పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : మునినాథా యీ కథాస్థితి

కం||
మునినాథ! యీ కథాస్థితి
వినిపింపుము వినఁగఁ నాకు వేడుక పుట్టెన్;
వినియెదఁ గర్ణేంద్రియముల
బెనుఁబండువు చేయ మనముఁ బ్రీతిం బొందన్.
బాహ్య|| ఓ మునిచంద్రమా! యిక్కధ వినుట కెంతయు సంతోష మగుచున్నది. కర్ణపుటాంజలిచే తత్కథామృతముఁ బానముఁజేసెదఁ గావున నానతిమ్ము.
రహ|| ముని యనగా || శ్రు|| "బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యే నతిష్ఠాసేత్ - బాల్యంచ పాణ్డిత్యంచ నిర్విద్య అధ మునిర మౌనంచ మౌనంచ నిర్విద్యాధ బ్రాహ్మణః" బాల్యేన అనగా బ్రహ్మజ్ఞాన బాలభావముచే విషయదృష్టినిఁ దిరస్కరించి యుండుటకుఁ గోరి, బాల్యంచ, - ఆత్మవిజ్ఞాన బాలభావమును, పాండిత్యంచ - అనాత్మజ్ఞాన తిరస్కారము. అనగాఁ బ్రపంచ సత్యత్వ భ్రాంతి నిరసనముఁ బూర్ణముగా, నభ్యసించి, మౌనము - (సంకల్పరాహిత్యము) కలుగుఁవాఁడు ముని, వాఁడే బ్రాహ్మణుఁడు. మునినాథా! యీ కథాస్ధితి అనగా నధ్యారోపాపవాదపూర్వక మగు కల్పనాకథ - ఆధ్యారోప మనగా సత్పదార్థమునం దన్య పదార్థకల్పన "రజ్జు సర్పః శుక్తి రజితః" మున్నగునవి. అపవాద మనగా - యదార్థ వస్తువును గ్రహించి ఆరోపిత వస్తుభావ నిరసనము - బ్రహ్మమునందు నామరూప జగదారోపణముఁ బిమ్మట బ్రహ్మజ్ఞానముచే నపవాదము "సర్వం బ్రహ్మైవ కేవలమ్" అని జగత్తును బ్రహ్మముగా చూచుట యగును. -
పూర్వపక్షి - "శ్రు|| అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం నిష్కలం నిష్క్రియం" శబ్దాది విషయ రహితము, నవయవ రహితముఁ, గ్రియా రహితము మున్నగు విశేషములచేఁ బరిగణింపఁబడిన బ్రహ్మము నందు కల్పన యెట్లు కలిగె. నది శ్రుతివిరోధము - నద్వైత భంగము కాదా.
సిద్ధాంతి - శ్రు|| తస్మిన్త్రి గుణసామ్యాసా - మూలప్రకృతిసౌజ్ఞికా, శుక్లలోహిత కృష్ణైకా శక్తిరాసీత్ స్వయంప్రభా - మరుభూమౌజలం శక్తౌరౌప్యం స్థాణౌచ పూరుషః - స్ఫటికేపిచ రేఖేన - భాసమానానిజభ్రమాత్" అట్టి విశేషణ యుక్త వ్యాపక చైతన్య మగు బ్రహ్మమునందు, ఎండమావులందు జలము - ముత్యపుఁ జిప్ప యందు వెండి - స్థాణువు నందుఁ బురుషుఁడు - స్ఫటికము నందు రేఖలు - వలెఁ, ద్రిగుణరూపి యగు శక్తి (ప్రకృతి) స్వయంప్రకాశమానమై కలిగెను. ఇదియే అద్వైత మతము, భ్రమచే కల్పితమైన పదార్థములు సత్యమైనచో మీ ప్రశ్న, ముపపన్న మగును - గాని, స్వప్నసత్యమువలెఁ బూర్వోత్తరముల యందుఁ దోచక వర్తమానము నందు మాత్రముఁ దోచునది "ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా" యేది ఆద్యంతముల యం దభావమో అది ప్రస్తుతమునఁ గూడ, లేదనియే నిశ్చయింపబడును. "మాయామాత్ర మిదం ద్వైత మద్వైతం పరమార్థతా - మాయా కార్యాదికం నాస్తి - మాయా నాస్తి జగన్నహి - నేహనా నాస్తికించన, ననిరోధో నచోత్పత్తి ర్నచబద్ధో నచ సాధకః న ముముక్షు ర్నవైముక్తః ఇత్యేషా పరమార్థతా" ద్వైతముగాఁ దోచు దృశ్యమాన ప్రపంచము మాయా మాత్రమే కాని సత్యము కాదు. పరమార్థమున అద్వైతమే నిశ్చయము - మాయా కార్యాదికమును - మాయయును - జగత్తును లేవు - నానాత్వ మేమియు లేదు. నిరోధము - ఉత్పత్తి, బద్ధము, సాధనము - ముముక్షువును లేరు, అనెడి మొదలగు శ్రుతు లన్నియు నద్వైతమునే నిశ్చయించుచున్నవి. ఇందులకు యోగవాశిష్ఠ మందు శ్రీరామచంద్రునకు శైశవమున నిద్రపట్టుటకునై, దాదిచే నొక కథ చెప్పఁబడినది యెటులనఁగా -
శ్లో||
ద్వౌనజాతౌతధైకస్తు గర్భఏవ నచ స్థితః
వసంతి తే ధర్మ యుక్తాః అత్యంతాసతిపట్టనే
స్వకీయాచ్ఛూన్యనగరా - న్నిర్గత్యవిమలాశయాః
గచ్ఛంతో గగనేవృక్షాన్ - దదృశుఃఫలశాలినః
భవిష్యన్నగరేతత్ర - రాజపుత్రాస్త్ర యోపితే
సుఖమధ్యస్థితాః పుత్ర - మృగయావ్యవహారిణః||
ఓ శ్రీరామచంద్రా। అసత్పట్టణ మందు మువ్వురు రాజపుత్రులు కలరు. వారలలో నొకఁడు గర్భము నందు పతనము లేనివాడును - పరిశిష్టద్వయమును మిగిలిన యిద్దరు పుట్టుక లేనివారలు నయి, స్వకీయ శూన్య నగరము నుండి వెడలి గగనమునందు ఫలవంతము లగు వృక్షములను జూచి భవిష్య న్నగరము (ముందు కట్టబోవు పట్టణము) నుండి వేటాడ వెడల నిచ్ఛా వినోదులై యుండిరి. ఇట్లు మాఱుప్రశ్నలేనిచో నుడువుట కెడతెగని కల్పిత కథ లెన్నియో చెప్పఁబడును - సీ||
అజ్ఞులు వచియించు నాఖ్యాయికంబోని
జగముల సృష్టి దృ ష్టాంత మగును
అది యెట్టు లన్నచో నాకాశకుసుమంబు
గంధర్వనగరస్థ కాంత దురిమి
ఆభాస వస్త్రమ్ము నాచ్ఛాదన మొనర్చి
మరుభువిజలముల మగ్న మగుచు 
ద్రుమరహితం బైన తోటలో విహరించి
సంగహీనునితోడ సరసమాడి
తే||
యిండ్లు లేనట్టి పట్టణ మిరవుఁ జేసి
కనియె సుతులను వంధ్యయై కఱవుఁదీఱ
ననెడు సామెతవలె జగ మనృత మగును
గాని వాచావికారమై కానబడును.
కావున నానందముగ వినియెదఁ జెప్పు మని.