గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఎక్కడఁ జూచిన
కం||
ఎక్కడఁ జూచిన లెక్కకు
నెక్కువ యై యడవి నడచు నిభయూధములో
నొక్క కరినాథుఁ డెడతెగి
చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్.
బాహ్య|| అడవిలో నెచ్చోటఁ జూచినను, మిక్కుటమై
సంచరించు గజ సమూహములో నొక్కగజనాధుఁడు ప్రియ బృందముతో మార్గముఁ దప్పిపోయె నని తాత్పర్యము.
రహ|| సమష్టిమాయా ప్రతిబింబిత - ఈశ్వర - కూటస్థ హిరణ్మయాదులనుండి, వ్యష్టిరూప, అవిద్యాప్రతిబింబిత - జీవస్వరూపమును బొంది యష్టవిధ (అపరా) ప్రకృతి సమూహముతో - సంసారాణ్యములో జిక్కె నని తాత్పర్యము.
సమష్టి - మూలప్రకృతి యందుఁ బ్రతిబింబితుఁడు - సదాశివుఁడు.
శ్రు|| సదేవ ఇదమగ్రఆసీత్
మాయ - (గుణసామ్యావస్ధ యందుఁ బ్రతిబింబితుఁడు ఈశ్వరుఁడు - మహత్తత్వము నందుఁ బ్రతిబింబితుడు - హిరణ్మయుఁడు.
వ్యష్టి
అవిద్యా ప్రతిబింబితుఁడు-జీవుఁడు.
| సమిష్టి | | | వ్యష్టి |
|---|---|---|
| (అధిదైవము) | | | (ఆధ్యాత్మము) |
| 1 పృధివి | | | శారీరమయ్యః (శరీరమయుఁడు) |
| 2 ఆపః | | | రైతసః (రేతస్సంబంధి) |
| 3 అగ్ని | | | వాగ్మయపురుషః |
| 4 వాయుః | | | ప్రాణమయపురుషుఁడు |
| 5. ఆదిత్యః | | | చాక్షుషఃపురుషః |
| 6. దిశః | | | శౌత్రః (శోత్రసంబంధుఁడు) |
| 7 చంద్రః | | | మానసః |
| 8 విద్యుత్ | | | తైజసః (తేజోమయుడు) |
| 9 స్తనయిత్నుః | | | సౌవరః (స్వరమందైనవాఁడు) |
| (గర్జనము) | | | ` |
| 10 ఆకాశః | | | హృదయాకాశః (దహరము) |
| 11 ధర్మః | | | ధార్మికః |
| 12 సత్యం | | | సాత్యః |
| 13 మానుషం | | | మనుష్యం |
| జాతి | | | వ్యక్తిః |
| 14 భూతములు | | | జీవులు |
| 15 సామాన్యము | | | విశేషము |
సమష్టినుంచి వ్యష్టిరూపమును బొందుటే - యాత్మవలన నెడబాటునొంది సంసారణ్యములోఁ జిక్కుట లేక తప్పిపోవుట యని తాత్పర్యమ. -
వ|| ఇట్లు వెనుక, ముందట, నుభయపార్శ్వంబులఁ దృష్టార్దితంబులై యరుఁగు దెంచు నేనుఁగు గములం గానకఁ దెఱఁవుదప్పి తొలంగుఁడు పడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబుఁ గాకుండుటం జేసి, దానును, దన కరేణు సముదయంబును నొక్క తెరువై పోవుచు.
బాహ్యము|| ఇప్పగిదిఁ దప్పిఁగొని వచ్చు నేనుంగు గుంపులను గానకఁ దెరవుఁదప్పి యీశ్వర ప్రేరితమున విస్మృతచిత్తయై యుండుటఁ జేసి యాశ్రిత కరేణు సముదయంబుతోఁ బోవుచు (ముందు కన్వయము)
రహ|| -జీవుఁడు స్వస్థానఁబు దప్పి; యన్నమయాదికోశంబులతో, జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానాద్యావరణోపాధులతోడఁ బరిభ్రమణ శీలుండై-