పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : నర్తకుని భంగిఁ

కం||
ర్తకుని భంగిఁ బెక్కగు
మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర? రెవ్వని
ర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.
బాహ్య|| నాట్యశీలుని గతిఁ బెక్కు వేషము (రూపము)లతో నెవ్వఁడు విహరించునో, మునులు దేవతు లెవనిని, గొనియాడుట కసమర్థులో యెవని యొక్క రహస్య మితరు లెఱుఁగఁజాలరో, యట్టివాని నుతియించెద నని తాత్పర్యము.
రహ|| అనేకములగు నుపాధుల యం దంతర్యామియై నటునిభంగిఁ, జఱించునో, యనగా "యఃపృధివ్యాంతిష్టన్పృధ్వ్యామంతరో యం పృధివీన వేదయస్యపృధివీశరీరంయః పృధివీమంతరోయ మయత్యేష - తఆత్మాన్తర్యామ్యమృతః" యేది భూమి యందున్నదై భూమి కంటె నభ్యంతరమో - భూమి దేనినిఁ దెలిసికొనలేదో, భూమి యెవనికి, (ఉపాధి) శరీరమో, యేది భూమి లోపల నున్నదై నియమించుచున్నదో , యది నాశనములేని నీ యొక్క యంతర్యామి స్వరూపమై యున్నది. దివిజులు, మునులు, గీర్తింప నేర రెవ్వని, "అతీతః పంథానం తవచమహిమాజ్గనసయో - రతద్వ్యావృత్యాయం చకితమభిధత్తేశ్రుతిరపి||" హే శంకరా! నీ యొక్క మహిమము మార్గము నతిక్రమించి యున్నది యనగా వాజ్గ్మనస్సుల కగోచరమైనది - శ్రుతికూడ భయపడి వణఁకుచు నతద్వ్యావృత్తి - యతత్వమసియనగాఁదత్, త్వం, అసి, యనుభేదము లేనిదై, యంతా బ్రహ్మమే యని చెప్పినది కావున నగమ్య గోచరుఁ డగు వాని నుతింతు నని భావము.