పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : సిరికిం జెప్పఁడు

మ॥ 

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
రివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం న్నింపఁ" డాకర్ణికాం
ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాప్రోత్థితశ్రీకుచో
రిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
విష్ణుమూర్తి పరికరాదులు
బాహ్య॥ శ్రీమహావిష్ణువు, గజప్రాణ సంరక్షణోత్సాహసంరంభుఁడై - లక్ష్మితోఁ జెప్పనివాఁడై - శంఖచక్రములు చేతులం దొడుఁగక, నే పరివారమును బిలువఁక గరుత్మంతు నాయత్తము సేయక, కర్ణికాంతరములం బడు కేశముల నొత్తి చక్కఁజేయక, ప్రణయకలహ జనిత లక్ష్మీవక్షోరుహ చేలాంచలమునైన వీడక, బైలుదేరె నని తాత్పర్యము.
రహ॥ - ప్రకృతినిఁ దలంపఁడు సాంఖ్యయోగ సాధనముల గ్రహింపక - శమ దమాదులను బిలువఁక, దనయం దంతర్లయమందిన తమస్సును సర్దక, శ్రీకుచోపరిచేలాంచలమైన వీడక ననగా, బ్రకృతి యొక్క కుచయుగళము, జీవేశ్వరులు వాని యైక్యమును వీడక వెడలె నని తాత్పర్యము
వ॥ ఇట్లు భక్తజన పాలన పరాయణుండును - నిఖిల జంతు హృదయారవింద సదాయనుండును - అగు నారాయణుండు, కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి - సంభ్రమించి - దిశలు నిరీక్షించి - గజేంద్ర రక్షాపర్వతంబు నంగీకరించి నిజ పరికరంబుల మఱల నవధరించి - గగనంబున కుద్గమించి - వేంచేయు నపుడు.
బాహ్య॥ భక్తజనావన సక్తుండును - సకల హృదయాయనము (స్ధానము) గలవాఁడు నగు నారాయణుఁడు, గజదీనాలాపంబుల నాకర్ణించి లక్ష్మీవినోదక్రీడలఁ జాలించి స్వకీయ పరివారంబు మఱలఁ గైకొని గగనంబున కెగసివచ్చినపుడు ముందు కన్వయము,
రహ॥ - పరిపక్వశుద్ధ జీవుల నేకీభావ పరాయుఁడును - సకల జంతుహృత్పద్మ స్దానీయుండును - అగు నారాయణఁడు (శబ్దగమ్యుఁడు)
శ్లో॥ పాషాణలోహ మణిమృణ్మయ విగ్రహేషు పూజాపునర్జనన కరీము ముక్షోః
తస్మాద్యతి స్వహృదయార్చనమేవకుర్యాత్
తా॥ శిలాలోహమణి విగ్రహాది పూజలు జన్మల నొసంగును గాన హృదయము నందే పూజించవలెను - జీవుని దీనాలాపంబు లాలించి సాధన చతుష్ఠయ - జ్ఞానభూమికాది వలయు పరివారంబు సంగ్రహించి విహఁగ (శుక) మార్గమున వచ్చునపుడు -