పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఏ రూపంబున దీని గెల్తు

శా||
రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.
బాహ్య|| ఇమ్మకరము నెట్లు నిగ్రహించుట - యింక నే దైవమునుఁ బ్రార్ధింతు, నెవరిం గూర్చి ఘోషింతును, సమస్త వ్యవహార న్యాయాన్యాయాంతములను వీక్షించువారు లేరా? మ్రొక్కెద నని పూర్వజ్ఞానవాసనా బలముచే నిట్లు తలపోసెను,
రహ|| ఇక్కామము నే రూపము (మార్గము) చే ననగాఁ గర్మ భక్తి, జ్ఞాన, మార్గములలో దేనిచే గెలిచెద ననగా
గీ|| రాజులైననుఁ బుడమి రా *రాజులైన
యోగులైనను, దివి మహా *భోగులైన
నిష్టులైనను, న్యాయ ప్ర*విష్టులైన
స్త్రీల పాదంబులకును, దా *సీలుగారె||
తా|| కావునఁ గామోద్రేకమువలన యోగములు; బలవియోగ మగుటచేఁ గామమును గెలువఁజాల రని భావము. - ఇటమీద నే వేలుపును జింతింతు "ఆరోగ్యం భాస్కాదిచ్ఛే ద్ధనమిచ్ఛేద్ధుతాశనాత్ - ఐశ్వర్యమీశ్వరాదిచ్ఛేత్ - మోక్షమిచ్ఛేజనార్దనాత్" ఆరోగ్యము - ధనము - ఐశ్వర్యము మోక్షమునుగోరువారలు, సూర్య - అగ్ని - యీశ్వర - జనార్దనులను, యధాక్రమంబున, గోరవలయును.
శ్లో|| క్షిప్రంహిమానుషేలోకే*సిద్ధిర్భవతి కర్మజా
అంతవత్తుఫలం తేషాం* తద్భవత్యల్పమేధసాం
దేవాం దేవయజోయాంతి*మద్భక్తాయాంతి మామపి
తా|| మనుష్య లోక మందలి ఫలసిద్ధులు పూర్ణముగా సిద్ధించునుగాని, ఫలముగూడ కొలదికాలమే యుండును. కావున, నే వేల్పును జింతింతు ననగా ఫలాపేక్షరహితుఁడనై, మోక్షము, (కామవిముక్తి) కొఱకు నీశ్వరుని భక్తితో నారాధింతు నని యాశయము, సర్వవ్యాపక శీలుఁ డగు శ్రీమహావిష్ణువు లేడా యని జీవుఁడు ప్రార్ధించుచున్నాడు.