పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : నీరాట వనాటములకుఁ

కం||
నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.
బాహ్య|| ఉదక మందు సంచరించు మకరమునకును - అరణ్య మందుఁ దిరుగు ద్విరదంబునకును - కలహ మెట్లు సంభవించె నా వెనుక నా కుంజర ప్రణాదం బాలించి వనమాలి మొసలినిఁ గూల్చి యేనుఁగు నెటులు రక్షించెను?
రహ|| నీరు, అనగా బుద్ధి, చిత్స్వరూపి, శ్లో|| యో వైనర్వ గతో విష్ణుశ్చిత్స్వ రూపీ నిరంజనః నవీనరుద్రరూపేణ గంగాంభోనాత్ర సంశయః" చిత్స్వరూప మగు సర్వవ్యాపక విష్ణువే ద్రవ (జల) రూప మయి, నిస్సంశయముగా గంగారూపము నొందుచున్నాడు. అట్టి జలరూప బుద్ధియే సంకల్ప రూపము నొందుచున్నది. "బుద్ధి సంకల్పితాకారా ప్రయాతి మనసాస్పదం - సంకల్ప మనసీ భిన్నో నకదాచన కేనచిత్" బుద్ధి యే సంకల్ప రూప మగు మనోరూపము నొందుచున్నది. సంకల్ప మనస్సుల కెట్టివారును భిన్నత్వ మెన్నఁడుఁ గలుఁగఁజేయఁజాలరు. కావున నట్టి సంకల్ప జల జనిత కామము నకును "సంకల్ప ప్రభవాన్ కామాన్" కామమా। నీ జన్మమూలము నే నెఱుంగుదు, సంకల్పమువల్లనే కదా పుట్టుచున్నావు. అట్టి కామమునకును, వనాట మనగా "వస్యతే సేవ్యత ఇతి వనం" జీవులచే సేవింపఁబడునది. అధిష్ఠాన చైతన్యము దాని యందుఁ జరించునది. ఆత్మ యొక్క కళ యగు ప్రతిబింబితి జీవునకును - సంసారరూప ఘోరాటవి యందుఁ గలహ మెట్లు కలిగెను? పురుషోత్తమునిచే నా పోరు (భవదుఃఖము) ఎట్లు నివారింపఁబడెను? అని జనపతి ప్రశ్నింప. జీవుఁ డనగా శ్లో|| చైతన్యం యదధిష్ఠానం లింగదేహశ్చయః పునః చిచ్ఛాయా లింగదేహస్థాతత్సంగో జీవ ఉచ్యతే" అధిష్టాన చైతన్యము - సూక్ష్మదేహము - నా సూక్ష్మదేహమును లింగదేహ మందు బ్రతిబింబిత కళయునుఁ గలసి జీవుఁ డయ్యెను.