గజేంద్రమోక్షణ రహస్యార్థం : సర్వాగమామ్నాయ జలధికి
సీ||
సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ;
మయునికి నుత్తమ మందిరునకు
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ;
దనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురు మానసునకు సం;
వర్తితకర్మనిర్వర్తితునకు
దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు;
లడఁచువానికి సమస్తాంతరాత్ముఁ
ఆ||
డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ
వంతునకుఁ దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.
బాహ్య|| సమస్త మంత్రశాస్త్ర జలధియును - మోక్షమును ప్రసిద్ధ నామకుఁడును, వైకుంఠమే యుత్తమ మగుమందిరము గలిగినట్టియు - సత్వర జస్తమగుణములను, యరణి (దారువు) చేఁ గప్పఁబడిన బోధాగ్ని కలవాడును - స్వప్రకాశమానుఁడును, గుణలయముచే స్వచ్ఛమై ప్రకాశించు పరాస్వరూపుఁడును - బ్రళయమందు నశింపఁజేసి సృష్టికాలమందుఁగర్మనిర్వర్తించు వాఁడును - దిక్కులేనినావంటి పశుప్రాయుల పాపంబు లడఁచు వాఁడునన - భూతాంత రాత్ముఁడై ప్రకాశించు వాఁడును, - నిరావరణుఁడును - దారాపుత్రాదులయఁదాసక్తులైనవారలకు విదూరుఁడు నగు వానికి వందనము లాచరింతునని తాత్పర్యము.
రహ|| సర్వాగమా మ్నాయ జలధికి " విధాత్రీ ధర్మాణాంత్వమసి - సకలామ్నాయ జననీ" హే తల్లీ!
సకలమంత్రశాస్త్రములకు జననివై యున్నా వనగా వేదములలో మధ్య భాగమైన మంత్రోపాసనా భాగము పరాప్రకృతియే యగుటచేఁ బర యనగాఁ బరమాత్మయే యగునుఁ ప్రకృతీపురుషుల కభేద మగుటచే నట్టి సహస్రకోటి మంత్రరూప జలధి యగు వాఁడును - నపవర్గ మనగా సృష్టిరహిత స్వరూపము - శ్రు|| ప్రపంచోయది విద్యేతనివర్తేత నసంశయః-" - మాయామాత్ర మిదం ద్వైత మద్వైతం పరమార్ధతః" - (వర్గ మనగా) సృష్టి - ప్రపంచము, నిజముగా సృష్టింపఁబడిన యెడల నివర్తింపక తప్పదీ ప్రపంచ మనగా ద్వైతము మాయా మాత్రమే కాని పరమార్ధమున నద్వైతమే యగును - కావున నట్టి యపవర్గమయి యుండు - నుత్తమ మందిరునకు - పృధివ్యాది యవ్యక్త పర్యంతము ననాత్మ యగుటచే నశ్వర మనియుఁ దత్పర మనశ్వర మనియుఁ జెప్పబడుటచే నుపాధిరహిత స్థితి యగు నుత్తమ (అవ్యక్తాతీత) మందిరముఁ గలవాఁడును - అనగా "శ్రు|| ఆత్మానమరణిం కృత్వా ప్రణలవంచోత్తరారణిం - ధ్యాననిర్మధ నాభ్యా సాత్పాశం దహతి పండితః" పండితుఁడు తన మనస్సును క్రింది యరణి -(అగ్ని జనక దారువును) ప్రణవమును, బైయరణి (దారుశకలము) చే మర్ధించిన, జ్ఞాన మను, వహ్ని జనితమై మోహ పాశమును దహింపఁజేయుచున్నాడు - కావున నట్టి బోధాగ్ని స్వరూపుఁడును - తనయంత రాజిల్లు ధన్యమతికి - స్వయంప్రకాశమానుఁడును - "సోzక్షరః పరమ స్వరాట్" గుణములు లయించినఁ బరిధూయిత (ఎగరఁగొట్టిఁన) ధూమాగ్నివలె నుద్దీపితుఁడును - బ్రళయము నందు గర్మ నశింపఁ జేయువాఁడును - యనవచ్ఛిన్నుఁ డనగాఁ - బుద్ధ్యాదులచే గప్పఁబడని వాఁడును - దారాపుత్రాదుల యందుఁ బ్రేమ గలుగు వారి కందరాని వా డనఁగా శ్లో|| సంసార పాశదృఢబంధ నిపీడితస్య - మోహాంధ కార భయకూప నిపాతితస్య - కామాభిలాష వివిధోరగ దంశితస్య - దీనస్య మేద యాంకురు కరుణైక పాత్ర" హే కరుణైకపాత్రా! దృఢ బంధక మగు దారాపుత్రాదిక
మను సంసారముచే బద్ధుఁడ నైనట్టియు, మోహమును నంధకార కూపంబునఁ గూలి నట్టియు గామాభిలాషములను వివిధ సర్పములచేఁ గరువఁబడి నట్టియు, దీనుఁడ నగు ననుఁ గరుణించుము (అనగా సంసారా సక్తుల కందరాని వాఁడని (వ్యంగ్యము) అట్టివానికి వందనము లొనర్తును, మఱియు...