గజేంద్రమోక్షణ రహస్యార్థం : పొడగానం బడకుండ డాఁగు
మ||
పొడగానం బడకుండ డాఁగు వెలికిం బోవంగ దా నడ్డమై
పొడచూపుం జరణంబులం బెనగొనున్ పో రాక రా రాక బె
గ్గడిలం గూలఁగఁదాఁచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించుఁ బ
ల్విడిఁ జీరుం దలఁగున్ మలంగు నొడియన్ వేధించుఁ గ్రోధించుచున్.
బాహ్య|| మొసలి క్రోధముచే, గజమునకుఁ దన యానవాలుఁ దెలియకుండ నదృశ్యమై, గజము తీరమునకుఁ జేరుటకు సిద్ధమై యుండ నడ్డమై తన జాడఁ జూపి, పాదములను, జుట్టి కదలనీయక భయంకరముగాఁ బడిపోవునట్లుఁ దన్నుచు లేచు తఱి నేతమువలె నుద్ఘాటించుచున్ - ఊర్ధ్వాధోభాగములకు ముంచుచుఁ దేల్చుచు, బలిమిచే జీరి తొలఁగుచు, మఱలుచు, సర్దుకొని పట్టుచు బాధించుచుండె నని తాత్పర్యము.
రహ - కామము - ఇంద్రజిత్తువలెఁ బొడగానంబడక, దాఁకొను సమయమున జీవుఁడు బంధవిముక్తికొఱకు "భవసుఖే దోషానుసంధీయతాం ఆత్మేచ్ఛావ్యవసాయతాం నిజగృహత్తూర్ణం వినిర్గమ్యతాం" జన్మసుఖ మందలి దోషమును జ్ఞప్తికిఁదెచ్చుకొని యాత్మానుసంధానము నభ్యసించి తక్షణమే గృహమును విడిచి వెడలవలయును. అను విధివాక్యము చొప్పున జీవుఁడు పై కేగునపు డడ్డమై కామాభిలాష యందుఁ జీవుని ప్రేరేపించును "ఏకం సాఖ్యంచ యోగంచ" సాంఖ్య యోగముల యొక్క గమ్యస్ధాన మొక్కటియే, కావునఁ దద్రూప పాదములను బెనవేసి పట్టి "యత్రకుంఠి భవేద్బుద్ధిః సమోహ తికధ్యతే" యెచ్చట బుద్ధి (కదలక) కుంఠీభవించునో, యదియే మోహము, అట్టి మోహము నందు ముంచి.
"కృతంమయాధికమ్ పుణ్యమ్*యజ్ఞదానాదినిశ్చితం
స్వర్గంగత్వాసుఖంభోక్షే*ఇతిసంకల్పవాన్ భవేత్
తా|| నాచే బుణ్య మధికముగాఁ జేయఁబడినది స్వర్గమున కేగి సుఖము ననుభవంచెద నను తలంపులు గలుగు నటు లూర్థ్వాధోలోకములఁ ద్రిప్పు, నొకపరి నంధతామిశ్రమునకుఁ ద్రోయుచుఁ గామము జీవుని బాధించుచుండె నని తాత్పర్యము.
వ|| ఇట్లు విస్మిత నక్ర చక్రంబయి నిర్వక్ర విక్రమంబున నల్పహృదయజ్ఞానదీపంబు నతిక్రమించు మహామాయాంధ కారంబు నుంబోలె నంతకంతకునుత్సాహ కలహసన్నాహబహువిధ జలావగాహంచిబయిన గ్రాహంబు మహాసాహసంబు నంబోరెమఱియు.
బాహ్య|| ఈ రీతిని, యచ్చెరు వందుచున్న నక్రబృందముఁ గలదై యప్రతిహతమైన బలముచే నల్పజ్ఞుని జ్ఞానదీపము నాచ్ఛాదించు మహామాయాంధకారము వడువునఁ గ్రమక్రమంబున జయోత్సాహముఁ గలిగి యుద్ధసామగ్రి (బలము) నిమిత్తమై యోజించి పెక్కు విధముల మునుఁగుచున్న నక్రము సాహసించి పోరెను.
రహ|| -ఈ రీతినిఁ గామము విస్మిత (ఆశ్చర్య)మయి, వీక్షించుచున్న యజ్ఞాన భూమికాది వ్యూహము కలదై దుర్విషయ సంకల్పబలముచే గించిజ్ఞుని జ్ఞానంబు నావరించు మహామోహాంధకారంబునుం బోలెఁ గామము పోరె నని తాత్పర్యము.
అజ్ఞాన భూమికలు-1. బీజాగ్రము 2. జాగ్రము 3. మహాజాగ్రము 4. జాగ్రత్స్వప్నము 5. స్వప్నము 6. స్వప్నజాగ్రము 7. సుషుప్తి.