదకీ యనగా " శ్రు॥ ప్రణవోధను శ్శరోహ్యాత్మా - బ్రహ్మ తలక్ష్యముచ్యతే తా॥ ఓం కారమే ధనస్సు (విల్లు) శుద్ధాత్మయే శరము - గావున నట్టి పరికరములును - నాబాలగోపాల మనగా దైవ సంపత్తి యగు సద్గుణ సమూహము - సమూలముగా వెడలె నని తాత్పర్యము.
వ॥ తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహపరిష్యంద నానంద దిందిరయగు నయ్యిందిరాదేవి గోవిందకరార విందసమాకృష్య మాణసంవ్యాన చేలాంచలయయిపోవుచు.
బాహ్య॥ - అనంతరము - నయ్యిందిరాదేవి ముఖపద్మము నందలి మకరంద పరిష్యంద - స్రవించుచున్న మకరంద పరిష్యంద - స్రవించుచున్న మకరంద రసాస్వాద నముచే నానందించుచున్న యిందిందిర (తుమ్మెద)లచే శోభాయితమై యొప్పి - గోవిందుని, కరపద్మముచే నా కర్షింపఁబడిన, సం వ్యాన - శరీరమంతటను వ్యాపించు పైటకొంగు గలదియై పోవుచు.
రహ॥ ఆ పరమాత్మతోఁగూడి ఛాయా పోల్కి నుండు ప్రకృతి యొక్క సహస్రార కమలము నందలి బ్రహ్మానందమను మకరందమును గ్రోలు జీవన్ముక్త, విదేహముక్తాది మధుపములచే నొప్పు ప్రకృతి యొక్క స్వరూపానంద చేలాంచలము నాకర్షింపంబడిపోవుచు.