పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : పాదద్వంద్వము

శా||
పాద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ష్ఖేబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్ నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై.
బాహ్య|| - ఈ యోగసంభృత ప్రార్ధన గజేంద్ర కృతముఁ గాదు. మఱేమనగా, మొసలి పూర్వభవమున నొక గాంధర్వుఁడు, దేవలుఁ డను ముని శాపవశంబున నిట్లు కరిరూపము ధరించినను "పూర్వాభ్యాసేనతేనైవహ్రేయతేహ్యవశోపిసః" అవశుఁడై పూర్వాభ్యాసము (వాసన)చే నాకర్షింపఁబడుచున్నాడు. కదా। యను గీతావచనము చొప్పున జ్ఞానముఁ గలిగి మకరి యోగావలంబకుఁడై యుం డెటులనగా; - మొసలి ముందు పాదములచే నిలువంబడి నియమిత ప్రాణియై, జ్ఞానేంద్రియ పంచకోన్మాదంబు నశింప (ప్రత్యాహారము) జేసి, బుద్ధిలతను సమాధి యను పందిరికిఁ బ్రాకుటకుఁ బ్రాకుడు కొయ్యకు హత్తించి (తగిల్చి) లేక బుద్ధిని స్థిరముగా నిల్పి "దుఃఖసంయోగవియోగం సంజ్ఞితం" దుఃఖముతో సంయోగరహితయోగ మనగా బ్రహ్మసుఖము, తదవలంబనముఁ బొందుటచే నానందించు యోగీంద్రుని విధమున, శింశుమారము, వారణపతి పాదములను బట్టుట యందు నిరవధికమై యుండె నని తాత్పర్యము. (శింశుమారము - మొసలి)
రహ|| - మొసలినిఁ గామముగాఁ బోల్చినపుడు మొసలి యోగావలంబన మొనర్చుట విరుద్ధము కదా। యను సంశయముఁ గలుగవచ్చును. గాని, పూర్వవాసన యనగా "అనాది కామో యహంస్వభావః" యీ యహంస్వభావ మనాది యగు కామ మగును. అహంకారము, ముఖ్య మనియు, గౌణ మనియుఁ దుచ్ఛ మనియుఁ ద్రివిధ. మందు ముఖ్య మహంబ్రహ్మస్మి యనియు, గౌణమహంజీవః యనియుఁ దుచ్ఛ మహందేహః యనియు శ్రుతి యుక్తము. "సఐక్షతబహుస్యాం ప్రజాయే యేతి" అనేక రూపములై పుట్టుదు నని యా పరమాత్మ సంకల్పించె నట్టి ప్రథమ సంకల్పాహంకార మనాది కామ మగును. అహం బ్రహ్మస్మి యను పూర్వవాసనయే కామమునకు స్వస్థానము. బ్రహ్మమును గూర్చి యోగావలంబనముఁ జేసె నని భావ మెటు లనగా "పాదద్వందము నేల మోపి" యిదియొక యాసనము. మఱియొక విధము. స్త్రీ, యుపాసనాపరులు, బాల, త్రిపురసుందరీ, రాజరాజేశ్వరీ, యను దేవతామంత్రసిద్ది, యనంతరముఁ బాదుకాంత మని తురీయము . ప్రకృతి పురుషు లొకే స్వరూప మని జపించుట " పాదుకాంతము" దానినే పాదద్వంద మనియు దేవాలయములలో భక్తుల శిరస్సులపై నుంచు పాదుకలు (శఠగోప మని) వచింతురు. కావున నట్టి పాదద్వందము, (శివ శక్తి సమ్మేళన) బ్రహ్మనుసంధానార్థ మైన యాసనముచే నిలువంబడి పవనుని బంధించి.
శ్రు|| పవనోబధ్యతేయేన*మనస్తే నైవబధ్యతే
మనశ్చ బధ్యతేయేన *పవనస్తేనవ బధ్యతే
తా|| వాయు, వెవనిచే నిరోధించబడునో, మనస్సు వానిచేతనే యవరోధ మగును. ఎవనిచే మనోనిర్బంధ మగునో, వానిచేతనే వాయువు నిర్బంధించఁబడును. అను శ్రుతి చొప్పున నట్లు మనో నిగ్రహముఁ జేసి " పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి"
శ్రు|| ఇంద్రియాణి హయాన్విద్ధి విషయాంస్తేషుగోచరాః" విషయముల వెంబడి పరిధావన మొనర్చు యింద్రియ హయములను మఱలించి, బుద్ధిలతకున్ మాఱాకు, హత్తించి "విద్యాత్మ వృత్తిశ్చరమేతిభణ్యతే" ఆత్మ యొక్క యావరణ భంగముఁజేయు చరమవృత్తి , జ్ఞాన మను ప్రాకుడురాట (కంచె)కు, బుద్ధిలతను, హత్తించి - అంటఁగలిపి, (వృత్తి బ్రహ్మాకారముఁ జేసి) మఱియొకవిధముగా నర్థము,
"మా" యను వర్ణబీజమును "రా" యను వర్ణ బీజమునకుఁ జేర్చి, అనగా రామ మంత్రజపితయై ‘తారకంబు మనశ్శుద్ధికిఁ గారకంబు’ మంత్రమహిమ యెట్లన
శ్లో|| ధర్మమార్గం చరిత్రేణ - జ్ఞానమార్గం చనామతః -
తధాధ్యానేన వైరాగ్యం ఐశ్వర్యం తస్యపూజనాత్||
రామ కధనమువలన ధర్మమార్గమును, నామమువలన జ్ఞానమును ధ్యానమువలన వైరాగ్యమును పూజనమువలన నైశ్వర్యమును గలుగును. *(ఇంకొక పక్షము) "రామేతి
వర్ణద్వయమాదరేణసదాస్మరన్ - ముక్తిమపైతిజంతుః కలౌయుగే కల్మషమానుషాణా మన్యత్రధర్మేఖలునాధికారః" రామ మంత్రము నిరంతరము మన్ననతో జపించిన యెడలఁ బురుషుఁడు ముక్తిఁ బొందుచున్నాడు. కలుషచిత్తులకుఁ గలియుగ మందింతకిమించిన యధికారము లేదు.
