పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : శాంతున కపవర్గ సౌఖ్య

సీ||
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;
నిర్వాణ భర్తకు నిర్విశేషు
కు; ఘోరునకు గూఢుకు గుణధర్మికి;
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
ఖిలేంద్రియద్రష్ట ధ్యక్షునకు బహు;
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి;
జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
ఆ||
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు నిష్కారణునకు న
స్కరింతు నన్ను నుచు కొఱకు.
బాహ్య|| శాంతమూర్తియు, సహజానందసంవేదియు, నిర్వాణ (మోక్ష) ప్రదాతయు, విశేష రహితుఁడును - ఘోరుఁ డనగా - శివస్వరూపుఁడును, గూఢుఁ డనగాఁ దహరాకాశము నందుండు వాడుఁను - గుణశీలుఁడును, - సర్వజ్ఞుఁడును, నింద్రియాతీతుఁడును - సమస్త క్షేత్రములను దెలియువాఁడును - దయాసింధువును - మూలప్రకృతి యనగా సృష్టిప్రారం భోపాదాన కారణఁడును - దనకుఁ దానే మూలమైన వాఁడును - నింద్రియ కృతక్రియలకు ద్రష్టయును మాయా (ప్రతిబింబ)యుతుఁ డైనను దానొక్కఁడే యై యుండు వాఁడును - సంసారోత్తారకుఁడును - బ్రపంచాధిష్ఠాన కారణుఁడును - బరిశీలించినచో నిష్కారణుఁడును నగు వాని కొఱకు నన్ను బ్రతికించుటకునై నమస్కరించుచున్నాను.
రహ|| శాంతున కనగా ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః అను ఆధ్యాత్మకాది శాంతి త్రయముచే నుపసంహరింపఁబడువాఁడు, - ఆధ్యాత్మిక దుఃఖము - తలపోటు, కడుపునొప్పి, మున్నగునవి* యాధి భౌతిక దుఃఖము - వృశ్చిక, సర్పదుష్టాదులు, - ఆధి దైవిక దుఃఖము - పిడుగు, భూకంపము మున్నగు దుఃఖత్రయరహితుఁడును - అపవర్గ సౌఖ్యసంవేది బంధమోక్ష రహిత సహజానందాను భవవేదియును - మోక్షప్రదాతయు, నిర్విశేషుఁడనగా నేతి నేతి వాక్యములచే నింద్రియ సహిత శరీరత్ర యనిషేధావశిష్టుఁడు, ఘోరుఁడు మంగళ (శివ) స్వరూపుఁడును గూఢుఁడు "ఏకోదేవః సర్వభూతేషుగూడః సర్వభూత హృదయ బిలములయందుగూఢముగా నుండువాఁడు, గుణధర్మి, - సత్వ రజస్తమోగుణములే ధర్మముగాఁ గలవాఁడు (శబల బ్రహ్మము) ఇంద్రియ ద్రష్ట - జ్ఞానేంద్రియాదులకుఁ దమతమ విషయాది క్రియలందుఁ బ్రేరేపించి - భ్రూయుగ స్ధాన మందుండు ఆజ్ఞాచక్ర మందు దృష్టృత్వము వహించువాఁడు - బహుక్షేత్రజ్ఞుఁడు "క్షేత్రజ్ఞంచా పిమాంవిద్ధి సర్వక్షేత్రేషుభారత" భాః - సూర్యునియొక్క - రహస్యమైన యంతర జ్యోతి యందు - త - తపించు వాఁడా - సర్వోపాధుల యందున్న - నన్ను క్షేత్రజ్ఞునిగాఁ దెలిసికొనుము. కావున నట్టి క్షేత్రజ్ఞుఁడును - దయాసింధువు - "ఈశ్వరానుగ్రహా దేవవుంసామద్వైతవాసనా -" ఈశ్వరానుగ్రహము వలననే పురుషులకుఁ నద్వైత విచారణ యందిచ్ఛ గలుగు నట్టి దయాసింధునకు, నఖిలేంద్రియ జ్ఞాపకునకు, నిదిఘటము, నిదిపటమునను, నింద్రియార్ధఁ విషయములను తెలియజేయు తెలివియే రూపము గలవాఁడు నెఱి నసత్య మనెడి నీడతో వెలిఁగెడు నెక్కటి"
శ్లో|| శివం శైవం భావం శివమపిశివాకారమ శివం - నసత్యం శైవం తత్సివమ పిశివం శైవమనిశం - శివం శాంతం మత్వా శివపరమ తత్వం శివమితి - నజానే తత్తత్వం శివమితి నమోవేద్య. శివతే తా"|| శివుని భావము శైవం (పరమాత్మ భావము ప్రకృతి యని యర్ధము) అయినను శివా కారము - అశివమనగా న మంగళము. అనగా బ్రకృతి బ్రహ్మసంబంధమైనను - సుఖరూపము కాదని యర్ద. మెపుడును శైవము శివమే యయినను సత్యము కానేరదు. "బ్రహ్మ సత్యం జగన్మిధ్య" యని యాశయ మట్టి శివస్వరూపమును - పరమ తత్వ స్వరూప మని తెలిసికొనఁజాలునో యట్టి తెలియఁదగిన శివుని కొఱకు నమస్కరించుచున్నాను. (వివరణ) ప్రకృతియే నీడ - అదియే శైవం - పరమాత్మయే శివుఁడు - అదియే సత్య మట్టి ప్రకృతితోఁ బ్రకాశించు పరమాత్మ యనగా నసత్య మనెడు నీడతోఁ బ్రకాశించు, నెక్కటి - ఏక మనగా నొక్కరుఁడై యుండువాని కొఱకు నమస్కరించుచున్నాను - మఱియుఁ గారణుఁడు "మమయో నిర్మహద్బ్రహ్మ తస్మింగర్భాధాన స్థానము", మహద్బహ్మ - గుణసామ్యావస్ధయగు ప్రకృతి, దానియందు - గర్భం - యీ క్షణరూప సంకల్పమును ధరించుచున్నాను. దానివలన సర్వభూతములుఁ బుట్టుచున్నవి. కావునఁ గారణుఁడు, మరియు నిష్కారణుఁడు "శ్రు|| నకారణం కార్యమతీత్యనిర్మల - స్సడైవతృప్తోహమితీ హభావయ" నేను కార్య కారణముల నతిక్రమించి నిర్మలుఁడనై, సదా తృప్తిఁ గలవాఁడనై యున్న వాఁడ నని భావించుము - అట్టి నిష్కారణునకు నమస్కరింతు నని జీవ ప్రార్ధన.