శ్లో|| నామ్నాం సహస్రం దివ్యానాం*స్మరణేయత్ఫలం లభేత్
తత్ఫలం లభతేనూనం* రామోచ్ఛారణ మాత్రతః
తా|| విష్ణు నామ సహస్రముఁ బారాయణము జేసిన మహాఫలము, రామ నామ స్మరణ మొకపరిఁ జేయుట వలనఁ గలుగును.
శ్రు|| ముముక్షూణాం విరక్తానాం *తధాచాzశ్రమవా సినాం
ప్రణవత్వా త్సవిజ్ఞేయో *యతీనాంచ విశేషతః
రామమంత్రార్ధ విజ్ఞానీ* జీవన్ముక్తో నసంశయః||
ముముక్షువులకును, వైరాగ్యవంతులకును, గృహస్థాది యాశ్రమస్ధులకును, యతీశ్వరులకును, రామమంత్రము ప్రణవము కంటె విశేషమని తెలిసి జపించవలెను. రామ మంత్రార్ధమును దెలియువాఁడు. జీవన్ముక్తుఁ డగును.
శ్లో|| శివపంచాక్షరీశైవే *మంత్రజాతే ప్రశస్యతే
నారాయణాష్టాక్షరీతు *వైష్టవేషులి శిష్యతే||
రా’ కారోవైష్ణవేగ్రాహ్యః * మకారోశైవసంగ్రహః
రామేత్యక్షరయుగ్మంతు *శైవవైష్ణవ సారవత్||
తా|| శైవులకు "నమఃశివాయ" మరియు, వైష్ణవులకు "ఓం నమోనారాయణాయ" యను మంత్రములు ప్రశస్తరము లై యున్నవి. పంచాక్షరీలోని "మ" వర్ణమును, నారాయణాష్టాక్షరీలోని "రేఫ" రా యను బీజమును గలసి, రామ మంత్రమైనది. యనగా శైవ వైష్ణవ మంత్రములలోని సారమును గ్రహింపఁబడిన దని తాత్పర్యము. ఇఁక రామమంత్రమ హిమనుగూర్చి యట్లుండ నిండు పదార్థ్యమును గ్రహింతము, "మాఱాకుహత్తించి" అను పదమునకు వేఱొక పక్షము "మరోర్బావః" మారు "మన్మథ సంబంధ మనగా సంకల్పమును" "ఆకుహత్తించి" "అ" యనగా బ్రహము "ఆ" యనగా బ్రహ్మాకారముఁ సంకల్పమును బ్రహ్మపరము జేసి (యింకొక పక్షము) " రాచేతిలక్ష్మీ వచనో మశ్చాపీశ్వరవాచకః లక్ష్మీ పతింగతిం రామంప్రవదంతి మనీషణః" "రా" యను బీజము, శక్తి, (లక్ష్మీ) బీజ మవియు, "మ" యను బీజము, శివ బీజ మనియు రామ మంత్రము శివ శక్తి సమ్మేళన మనియు నట్లు సమ్మేళనము గానిచో మంత్రమే కాదనియుఁ గావున , రామమంత్రము శివ శక్తి సమ్మేళన మనియు నట్టి రాముఁడే యీశ్వరుఁ డనియు నతండే సర్వజీవులకు గతి యనియుఁ బండితులు వక్కాణించుచున్నారు. (ఇటకొకపక్షము) రా ( హః)శబ్దము అనగా బ్రణవమును, " మ" యనగా, "మా స్మమాలంచవారణే" నివారణార్థము. ఓం కారమనగాఁ బ్రణవమును, గోరక, బ్రణవార్థమునుఁ (బ్రహ్మము నే గోరుము), మఱియొకవిధము "రా" ధనమును "మా"
నివారించి యనగా ధనమును గోరక -
శ్లో|| అర్ధమనర్ధం భావయనిత్యం*నాస్తితతస్సుఖలే
శస్సత్యమ్
ధనము, అనర్ధహేతు వనియు నందువల్ల సుఖము లేశమైనను లేదనియు మఱియొక విధము - రా - యనగా - రాగమును - మా - నివారణార్ధము - అనగా - రాగమును గోరక, విరాగియై యుండి.
శ్లో|| జ్ఞాతం తవప్రసాదేన సర్వమే తదశేషతః -
న వైరాగ్యత్ఫలంభాగ్యం న సంసారాత్పరోరిపుః||
ఓ మునిచంద్రమా। మీ యనుగ్రహము వలన వేదాంతశాస్త్రము సవిశేషముగా బోధపడినది. యెట్లన? వైరాగ్యమువంటి భాగ్యము లేదనియు సంసారమువంటి శత్రువు లేదనియు నిట్లు హత్తించి "నిష్ఖేదబ్రహ్మ పదావలమబన గతిన్" "తంవిద్యా దుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితం"
సంసార దుఃఖ సంయోగరహిత మగు యోగమే బ్రహ్మ సుఖము, అట్టి బ్రహ్మ పదావలంబనచే నానందించు యోగీంద్రుని మాడ్కిఁ గామము, జీవపాదము లగు ఆనందపాదము, తురీయపాదము (సుషుప్తి తురీయావస్థలను) నిరాటంకముగా నాక్రమించి నిర్భయముగా నుండె నని తాత్పర్యము.